Updated : 10/11/2021 11:15 IST

Love: ఇష్టపడుతున్నారో లేదో తెలిసేదెలా? ఎలా గుర్తించాలి?

ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరిని ఇష్టపడే ఉంటారు. దగ్గరగానే ఉంటున్నా ఎదుటివాళ్లు తనని ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవడానికి నానా తంటాలు పడతారు. కొందరు ధైర్యం చేసి అడిగి, సమాధానం తెలుసుకుంటారు. మరికొందరు అడిగితే నచ్చిన వ్యక్తి దూరం అయిపోతారేమోనని గమ్మునుండిపోతారు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలా కాకుండా ఎదుటివారిని అడగకుండానే మనల్ని ఇష్టపడుతున్నారో లేదా తెలుసునేందుకు ఒక మార్గం ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వ్యక్తుల నడవడికను బట్టి దాన్ని గుర్తించొచ్చని అంటున్నారు. మరి ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.. పదండి!

సౌకర్యంగా ఉన్నారా!

ఒక వ్యక్తి మన వద్ద కూర్చున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు సౌకర్యవంతంగా ఫీల్‌ అవుతున్నారంటే మనపై మంచి అభిప్రాయం ఉందని అర్థం. ఏరికోరి మీ వద్దే కూర్చునేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఇష్టం ఉన్నట్లేనని భావం. అలాంటి వ్యక్తుల వద్ద మీ ఇష్టాన్ని తెలియజేస్తే సానుకూలంగా సమాధానం వచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.


కనుబొమ్మలే చెప్పేస్తాయి

కనుబొమ్మలు కూడా ఎదుటివ్యక్తిపై అభిప్రాయాన్ని చెప్పేస్తాయట. నచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కనుబొమ్మలను ఎగరేయకుండా, తిప్పకుండా చాలా కూల్‌గా ఉంటారు. అదే ఇష్టంలేని వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కనుబొమ్మలు ఎగరవేయడం వంటివి చేస్తారట.


కనులు కనులను దోచాయంటే..

ఒకరి ఇష్టాన్ని కళ్లను చూసి చెప్పేయవచ్చని అంటుంటారు. నిజమే మరి.. సాధారణంగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కళ్లను చూసి మాట్లాడుతుంటారు. అయితే నచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కళ్లలోకి కళ్లు పెట్టి తదేకంగా చూస్తారు. సాధారణ వ్యక్తులు అయితే కళ్లలోకి కళ్లు పెట్టి ఎక్కువ సేపు చూడలేరు. అటు ఇటు చూస్తూ మాట్లాడుతారు.


బొటన వేలితోనూ తెలుస్తుంది

ఒక పురుషుడు బొటన వేలును జేబులో పెట్టుకొని స్టైల్‌గా నిలబడ్డాడంటే ఎదుటివారిని ఆకట్టుకోవడం కోసమే. అదే ఒక స్త్రీ తన హ్యాండ్‌బ్యాగ్‌ భుజాన వేసుకొని బొటన వేలును భుజంపై ఉండే బ్యాగ్‌ స్ట్రాప్‌ కింద పెట్టుకొని మీ ముందు నిల్చొని ఉందంటే.. మీరంటే ఇష్టం ఉందనే అర్థం.


నవ్వు ఆకట్టుకుంటుంది

నవ్వు ఆరోగ్యానికే కాదు.. ఎదుటివాళ్లను ఆకట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అమ్మాయిలు ఎక్కువగా నవ్వుతూ, నవ్వించే అబ్బాయిలనే ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ.. నవ్వించే ప్రయత్నం చేయండి. ఎదుటివాళ్లకు మీపై కచ్చితంగా ఇష్టం ఏర్పడుతుంది.


ప్రవర్తనలోనే తెలిసిపోతుంది

ఎవరైనా మీతో సరిగా మాట్లాడట్లేదు, మీరు మాట్లాడినా పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని చూడకుండా ముఖం చాటేస్తున్నారంటే.. మీరంటే ఇష్టం లేదని చెప్పకనే చెబుతున్నట్లు. ఇలాంటి వారికి మీపై మంచి అభిప్రాయం కలిగిన తర్వాతే మీ ఇష్టాన్ని తెలియజేయడం ఉత్తమం. లేకపోతే ఆదిలోనే నష్టం కలగవచ్చు.


తల తిప్పుతున్నారా.. 

ఒక వ్యక్తి తల తిప్పే విధానాన్ని బట్టే వారి మదిలో ఏముందో తెలుసుకోవచ్చు. ఎదురెదురుగా కూర్చొని సంభాషిస్తున్నప్పుడు తల కొంచెం అటు ఇటుగా తిప్పుతూ మిమ్మల్నే చూస్తున్నారా.. అయితే మీపై వారికి ఇష్టం ఉందని చెప్పడానికి ఇదొక సూచికే. అలా కాకుండా కళ్లను చూడకుండా అటు ఇటు తల తిప్పుతున్నారంటే రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి.. వారికి మీపై ఇష్టం లేదని, రెండు తలనొప్పి కావొచ్చు.


ఆడ.. మగ ధోరణి భిన్నం

పురుషులు ఇష్టపడిన అమ్మాయిలపై ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తారని, ఆంక్షలు పెట్టడం, అన్ని విషయాలు తనకు చెప్పాలని కోరడం వంటివి చేస్తారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే అమ్మాయిలైతే అబ్బాయిలపై ప్రేమను మాత్రమే చూపిస్తూ.. ఎంతో దయగా ఉంటారని పరిశోధనలో తేలిందట.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని