Largest land owner: 22 లక్షల ఎకరాల భూస్వామి.. ‘జాన్ మెలోన్‌’

అమెరికాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిల్లో ఒకరిగా ఉంటూ 22 లక్షల ఎకరాల భూమికి యజమాని జాన్‌మెలోన్‌

Updated : 21 Sep 2021 12:59 IST

ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరంటే వెంటనే మనకు బిల్‌ గేట్స్‌, జెఫ్‌ బెజోస్‌, వారెన్‌ బఫెట్‌ వంటి వారు గుర్తొస్తారు. వీరంతా అగ్రరాజ్యం అమెరికాకు చెందినవారే. అయితే, వీరు సొంతంగా వ్యాపారాలు, షేర్లు, ఇతరత్రా పెట్టుబడులు పెట్టి అధికంగా ఆర్జిస్తుంటారు. కానీ, వీరికి ఎన్ని ఎకరాల భూమి ఉంటుందో తెలుసా? అలాగే వీరందరికంటే ఎక్కువ భూమి ఉన్న వ్యక్తి మరొకరున్నారు. ఆయన మీడియాలో కనిపించరు. ఆయనే ‘జాన్‌ మెలోన్‌’. అమెరికాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఆయనొకరు. 22 లక్షల ఎకరాల భూస్వామి. ఆయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

ఎవరీ జాన్‌ మెలోన్..?

ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల్లో జాన్‌ మెలోన్‌ ఒకరు.  అమెరికాలో ‘లిబర్టీ మీడియా’ అనే ప్రముఖ టీవీ ఛానెల్‌ను స్వంతగా స్థాపించారు. దానికి ఛైర్మన్‌గా ఉంటూ మీడియా దిగ్గజాలలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్‌ మీడియా ఆస్తుల్లో అధిక వాటా కలిగిన వ్యక్తిగా రూపర్ట్‌ ముర్డోక్‌ ఎంత ఫేమసో ఆయన కంటే ఎక్కువగా జాన్‌ మెలోన్ అందులో పెట్టుబడి పెట్టారు. కొన్ని సమయాల్లో వారెన్ బఫెట్ కంటే కూడా అధికంగా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించారు.

మెలోన్‌కు డిస్కవర్‌ కమ్యూనికేషన్స్‌లో 28 శాతం, లిబర్టీ గ్లోబల్‌లో 25 శాతం షేర్లు ఉన్నాయి. లిబర్టీ గ్లోబల్‌ అనేది అంతర్జాతీయ కేబుల్‌ కంపెనీ. దీనికి 30 లక్షలకు పైగా సబ్‌స్రైబర్స్‌ ఉన్నారు. అంతేకాకుండా అట్లాంటా బ్రేవ్స్‌ అనే బేస్‌ బాల్‌ జట్టులో 8 శాతం షేర్లు కూడా ఉన్నాయి. అన్నింటికంటే అమెరికాలో అత్యధికంగా భూమి కలిగిన వారిలో జాన్‌ మెలోన్‌ అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం 22లక్షల ఎకరాల భూమి అతని పేరు మీద ఉంది. ఆయన నికర సంపాదన విలువ సుమారు 9.22 బిలియన్‌ డాలర్లు. అనేక మీడియా ఒప్పందాలు, భూ యాజమాన్యంలో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.ఆయన్ను ముద్దుగా ‘కేబుల్ కౌబాయ్’ అని పిలుస్తుంటారు.

ఆయన ప్రస్థానమిది..

జాన్‌ మెలోన్‌ 1941 మార్చి 7న న్యూయార్క్‌లో ఉన్న కనెక్టికట్‌ నగరంలోని మిల్‌ఫోర్డ్‌లో జన్మించారు. ప్రతిష్ఠాత్మక హాప్కిన్స్‌ స్కూల్‌, యేల్‌ యూనివర్సిటీ, జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఎన్నో టెలికాం ఆవిష్కరణలు, లేజర్ బీమ్, రేడియో ట్రాన్స్‌మిషన్ అభివృద్ధికి దోహదపడిన న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో పేరును నమోదు చేసుకుని బెల్‌ ల్యాబ్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌ చేశారు. అప్పుడే ఆయన టెలికామ్ ఇండస్ట్రీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

29 ఏళ్లకే సీఈవోగా..

1967లో జాన్‌ హాప్కిన్స్‌కు తిరిగొచ్చి ఆపరేషన్ రీసెర్చ్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. 1968లో ప్రపంచవ్యాప్త మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే కంపెనీలో చేరాడు. ఐదేళ్లు అందులో పనిచేసి.. తర్వాత కేబుల్ టీవీ పరిశ్రమ కోసం చిన్న కంప్యూటర్లను సబ్సిడీకే ఉత్పత్తి చేసే జెరోల్డ్‌ అనే సంస్థలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1973లో టెలికమ్యూనికేషన్‌కు (TCI) సీఈవో అయ్యారు. అప్పుడు మెలోన్‌ వయసు 29 సంవత్సరాలే. తర్వాత 1999లో 50 బిలియన్ల డాలర్లకు ఏటీ అండ్‌ టీ అనే సంస్థను కొనుగోలు చేశారు. టీసీఐలో ఇతర కంపెనీల వాటాలను, చిన్న ఆపరేటర్లను కేవలం 17ఏళ్లలో పక్కకు తప్పించారు. మెలోన్ నిర్వహణలోనే ఆ సంస్థ 8.5 లక్షల చందాదారులను చేరుకుంది. టైమ్ వార్నర్ మీడియా తర్వాత రెండో అతిపెద్ద కేబుల్ కంపెనీగా ఎదిగింది. ఆ సమయంలో మెలోన్‌ను అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ అల్ గోర్ 'డార్త్ వాడర్'తో పోల్చారు.

లిబర్టీ మీడియాకు ఛైర్మన్‌గా..

1991లో టెలికమ్యూనికేషన్‌ నుంచి లిబర్టీ మీడియాను జాన్‌ మెలోన్‌ కొనుగోలు చేశారు. ఆయన నేతృత్వంలోనే లిబర్టీ మీడియా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. కేవలం కేబుల్ సేవలను అందించే స్థాయి నుంచి డిస్కవరీ ఛానల్, క్యూవీసీ, వర్జిన్ మీడియా వంటి వాటిని బ్రాడ్‌కాస్ట్‌ చేసే స్థాయికి సంస్థను తీసుకొచ్చారు. 2007లో అట్లాంటా బ్రేవ్స్‌ అనే బేస్‌ బాల్‌ టీమ్‌ను కొనుగోలు చేశారు. ఆటో రేసింగ్‌ లీగ్‌ ఫార్ములా వన్‌ను కూడా కొన్నారు. అప్పుడే చాలా మంది ఆయనపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ, అమెరికాలో క్రీడల పరిధిని విస్తరించేందుకే కొనుగోలు చేశామని మెలోన్‌ స్పష్టం చేశారు.

22 లక్షల ఎకరాల భూస్వామిగా..

కేబుల్ టెలివిజన్ పరిశ్రమపై ఆధిపత్యం చెలాయించడంలో మెలోన్ సంతృప్తి చెందలేదు. పెన్సిల్వేనియాలో ఒక ఫామ్‌కి వేసవి విడిదికి వచ్చిన ఒక కుటుంబాన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. మొదట న్యూ మెక్సికోలోని బెల్‌ రాంచ్‌ను 2,90,100 ఎకరాల విస్తీర్ణంతో వ్యవసాయక్షేత్రాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఫ్లోరిడాలో 14 మిలియన్‌ డాలర్లతో 800 ఎకరాల బ్రిడిల్‌వుడ్ ఫామ్స్‌ను స్వంతం చేసుకున్నారు. అలాగే మేరీల్యాండ్, మైనే, న్యూ హాంప్‌షైర్, కొలరాడో, వ్యోమింగ్‌ ప్రాంతాల్లో కొన్ని భూభాగాలను కొనుగోలు చేశారు. మొత్తం 22 లక్షల ఎకరాల భూమిని కొనుగోలు చేసి అమెరికాలో అతిపెద్ద భూయజమానిగా పేరుగాంచారు. తనకున్న మొత్తం భూమి రోడ్‌ ఐలాండ్‌లో మూడు రెట్లు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2011లో ఒకేసారి 12లక్షల ఎకరాల భూమిని మైనేలో కొనుగోలు చేశారు. దాంతో తన స్నేహితుడు టెడ్ టర్నర్‌ని అధిగమించి అమెరికాలో అతిపెద్ద భూస్వామిగా ఎదిగారు. అమెరికాలోనే కాకుండా ఐర్లాండ్‌లోని విక్లోలో 32,669 చదరపు అడుగులతో ఉన్న హ్యూమ్‌వుడ్ కోటతో పాటు డబ్లిన్‌లో హోటళ్లు కూడా ఉన్నాయి.

యూనివర్సిటీల అభివృద్ధికి చేయూత..

జాన్ మలోన్ ఒక మల్టీ బిలియనీర్, పడవల యజమాని, టెలికమ్యూనికేషన్స్‌కు అధిపతిగానే కాకుండా దాతగానూ ప్రసిద్ధి చెందారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి చాలా డబ్బును వెచ్చించారు. 2000లో యేల్ డేనియల్ ఎల్ అనే ఇంజినీరింగ్ సెంటర్ నిర్మాణానికి 24 మిలియన్‌ డాలర్లు, 2011లో ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయానికి 50 మిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చారు. జాన్ హాప్కిన్స్‌ వైటింగ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌ హోంవుడ్ క్యాంపస్‌లో ఒక కొత్త భవనం నిర్మించడానికి 30 మిలియన్ డాలర్లను అందించారు. ఇటీవల మెలోన్‌ భార్య లెస్లీ మెలోన్‌ సైతం క్లొరాడో స్టేట్ యూనివర్సిటీకి 42.5లక్షల మిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చారు. మెలోన్‌ అమెరికా రాజకీయాల్లో ప్రవేశించలేదు. కానీ,  ఆయన తన తోటి స్నేహితుడు రూపర్ట్ ముర్డోక్‌తో కలిసి డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతునిచ్చారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి జాన్‌ మెలోన్‌ 1 లక్ష మిలియన్లను విరాళంగా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని