Hyderabad House: దిల్లీలో ఉన్న మన ‘హైదరాబాద్‌ హౌస్‌’గురించి తెలుసా?

దేశాధినేతలతో దౌత్య సంబంధాలకైనా, విదేశీ ప్రముఖులతో ఛాయ్‌పే చర్చలకైనా.. విలేకరుల సమావేశాలైనా, ముఖ్య కార్యక్రమాలైనా అన్నింటికీ ఒకటే వేదిక. 

Published : 23 Apr 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశాధినేతలతో దౌత్య సంబంధాలకైనా, విదేశీ ప్రముఖులతో ఛాయ్‌పే చర్చలకైనా.. విలేకరుల సమావేశాలైనా, ముఖ్య కార్యక్రమాలైనా అన్నింటికీ ఒకటే వేదిక. అదే దిల్లీలో ఉన్న హైదరాబాద్‌ హౌస్‌. ఏ దేశ అధ్యక్షులైనా మన దేశంలో పర్యటిస్తే దీని గడప తొక్కాల్సిందే. అతిథిగా రాచమర్యాదల రుచి చూడాల్సిందే. నిజాం ప్రభువుల కలల సౌధంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం దేశ రాజధాని నగరంలో హైదరాబాద్‌ దర్పానికి ప్రతిబింబంగా నిలుస్తోంది.

వందేళ్ల చరిత్ర..

దిల్లీ నగరం నడిబొడ్డున దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హైదరాబాద్‌ హౌస్‌ ఎందరో ప్రముఖులకు ఆహ్వానం పలికింది. అందులో అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇజ్రాయెల్‌ మాజీ అధ్యక్షుడు నెతన్యాహు ఉన్నారు. దౌత్యపరమైన చర్చలు, ఒప్పందాలకు గంభీరమైన ఈ ప్యాలెస్‌ వాతావరణమే సరైందని అధికారులు భావిస్తారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఒకప్పటి ఈ రాజమహల్‌ను చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఎంతో ఇష్టపడి కట్టించుకున్నాడు. అప్పట్లోనే ఈ నిర్మాణం కోసం రూ. 1.20 కోట్లకు పైనే వెచ్చించారంటే మాటలు కాదు. సీతాకోకచిలుక ఆకారంలో, చూడగానే రాజసం ఉట్టిపడేలా ఉండే దీని నిర్మాణ శైలి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

అప్పట్లోనే కోటి దాటింది..

దిల్లీలో తమ విడిది కోసం ఒక భవనం ఉండాలని భావించిన ఏడో నిజాం ఈ భారీ కట్టడానికి శ్రీకారం చుట్టాడు. అందుకోసం విదేశీ వాస్తు శిల్పి ఎడ్విన్‌ లుటియిన్స్‌కు ఈ బాధ్యతలను అప్పగించాడు. యూరోపియన్‌‌- మొఘలుల శైలిని కలగలుపుతూ దీనిని నిర్మించారు. ఎత్తైన గుమ్మటం దీని ప్రధాన ఆకర్షణ. బర్మా నుంచి తెప్పించిన టేకును ఇందులో వినియోగించారు. లండన్‌, న్యూయార్క్‌ల అలంకరణ శైలిని అనుసరించారు. ఇలా రూ.26 లక్షల అంచనా వ్యయంతో మొదలైన నిర్మాణం రూ. కోటి దాటింది. 1926లో నిర్మాణం ప్రారంభించగా రెండేళ్లలో పూర్తి చేశారు. రాణుల కోసం 4 అంతఃపుర మందిరాలతో కలిపి 36 గదులు నిర్మించారు.

నిజాం కుమారుల మెప్పు పొందలేక..

విదేశీ ప్రముఖులకు ఎంతగానో నచ్చిన ఈ ప్యాలెస్‌ను నిజాం రాజు కేవలం నాలుగు సార్లు మాత్రమే సందర్శించాడు. ఇస్లాం సంప్రదాయ పద్ధతికి కాస్త భిన్నంగా, ఆధునిక యూరోపియన్‌ శైలిలో నిర్మించడంతో ఇందులో ఉండేందుకు నిజాం కుమారులు ఇష్టపడలేదు. దీంతో స్వాతంత్య్రం అనంతరం ఇది హైదరాబాద్‌ హౌస్‌గా మారింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని