Stampedes: కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్‌లో ఈ తరహా భారీ ఘటనలివే!

Stampedes: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే..

Updated : 02 Jul 2024 22:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttarpradesh) హాథ్రస్‌లో (Hathras) చోటు చేసుకున్న పెనువిషాదంలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రతిభాన్‌పుర్‌లో నిర్వహించిన సామూహిక శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరగడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మనదేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న భారీ తొక్కిసలాట ఘటనల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో భారత్‌ చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలు కొన్నింటిని పరిశీలిస్తే..!

 

 • ప్రయాగ్‌రాజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద 1954లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 800 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2 వేల మందికి గాయాలయ్యాయి.
 • నాగ్‌పుర్‌: 1994 నవంబర్‌ 23న మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గోవారి తెగకు చెందిన సుమారు 50 వేల మంది సమావేశమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 114 మంది మృతి చెందారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి మహారాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి మధుకర్‌ తన పదవికి రాజీనామా చేశారు.
 • శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వెళ్తుంటారు. మకర జ్యోతి దర్శనానికి 1999 జనవరి 14న పంబ బేస్ క్యాంప్‌ నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమల కొండపైకి పయనమయ్యారు. ఒకేసారి పెద్ద ఎత్తున భక్తులు నడక మార్గంలో వెళ్లడంతో తొక్కిసలాట జరిగి 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే తరహా ఘటన 2011 జనవరి 14న మళ్లీ చోటు చేసుకుంది. 106 మంది భక్తులు మృతి చెందగా.. 100 మందికిపైగా గాయపడ్డారు.

ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య

 • చెన్నై: వరద బాధితులకు చెన్నైలోని ఎంజీఆర్‌ నగర్‌ పాఠశాలలో 18, జనవరి 2005న అక్కడి ప్రభుత్వం నిత్యావసర సరకులను పంపిణీ చేసింది. బాధితులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో జరిగిన తొక్కిసలాటలో 42 మంది మృతి చెందారు. మరో 37 మందికి గాయాలయ్యాయి.
 • జోధ్‌పుర్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో 15వ శతాబ్దం నాటి చాముండీ దేవి ఆలయం ఉంది. దసరా నవరాత్రుల ప్రారంభాన్ని పురస్కరించుకొని 2008 సెప్టెంబర్‌ 30న దాదాపు 25 వేల మంది భక్తులు ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకొని 224 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 425 మందికి పైగా గాయపడ్డారు.
 • మధ్యప్రదేశ్‌: నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 2013 అక్టోబర్‌ 13న దటియా జిల్లాలోని రత్నగఢ్‌ మాతను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. అదే సమయంలో దేవాలయానికి సమీపాన ఉన్న వంతెన కూలిపోవడంతో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయపడ్డారు.

ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటి?

 • పట్నా: దసరా వేడుకల్లో భాగంగా గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ‘రావణ వధ’ను తిలకించేందుకు 2014 అక్టోబర్‌ 3న భారీ సంఖ్యలో భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
 • రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలోని పుష్కర్‌ఘాట్‌కు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. 2015 జులై 14న జరిగిన ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి. 
 • ముంబయి: ముంబయిలోని ఎల్‌ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌లపైకి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మెట్ల మార్గంలోకి ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రయాణికులు రావడంతో అది కూలిపోయింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 23 మంది మృతి చెందారు. మరో 39 మందికి గాయాలయ్యాయి. 2017 సెప్టెంబర్‌ 29న ఈ ఘటన జరిగింది.
 • అమృత్‌సర్‌: దసరా నవరాత్రుల్లో భాగంగా అమృత్‌సర్‌లో 2018 అక్టోబర్‌ 19న రావణ దహనం ఏర్పాటు చేశారు. దీనిని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. బాణసంచా నుంచి తప్పించుకునేందుకు దూరంగా పరుగులు తీశారు. దీంతో అటువైపుగా వస్తున్న రైలు వారిని ఢీ కొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్‌పై వేరే రైలు రావడంతో చాలా మందికి తప్పించుకోవడం వీలుకాలేదు. ఈ ఘటనలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
 • జమ్ముకశ్మీర్‌: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 2022 జనవరి 1న జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకొని 12 మంది ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని