భాష మారింది.. ప్రాణం పోయింది!

దేన్నైనా వినియోగించే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. వాటి ఉత్పత్తిదారులు ప్రచురించే విషయాలు అర్థంకాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. అలా కాకుండా నచ్చినట్టు చేస్తామంటే.. చివరికి నష్టమే మిగులుతుంది. ఇదంతా ఎందుకు...

Published : 17 Oct 2020 12:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ వస్తువునైనా వినియోగించే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. వాటి ఉత్పత్తిదారులు ప్రచురించే విషయాలు అర్థంకాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి. అలా కాకుండా నచ్చినట్టు చేస్తామంటే.. చివరికి నష్టమే మిగులుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఒకసారి ఇరాక్‌లో పంట వేయడానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని అక్కడి ప్రజలు తప్పుగా అర్థం చేసుకొని తినడానికి ఉపయోగించారు. ఫలితంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు.. వేల సంఖ్యలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మెర్క్యూరీ ఫంగీసైడ్‌గా పనిచేస్తుంది. అందుకే ధాన్యానికి ఫంగస్‌ పట్టకుండా, చెడిపోకుండా ఈథైల్‌ మెర్క్యూరీని వాడుతుంటారు. అయితే, కొన్ని దశాబ్దాల కిందట ఇరాక్‌లో గోధుమలు పండించటం తగ్గించడంతో 1971 నాటికి ఏకంగా కరవు ఏర్పడింది. దీంతో అప్పటి ఇరాక్‌ ప్రభుత్వం మంచి పంట దిగుబడి ఇచ్చేలా నాణ్యమైన గోధుమ గింజలను దేశానికి దిగుమతి చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో మెక్సికోలో రూపొందించిన మెక్సిపాక్‌ అనే రకం గోధుమ గింజల్ని పంట వేయడానికి ఎంచుకున్నారు. అక్టోబర్‌.. నవంబర్‌లో వేసే పంట కోసం 73వేల టన్నులకుపైగా గోధుమల గింజలు, 22వేల టన్నులకు పైగా బార్లీ గింజలకు ఆర్డర్‌ ఇచ్చారు. అయితే మెక్సికో నుంచి ఇరాక్‌కు రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి.. గింజలు చెడిపోకుండా మెర్క్యూరీని కలపాలని, వాటికి గులాబి రంగు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈథైల్‌ మెర్క్యూరీ కలిపిన గింజలని ఇంగ్లిష్‌, స్పానీష్‌ భాషల్లో ముద్రించిన బస్తాల్లో నింపి ఎగుమతి చేశారు.

అయితే, ఆర్డర్‌ చేసిన ధాన్యం వచ్చేసరికి పుణ్యకాలం ముగిసింది. రైతులు స్థానికంగా లభించే గింజలతోనే పంటలు వేసేశారు. అయినా ప్రభుత్వం మెక్సికో నుంచి తెప్పించిన ధాన్యాన్ని మూడో వంతు తీసుకున్న నినావా, కిర్కుక్‌, ఎర్బిల్‌ గవర్నరేట్లు తమ పరిధిలో ఉన్న ప్రజలకు ఉచితంగా, తక్కువ ధరకే అమ్మేశాయి. అయితే, ఈ బస్తాలపై గోధుమలు తినడానికి పనికిరావు అని ఇంగ్లీష్‌, స్పానీష్‌ భాషలో రాశారు. అది ప్రజలకు అర్థం కాక.. ఇవి కూడా తినే గోధుమలే అనుకున్నారు. కొందరు వీటిని పశువులకు పెట్టగా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. అక్కడి ప్రజలు కూడా గోధుమలతో ఆహారం వండుకొని తినడం మొదలుపెట్టారు. మొదట్లో ఏం కాకపోయినా మెర్క్యూరీ కలిపిన గోధుమలు తిన్న 16 నుంచి 38 రోజులకు ప్రజలు అస్వస్థతకు గురవడం మొదలైంది. కొందరు కంటిచూపు కోల్పోతే, మరికొందరు మతిస్థిమితం తప్పారు. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో జనాలు ఇబ్బంది పడ్డారు. నిపుణులు మెర్క్యూరీ కలిపిన గోధుమలను తినడం వల్లే ఇదంతా జరిగిందని నిర్ధరించారు. ఈ ఘటనలో మొత్తం 459 మంది మరణించగా. ఆరువేల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. కనీసం పది వేల మందికైనా మెదడు దెబ్బతిని ఉంటుందని అంచనా వేశారు. ఇరాక్‌లో ఇలాంటి ఘటనలే అంతకుముందు రెండుసార్లు చోటుచేసుకోవడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగానూ విషపూరిత ధాన్యాలు తిని ప్రజలు మృతి చెందే కేసులు పెరుగుతుండటంతో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌,  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కలిసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని సూచనలు చేశాయి. విషపూరిత ధాన్యాలు ఉండే బస్తాలపై స్థానిక భాష, ప్రమాదకరమని గుర్తించే చిహ్నాలు ఉండాలని స్పష్టం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని