Araku tour: అరకు టూర్‌ ప్లాన్‌ చేశారా..?

IRCTC Vizag-araku holiday package: ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాల గురించి తెలుసుకోండి..

Updated : 10 Oct 2022 11:02 IST

ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైపోయారని భావిస్తున్నారా? లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా? సరైన టూరిస్ట్‌ స్పాట్‌ కోసం వెతుకుతున్నారా? అలాంటి వారికి పచ్చదనం కప్పుకొన్న ప్రకృతి అందాలను పరిచయం చేస్తూ చల్లటి సాయంత్రం వేళ చక్కని కాఫీ అందించే ప్రముఖ పర్యాటక ప్రాంతం.. అరకు మీకు స్వాగతం పలుకుతోంది. భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ అరకు వెళ్లాలనుకునేవారి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో విశాఖ నగర సందర్శనతో పాటు అరకు అందాలను కూడా వీక్షించొచ్చు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌/రైల్వే స్టేషన్/ బస్టాండ్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ.. మళ్లీ అక్కడికి చేరుకోవడంతో ముగుస్తుంది. రెండు రాత్రులు, మూడు రోజుల పాటు సాగే ఈ టూర్‌ ప్యాకేజీ ధర, సందర్శనీయ స్థలాలు, ఇతర వివరాల గురించి తెలుసుకుందాం పదండి..

వైజాగ్‌- అరకు హాలీడే ప్యాకేజీ పేరిట ఐఆర్‌సీటీసీ దీన్ని అందిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సహా ఎక్కడి వారైనా విశాఖపట్నం చేరుకోవడంతో ఈ ప్యాకేజీ మొదలవుతుంది. ఈ ప్యాకేజీ రూ.6,160 నుంచి (ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ) ప్రారంభమవుతుంది. డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.8,610, సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.15,730 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో ఉదయం టిఫిన్‌, రాత్రి డిన్నర్‌ భాగంగా ఉంటాయి. ఎయిర్‌పోర్ట్‌/ రైల్వేస్టేషన్‌/ బస్టాండ్‌లో పికప్‌, డ్రాపింగ్‌, బస, ఇన్సూరెన్స్‌ వంటివి కవర్‌ అవుతాయి. ఏసీ వాహనంలో ప్రయాణం ఉంటుంది.

తొలిరోజు పర్యాటకులను విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్/రైల్వేస్టేషన్/బస్టాండ్ దగ్గర ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్‌ చేసుకుంటారు. తొలుత హోటల్‌లో చెక్‌-ఇన్‌, బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్ పర్యటన ఉంటుంది. రామానాయుడు ఫిలిమ్ స్టూడియో (సోమవారం మాత్రమే), రుషికొండ బీచ్ సందర్శించొచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత కైలాసగిరి, సబ్‍మెరైన్ మ్యూజియం (సోమవారం హాలీడే), బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ సందర్శించొచ్చు. రాత్రికి విశాఖలోని హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది. 

రెండో రోజు ఉదయం (8 గంటలకు) బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అరకు బయల్దేరి వెళ్లాల్సి ఉంటుంది. దారిలో తైడా జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించొచ్చు. సాయంత్రం మళ్లీ విశాఖ బయల్దేరాల్సి ఉంటుంది. రాత్రికి విశాఖపట్నంలోనే హోటల్‌లో బస చేయాలి.

మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పర్యాటకులను విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్/రైల్వేస్టేషన్‌/ బస్టాండ్ దగ్గర డ్రాప్ చేయడంతో ప్యాకేజీ ముగుస్తుంది. అయితే, మధ్యాహ్నం భోజనం, బోటింగ్‌ ఛార్జీలు, ప్రవేశ రుసుములు వంటివి ప్యాకేజీలో ఉండవు. వాటికి పర్యాటకులే చెల్లించుకోవాలి. అలాగే పర్యాటకులు ఒక్క డోసు వ్యాక్సిన్‌ అయినా వేయించుకోవాలని ఐఆర్‌సీటీసీ సూచిస్తోంది. మరిన్ని వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని