Adventure journey : లండన్‌-కోల్‌కతా.. బస్సులో వచ్చారు!

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఓ సుదూర బస్సు ప్రయాణం లండన్‌-కోల్‌కతాకు సాగింది.

Updated : 10 Mar 2023 14:51 IST

విహార యాత్ర కోసం లండన్‌ నుంచి 30వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ కొందరు పర్యాటకులు కోల్‌కతాకు బస్సులో వచ్చారంటే నమ్ముతారా? భారత్‌కు స్వాతంత్య్రం (Independence) వచ్చిన తరువాత జరిగిందీ సంఘటన. ఆ యాత్ర ప్రత్యేకత ఏంటో చదివేయండి.

20 మంది ప్రయాణికులతో..

అది 1957 ఏప్రిల్ 15. లండన్‌(London) నుంచి కోల్‌కతాకు(Kolkata) ఓ బస్సు విక్టోరియా కోచ్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరింది. ఆ బస్సు ‘ఏఈసీ రేగల్‌ 3’ మోడల్‌కు చెందినది. ధైర్యవంతుడైన డ్రైవర్‌ ఓస్వాల్డ్ జోసెఫ్‌ ఆ వాహనాన్ని నడిపిస్తున్నాడు. ప్రయాణానికి టికెట్ ఖరీదు 85 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.8,330. అదే బస్సులో తిరుగు ప్రయాణానికి 65 డాలర్లుగా(రూ.6357) ధర నిర్ణయించారు.

సుదీర్ఘ ప్రయాణం కావడంతో బస్సు ఆగిన చోట యాత్రికులు హోటళ్లలో బస చేసేవారు. ఒక వేళ హోటల్‌ దొరకకపోతే ఆరు బయటే టెంట్లు వేసుకొని నిద్రించేవారు. బస్సు లోపల కూడా స్లీపింగ్‌ కంపార్ట్‌మెంట్లున్నాయి. గాలి కోసం ఫ్యాన్లు, పాటలు వినడానికి రేడియో సౌలభ్యం ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల రోడ్లు దారుణంగా ఉండేవి. దాంతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని లోపలున్న వారు భయభయంగా గడిపేవారు. లండన్‌ నుంచి మొదలైన బస్సు ఫ్రాన్స్‌(France), ఇటలీ, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్‌, పాకిస్థాన్‌ గుండా ప్రయాణించి జూన్‌ 5న కోల్‌కతా చేరింది. భారత్‌లో అడుగుపెట్టిన తరువాత పర్యాటకులు బనారస్‌, తాజ్‌మహల్‌, రాజ్‌పథ్‌ వంటి ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలకు వెళ్లారు. దిల్లీలోని అనేక మార్కెట్లను సందర్శించి గుర్తుగా వస్తువులు కూడా కొన్నారు. అలా 20 మందితో భారత్‌కు వచ్చిన అదే బస్సులో తిరుగు ప్రయాణానికి 7 మంది మాత్రమే సిద్ధమయ్యారంటే ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రయాణం గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియడంతో పర్యాటకులు ఏ దేశంలో అడుగుపెట్టినా అక్కడ పత్రికా విలేకరులు వీరి కోసం ఎదురు చూసేవారు. ఈ సుదూర ప్రయాణం గురించి కథనాలు రాశారు. 

ఓ పీడకలలా ప్రయాణం! 

బస్సు తిరిగి లండన్‌ వెళ్లే సరికి దాని స్పీడో మీటరులో రీడింగ్‌ 30వేలకు చేరింది. ఇన్ని వేల కిలోమీటర్లు బస్సు(Bus) ప్రయాణంపై డ్రైవర్‌ గారో ఫిషర్‌ వివిధ పత్రికలతో మాట్లాడుతూ తన అనుభవాన్ని వివరించాడు. అనేక శిఖరాలపై ప్రయాణం భయానకంగా సాగిందని తెలిపాడు. టర్కీలోని మౌంట్‌ ఆరారత్‌ రీజియన్‌లో హెయిర్‌పిన్‌ టర్న్‌లలో బస్సు తిప్పడం కష్టంగా ఉండేదని చెప్పాడు. అంతే కాదు ఇరాన్‌లోని ఎడారి ప్రాంతంలో బస్సు నిలిపినప్పుడు అది కూరుకుపోకుండా టైర్ల కింద చెక్కలను ఉంచేవారమని వివరించాడు. ఇసుక తుపానులు, ఆకస్మిక వర్షాలు, దుమ్ము, విపరీతమైన ఎండ.. ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటే అదొక పీడకలలా అనిపిస్తుందని డ్రైవర్‌ చెప్పాడు. భారత్‌లో అడుగుపెట్టాక చాలా మంది తమను ఆశ్చర్యంగా చూశారని పేర్కొన్నాడు. 

చనిపోయారని వదంతులు

బస్సు తిరుగు ప్రయాణంలో 1800 కిలోమీటర్ల దూరం పెరిగింది. ఎందుకంటే అప్పటికి ఏసియన్‌ ఇన్‌ఫ్ల్యూయెంజా తీవ్రంగా ప్రబలుతోంది. దాంతో పాకిస్థాన్‌-ఇరానియన్‌ బోర్డర్‌ మూసివేశారు. ఫలితంగా పర్యాటకులు మరో మార్గంలో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ బస్సు గురించి కొన్ని వదంతులు కూడా వచ్చాయి. ఇరాన్‌లో యాత్రికులను బందిపోట్లు చంపేశారనే వార్త దావానలంలా వ్యాపించింది. టెహ్రాన్‌లోని బ్రిటిష్‌ రాయబార కార్యాలయం దాన్ని కొట్టిపారేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన పర్యాటకుల్లో చాలా మంది బస్సులో కాకుండా వివిధ మార్గాల్లో ప్రయాణిస్తూ తిరుగు పయనమయ్యారు. వారిలో పీటర్‌ మాస్‌ ఒకరు. అతను సముద్ర మార్గం ద్వారా మలేసియా వెళ్లాడు. ఆ యువకుడికి డైరీ రాసే అలవాటు ఉండేది. తరువాత ఆ డైరీని ‘ది ఇండియామ్యాన్‌’ అనే పుస్తకంగా ప్రచురితం చేశాడు.

బ్రేక్‌ పడింది..

బస్సు యాత్ర విజయవంతంగా పూర్తి కావడంతో గారో ఫిషర్‌ మరో ట్రిప్‌నకు సిద్ధమయ్యాడు. అలా దాదాపు 3 రౌండ్లు లండన్‌-కోల్‌కతాకు బస్సు నడిచింది. అతడిని అనుకరిస్తూ పలు ఐరోపా దేశాల నుంచి భారత్‌ వైపు కొన్ని బస్సు సర్వీసులు తిరిగాయి. 1970 నాటికి ఈ మార్గంలోని అనేక దేశాల్లో రాజకీయ, మిలటరీ సంఘర్షణలు తలెత్తడంతో ప్రయాణాలు క్రమంగా ఆగిపోయాయి. ఇటీవల మన దేశానికి చెందిన ‘అడ్వెంచర్‌ ఓవర్‌ల్యాండ్‌’ అనే సంస్థ దిల్లీ నుంచి లండన్‌కు బస్సు నడపాలని నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల దాన్ని ఇస్తాంబుల్‌కు మార్చింది.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని