సూర్యుడికే నడకలు నేర్పించారు!

చుట్టూ ఎత్తయిన పర్వతాలు. ఆ పర్వత శ్రేణిలో లోతైన లోయ. అందులో ఓ చిన్నగ్రామం. 200 మంది ఉంటారు. తరతరాలుగా వారిని ఓ సమస్య వేధిస్తుండేది

Published : 01 Jul 2021 15:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చుట్టూ ఎత్తయిన పర్వతాలు. ఆ పర్వత శ్రేణిలో లోతైన లోయ. అందులో ఓ చిన్నగ్రామం. 200 మంది ఉంటారు. తరతరాలుగా వారిని ఓ సమస్య వేధిస్తుండేది. పర్వతాలు ఎత్తుగా ఉండటం వల్ల సూర్యకాంతి ఆ గ్రామంపై పడేది కాదు. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు అసలు సూర్యుడే కనిపించేవాడు కాదు. దీంతో వారందరిలోనూ ఓ రకమైన మానసిక ఆందోళన మొదలైంది. అలా వందల ఏళ్లు గడిచాయి. కానీ ఇటీవల ఓ ఇంజినీర్‌ ఆలోచన వారి ఇళ్లల్లో కాంతులు ప్రసరించేలా చేసింది.

ఇటలీలోని ఉత్తర్‌ మిలాన్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉండే విగనెల్లా  ఓ మారుమూల గ్రామం. పర్వతలోయ ప్రాంతంలో ఉండటం వల్ల కొన్ని నెలల పాటు ఆ గ్రామంపై సూర్యకాంతి పడేది కాదు. వందల ఏళ్లుగా ఆ గ్రామస్థులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల ఆ గ్రామానికి వచ్చిన ఓ ఇంజినీర్‌కు అద్భుతమైన ఆలోచన తట్టింది. స్థానిక ఆర్కిటెక్ట్‌తో కలిసి కొండవాలు ప్రాంతంలో ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. గ్రామస్థులంతా కలిసి లక్ష యూరోల ధనాన్ని పోగు చేశారు. స్థానిక నాయకుల సహకారంతో 1.1 టన్నుల బరువున్న అద్దాన్ని 1,100 మీటర్ల ఎత్తులో ఏటవాలుగా బిగించారు. దీనికి దాదాపు సంవత్సర కాలం పట్టింది. సూర్యకాంతి అద్దం మీద పడి గ్రామంపై పరావర్తనం చెందే విధంగా దీనిని ఏర్పాటు చేశారు.

సూర్యక్రాంతి ప్రసరించే మార్గానికి అభిముఖంగా అద్దం దానంతట అది తిరిగేటట్లు సాంకేతికత వినియోగించారు. ఈ అద్దంతో గ్రామం మొత్తం వెలుగులు ఇవ్వలేకపోయినా.. 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో కాంతిని ప్రసరింపజేయవచ్చు. అందువల్ల ఊరి మధ్యలో ఉన్న చర్చిపై కాంతిపడేలా ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా అక్కడే గుమిగూడుతుంటారు. ఊరి మధ్యలో కాంతి పడటం వల్ల  ఆ వెలుతురు దాదాపు గ్రామమంతా విస్తరిస్తోంది. అద్దం ఏర్పాటు చేసిన తర్వాత తమ ప్రవర్తనలోనూ, ఆలోచనా విధానంలోనూ మార్పులు వచ్చినట్లు అక్కడివాళ్లు సంతోషంతో చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విగనెల్లా అద్దం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని