Japan: అరరె.. పిల్లలకు పెద్ద చిక్కొచ్చి పడిందే!

ఓ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు దాని ఫలితాలు, పరిణామాలను ముందుగానే అంచనా వేయాలి. ఎలాంటి ఆలోచన.. ప్రణాళిక

Updated : 07 Nov 2021 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు దాని ఫలితాలు, పరిణామాలను ముందుగానే అంచనా వేయాలి. ఎలాంటి ఆలోచన.. ప్రణాళిక లేకుండా ప్రారంభిస్తే.. ఇదిగో జపాన్‌లోని పలు పాఠశాలల్లో పిల్లలకు ఎదరైన పరిస్థితే ఎదురవుతుంది. ఇంతకీ ఏమైందంటే.. 

జపాన్‌కు చెందిన నిప్పాన్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో సీ అండ్‌ జపాన్‌ అనే ప్రాజెక్టులో భాగంగా అక్కడి ప్రభుత్వం 2019లో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ‘క్లాస్‌ ఆఫ్‌ లైఫ్‌’ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో ప్రాథమికోన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పాఠశాల యాజమాన్యం పంపిణీ చేసే చేపల్ని ఇంటికి తీసుకెళ్లి వాటికి పేరు పెట్టి.. ఆరు నెలల నుంచి ఏడాదిపాటు జాగ్రత్తగా పెంచాలి. ఒక ప్రాణి జీవితం విలువ, చేపల పెంపకం, అందులోని సవాళ్లను నేర్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీంతో 4వ తరగతి నుంచి 6వ తరగతి చదువున్న విద్యార్థులంతా చేప పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లి పెంచడం ప్రారంభించారు. సమస్యల్లా అలా పెంచిన చేపల్ని ఏం చేయాలనేదాని గురించే. కార్యక్రమం ముగిసిన తర్వాత చేపల్ని నదులు, సముద్రంలో వదిలేయాలా? వండుకొని తినాలా? అర్థం కాక చిన్నారులు తికమకపడుతున్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ‘క్లాస్‌ ఆఫ్‌ లైఫ్‌’ కార్యక్రమంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. చిన్నారులవి లేత హృదయాలు. చేపలకు పేర్లు పెట్టి.. పెంచుతూ కుటుంబసభ్యులుగా భావిస్తారు. ఆరు నెలల వ్యవధిలో ఆ చేపలతో చిన్నారులకు బలీయమైన బంధం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో వాటిని వదిలేయమన్నా.. వండుకొని తిందామన్నా చిన్నారుల మనసు ఒప్పుకోదు. ఒకవేళ పెంపకంలో పొరపాటు జరిగి చేపలు చనిపోతే.. ఆ అపరాధ భావంతో చిన్నారులు తీవ్ర మానసికక్షోభను అనుభవిస్తారని అంటున్నారు. పెంచిన చేపల్ని నదుల్లోనో, సముద్రంలోనో వదిలేసినా.. మత్స్యకారుల వలలో చిక్కి లేదా పెద్ద చేపలకు ఆహారంగానో మారిపోతాయని వాదిస్తున్నారు. ఈ అంశం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు చేపల్ని తినడం మంచిదంటే.. మరికొందరు తినడం కన్నా వాటిని వదిలేయడం మంచిదని చెబుతున్నారు.

తాజాగా ఓ పాఠశాలలో ఈ కార్యక్రమం ముగింపును టీవీలో ప్రసారం చేశారు. పాఠశాల యాజమాన్యం కొందరు విద్యార్థుల్ని మీరు పెంచిన చేపల్ని ఏం చేద్దామని ప్రశ్నించగా.. వారిలో 11 మంది చేపల్ని వండుకొని తినడానికి ఓటు వేయగా.. ఆరుగురు నీటిలో వదిలేయాలని కోరారు. అయితే, తినాలనుకున్న విద్యార్థులకు కూడా వండిన ఆ చేపల్ని తినలేకపోయారు. చేపలు తినడం సహజమే అయినా.. పెంచిన వాటిని తినడానికి వారికి మనసొప్పలేదు. కాగా.. ఇలాంటి కార్యక్రమమే జపాన్‌ గతంలోనూ నిర్వహించింది. విద్యార్థులకు గుడ్లు ఇచ్చి.. వాటి నుంచి వచ్చే కోడి పిల్లల్ని పెంచి.. వండుకోని తినాలని, దాని వల్ల తినే ఆహారం.. ఒక జీవి ప్రాణం విలువ తెలుస్తాయని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు