Indian Artcrafts: బ్రిటన్‌ మ్యూజియాల్లో వెలకట్టలేని భారత కళాఖండాలు!

భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటన్‌ ఇక్కడి నుంచే ఎన్నో నిధులునిక్షేపాలను దోచుకుంది. ఈ విషయంలో మనం సాధారణంగా బ్రిటన్‌ రాణి కిరీటంలో ఉన్న మన కోహీనూర్‌ వజ్రం గురించే మాట్లాడుకుంటాం. కానీ.. భారతీయ సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఎన్నో వెలకట్టలేని కళాఖండాలను మనదేశం

Updated : 27 Oct 2021 12:49 IST

భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటన్‌ ఇక్కడి నుంచి ఎంతో విలువైన సంపదను తమ దేశానికి దోచుకెళ్లింది. ఈ విషయంలో మనం సాధారణంగా బ్రిటన్‌ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్‌ వజ్రం గురించే మాట్లాడుకుంటాం. కానీ.. భారతీయ సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఎన్నో వెలకట్టలేని కళాఖండాలను మనదేశం నుంచి ఎత్తుకెళ్లింది. అయితే వాటిలో కొన్ని భారత చక్రవర్తులే బహుకరించగా వాటిని బ్రిటన్‌కు తరలించారు. అలా అనేక కళాఖండాలు ఇప్పటికీ బ్రిటన్‌లోని పలు మ్యూజియాల్లో దర్శనమిస్తున్నాయి. భారతీయులంతా వాటిని మన దేశానికి తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకొనే కొన్ని కళాఖండాలను చూద్దాం..!

హరిహర విగ్రహం


(Photo: British Museum Twitter)

మధ్యప్రదేశ్‌లోని కజురహో దేవాలయంలో ఉండే హరిహర విగ్రహం అప్పట్లో అపహరణకు గురైంది. ఎన్నో చేతులు మారి చివరికి లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియానికి చేరింది. ఇసుకరాయితో చేసిన ఈ విగ్రహంలో సగభాగం శివుడు, మరో సగభాగం విష్ణుమూర్తి అవతారం కనిపిస్తుంటుంది. ఈ విగ్రహానికి నాలుగు చేతులు ఉండగా కుడివైపు రెండు చేతుల్లో శివుడి త్రిశూలం, జపమాల ఉన్నాయి. ఎడమవైపు రెండు చేతుల్లో విష్ణుమూర్తి శంఖు, చక్రం ఉన్నాయి. ఈ విగ్రహం వెయ్యి ఏళ్ల కిందటిదని బ్రిటీష్‌ మ్యూజియం పేర్కొంది.


సుల్తాన్‌గంజ్‌ బుద్ధ

(Photo: wikimedia / Birmingham museums)

1862లో బిహార్‌లోని బగల్‌పూర్‌ జిల్లా సుల్తాన్‌గంజ్‌ ప్రాంతంలో రైల్వే నిర్మాణంలో బయటపడ్డ బుద్ధుడి విగ్రహం ఇది. ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌ మ్యూజియంలో ఉంది. 2.3మీటర్ల ఎత్తుండే ఈ విగ్రహాన్ని 500కిలోల రాగితో తయారుచేశారు. సుమారు 1500 ఏళ్ల కిందటిగా భావిస్తున్న ఈ విగ్రహం గుప్తుల శైలిలో ఉండటం గమనించవచ్చు. 


టిప్పు సుల్తాన్‌ ఖడ్గం.. చెక్కతో చేసిన పులి బొమ్మ.. వ్యక్తిగత వస్తువులు

(Photo: wikimedia / V&A museum, London)

17వ శతాబ్దంలో మైసూర్‌ను టిప్పుసుల్తాన్‌ పరిపాలించారు. గొప్ప చక్రవర్తిగా పేరున్న ఆయన.. 1799లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలగాలతో జరిగిన యుద్ధంలో మరణించారు. అయితే, టిప్పు సుల్తాన్‌ మరణించగానే ఆయన గదిలో ఉన్న విలువైన వస్తువుల్ని ప్రత్యర్థులు దోచుకెళ్లారు. మరణానికి ముందు కొన్ని వస్తువుల్ని ఇతరులకు బహుకరించారు. అలా అపహరణకు గురైన, బహుకరించిన వస్తువుల్లో ఖడ్గం, టిప్పు సుల్తాన్‌ ఉంగరం, అత్తరు, చెక్కతో చేసిన పులి బొమ్మ ప్రస్తుతం బ్రిటన్‌లో వేర్వేరు మ్యూజియాల్లో కనిపిస్తాయి.


షాజహాన్‌ మద్యం తాగిన పాత్ర

(Photo: wikimedia / V&A Museum no. IS.12-1962)

వంచి ఉన్న పక్షి ఈక ఆకారంలో వైట్‌ నైఫ్రైట్‌ రాయితో తయారు చేసిన ఓ పాత్ర ప్రస్తుతం బ్రిటన్‌ మ్యూజియంలో కనిపిస్తుంది. దాన్ని మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్‌ మద్యం తాగడానికి ఉపయోగించేవారట. 1657లో ఈ పాత్రను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇది 1962లో విక్టోరియన్‌ అండ్‌ అల్బర్ట్‌ మ్యూజియం చెంతకి చేరింది. 


మహారాజా రంజిత్‌సింగ్‌ సింహాసనం

(Photo: wikimedia / V&A Museum no. 2518 IS)

సిక్కు సామ్రాజ్యంలో పేరొందిన చక్రవర్తి మహారాజా రంజిత్‌ సింగ్‌. ఆయన కోసం హఫీజ్‌ మహమ్మద్‌ ముల్తానీ అనే స్వర్ణకారుడు 1820-1830కాలంలో ఓ సింహాసనాన్ని తయారు చేశాడు. కలప, బంక, మెటల్‌తో సింహాసనం తయారు చేసి.. దానిపై బంగారుపూత వేశాడు. కమలం పూవు ఆకారంలో కనిపించే ఈ సింహాసనంపై మహారాజా రంజిత్‌ సింగ్‌ చాలా అరుదుగా కూర్చునేవారు. రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత 1849లో ఆ సింహాసనాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఈ సింహాసనం విక్టోరియన్‌ అండ్‌ అల్బర్ట్‌ మ్యూజియంలో ఉంది.


అంబికా

(Photo: wikimedia / Jononmac46 / British Museum)

తొమ్మిదవ శతాబ్దానికి చెందిన అంబికా విగ్రహం మధ్యప్రదేశ్‌లోని ధర్‌ ప్రాంతంలో బయటపడింది. ఈ విగ్రహం 1875లో బ్రిటీష్‌ రాజ్‌లో పనిచేసే మేజర్‌ జనరల్‌ విలియమ్‌ కిన్‌కెయిడ్‌ కంటపడటంతో వెలుగులోకి వచ్చింది. తెల్లరాయితో చెక్కిన ఈ దేవత శిల్పం కొన్నాళ్లకు అనూహ్యంగా ఎవరికి కనిపించలేదు. ఆఖరికి 1886లో లండన్‌లోని బ్రిటీష్‌ మ్యూజియంలో దర్శనమిచ్చింది. ఈ విగ్రహాన్ని తిరిగి మధ్యప్రదేశ్‌లోని సరస్వతి దేవాలయానికి ఇచ్చేయాలని అక్కడి ప్రజలు, పాలకులు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు. 


అమరావతి శిల్పాలు.. శాసనాలు

(Photo: wikimedia / the British Museum - Asian Gallery - Amravati) 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఏర్పాటు చేసిన అమరావతికి వేల ఏళ్ల ప్రాచీన చరిత్ర ఉంది. బౌద్ధ మతానికి ప్రసిద్ధి గాంచిన అమరావతిలో ఎన్నో శిల్పాలు, శాసనాలు 1800లో బయటపడ్డాయి. వాటిని వెంటనే అప్పటి బ్రిటీష్ అధికారులు లండన్‌ మ్యూజియానికి తరలించారు. ప్రస్తుతం 120కిపైగా చలవరాయితో చెక్కిన శిల్పాలు, శాసనాలు మ్యూజియంలో చూడొచ్చు. వాటిని తిరిగి భారత్‌కు తీసుకురావడం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, యూనెస్కో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని