JP Nadda : నడ్డాపై అగ్రనేతల నమ్మకం.. టార్గెట్‌ 2024

భాజపా అగ్రనేతలంతా జగత్‌ ప్రకాశ్‌ నడ్డాను పార్టీ జాతీయాధ్యక్షుడిగా 2024 వరకు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. నడ్డా సారథ్యంలోనే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాలేంటో తెలుసుకోండి మరి.  

Published : 20 Jan 2023 11:35 IST

భారతీయ జనతా పార్టీ(bjp) అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా(jp nadda) పదవీకాలాన్ని పొడిగించారు. 2024 జూన్‌ వరకూ ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు(lok sabha election) ముందున్న నేపథ్యంలో అగ్రనేతలంతా నడ్డా సారథ్యంపై నమ్మకం పెట్టుకున్నారు. పలు రాష్ట్రాల్లో.. మరోసారి కేంద్రంలో కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని విశ్వసిస్తున్నారు.

కొవిడ్‌ కాలం.. పార్టీ విస్తరణతో విజయాలు

2020 జనవరిలో భారతీయ జనతాపార్టీ 11వ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా బాధ్యతలు చేపట్టారు. అమిత్‌ షా(amit shah) కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే దేశంలో కొవిడ్‌ మహమ్మారి ప్రబలింది. దీంతో రాజకీయ పర్యటనలకు, సభలకు, సమావేశాలకు తావు లేకుండా పోయింది. అయినా వీడియో కాన్ఫరెన్సులు, జూమ్‌ సమావేశాల ద్వారా నడ్డా కేడర్‌తో సంప్రదింపులు జరిపారు. ‘సేవా హి సంఘటన్‌’ కార్యక్రమం ద్వారా కష్టకాలంలో ప్రజలకు పార్టీ కార్యకర్తలు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. 

ఆ తర్వాతి కాలంలో పార్టీని బలోపేతం చేసేందుకు నడ్డా తీవ్రంగా కృషి చేశారు. పశ్చిమబెంగాల్‌(west bengal)లో బలంగా ఉన్న మమతా బెనర్జీని ఎదుర్కొనే స్థాయికి పార్టీ కేడర్‌ను తీసుకెళ్లారు. భాజపాకు ఆదరణ లేని రాష్ట్రాల్లోనూ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించి నేతల్లో జోష్‌ నింపారు. దీంతో జిల్లాస్థాయి కేడర్‌ కూడా పుంజుకొని మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కారణమైంది. అయితే ఇటీవల నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. దిల్లీలో మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు.

‘టాప్‌-3’.. మార్పు వద్దని..

భాజపా అనగానే ఒక స్థిరమైన విధానాలతో ముందుకు వెళ్తున్న రాజకీయ పార్టీగా ప్రజలకు కన్పిస్తుంది. ఏ రాష్ట్రంలో అధికారం చేపట్టినా అక్కడ వివాదాలకు తావు లేని నాయకత్వం ఉంటుంది. గోవా, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సీఎంలను మార్చడం మినహా ఆ పార్టీలో పెద్దగా కుదుపులు కనిపించవు. అడపాదడపా ఎదురయ్యే అడ్డంకులను అధినాయకత్వం ఎప్పటికప్పుడు చక్కదిద్దుతూ ఉంటుంది. 

భాజపాలో ప్రస్తుతం ‘టాప్‌-3’గా కన్పిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ(narendra modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిలో అధ్యక్షుడిని మారిస్తే పార్టీని కేడర్‌, ఓటర్లు చూసే కోణం కూడా మారుతుందనే ఆలోచన సీనియర్‌ నేతలలో వ్యక్తమై ఉండొచ్చు. పైగా ఈ సమయంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే కొన్ని చిక్కులు తప్పవు. కొత్తగా ఎన్నికైన నేతకు 9 రాష్ట్రాల్లో పార్టీ నిర్వహణ బాధ్యతలు చూడటం కష్టతరమవుతుంది. నడ్డాకు ఉన్న అవగాహన, పరిచయాలు ఇప్పటికిప్పుడు నూతన అధ్యక్షుడికి సాధ్యం కావు. అందువల్లనే నడ్డాను అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

9 రాష్ట్రాలు.. 116 ఎంపీ స్థానాలు

ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితర ముఖ్య నేతలందరూ నడ్డా కొనసాగింపు వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే నడ్డా పదవీ కాలంలో భాజపాకు ఆశించిన విజయాలు దక్కాయి. అయితే ఇప్పుడు ఆయన ముందు మరో ముఖ్యమైన బాధ్యత ఉంది. అదే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. మధ్యప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో హోరాహోరీగా పోరు సాగనుంది. ఇందులో మూడు రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్నాయి. ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో 116 ఎంపీ స్థానాలున్నాయి. అవి కేంద్రంలో భాజపా తిరిగి అధికారంలోకి రావడానికి ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు మించి 2024లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. 

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని