Lucky pilot : ‘ఏడు రోజుల్లో.. ఏడు ప్రమాదాలు’.. ఈ పైలట్‌కు భూమ్మీద నూకలున్నాయ్‌!

అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఓ పైలట్‌ ఏడు రోజుల్లో ఏడు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 

Updated : 02 Mar 2023 11:15 IST

‘అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తీసేవరకు తడుతూనే ఉంటుందట’ మరి అమెరికాలోని(America) మిషిగాన్‌కు చెందిన ఓ పైలట్‌(pilot) ఎంతటి అదృష్టవంతుడో.. ఏడు రోజుల్లో తాను నడిపిన విమానం(flight) ఏడుసార్లు ప్రమాదాలకు గురైంది. అయినా కూడా బతికి బయటపడ్డాడు. ఆయన ఫ్లయింగ్‌ లైసెన్స్‌(flying license) మాత్రం రద్దు కావడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

మిషిగాన్‌కు చెందిన డెన్నిస్‌ కోలియర్‌కు గతంలో పైలట్‌గా అనుభవం ఉంది. 20 ఏళ్ల తరువాత మళ్లీ ఆయనకు గాల్లో ఎగరాలనే కోరిక పుట్టింది. 2021లో సొంతంగా విమానం కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఆన్‌లైన్‌లో(online) శోధించగా దాదాపు రూ.కోటి రూపాయల ధరలో ఒక చిన్న విమానం కనిపించడంతో దాన్ని కొనేశాడు. ఆ విమానం కాలిఫోర్నియాలో ఉందని తెలిసి తెచ్చుకోవడానికి వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత తెలిసిన విషయం ఏంటంటే.. ఆ విమానం రెండేళ్లుగా మూలన పడి ఉందని.. పైగా అందులోని కొన్ని భాగాల అమరిక సరిగా లేదు. రెక్కలపై ఉండే  ఫ్లాప్స్‌, టైల్‌ అడపాదడపా పనిచేస్తున్నాయి. ఇంత దారుణంగా విమానం ఉన్నప్పటికీ కోలియర్‌ దానిని కొనడానికే మొగ్గు చూపాడు. అంతే.. అతడి జీవితం డేంజర్‌లో పడిపోయింది. ఏడు రోజుల్లో ఏడు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

  • జూన్‌ నెలాఖరులో తొలిసారి టెస్ట్ కోసం విమానం ఎక్కాడు. అప్పటికే డెన్నిస్‌ విమానం నడిపి ఇరవై ఏళ్లు దాటడంతో దిగేటప్పుడు ల్యాండింగ్‌ గేర్‌(landing gear) వేయడం మర్చిపోయాడు. దాంతో కింద భాగం నేలకు రాసుకుంటూ.. భారీ చప్పుడు చేసుకుంటూ విమానం ఆగింది.
  • మొదటి ప్రమాదం జరిగిన కొంచెం సేపటి తరువాత కాలిఫోర్నియా నుంచి న్యూ మెక్సికోకు బయలుదేరాడు. అప్పుడు ల్యాండింగ్‌ లైట్స్‌ సరిగా పనిచేయడం లేదని తెలిసింది. దాంతో రన్‌ వే(run way) ఎక్కడుందో? నేల ఎక్కడుందో కనిపించకపోవడంతో అలాగే ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని సూచికలు, విద్యుద్దీపాలను ఢీకొట్టాడు. ఈ ఘటన కారణంగా విమానం కొన్ని మరమ్మతులకు గురైంది.
  • ఒక రోజు విరామం తర్వాత జూన్‌ 28న మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది.  అయితే గతంలోని ప్రమాదాల వల్ల విమానం స్థితి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దాంతో మరోసారి రన్‌వే లైట్‌ను ఢీకొంది. 
  • హార్డ్‌వేర్‌ దుకాణంలో మరమ్మతులు పూర్తయిన తరువాత జూన్‌ 30న డెన్నిస్‌ మళ్లీ విమానం నడిపాడు. నెబ్రాస్కా రాష్ట్రంలోని ఓనీల్‌ వైపు ప్రయాణం సాగించాడు. విమానం గాల్లో ఉండగా.. ఎడమ రెక్క హింగ్డ్‌ ట్యాబ్‌ ఇరుక్కుపోయిందని గ్రహించాడు. దాంతో ల్యాండ్‌ చేయడం కష్టతరంగా మారింది. నాలుగుసార్లు విఫలయత్నం చేశాడు. చివరికి ల్యాండ్‌ అయ్యే సమయంలో మూడు లైట్లను ఢీకొట్టాడు. రన్‌ వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లింది. దాంతో ఎడమ రెక్కను కంట్రోల్‌ చేసే ఓ మోటారు పగిలిపోయింది.
  • ఐదో ప్రమాదం నెబ్రాస్కాలోనే చోటు చేసుకుంది.
  • ఆరో ప్రమాదం జులై 3న జరిగింది. ఎస్కనాబా పై ఎగురుతూ ఉండగా.. ఎడమ ల్యాండింగ్‌ గేర్‌ దానికై అదే కిందకు జారింది. దాంతో మానిస్టిక్‌లోని స్కూల్‌క్రాఫ్ట్‌ కౌంటీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాలని పైలట్‌ నిశ్చయించుకొన్నాడు. కిందకి దించుతున్నప్పుడు రన్‌వే నుంచి విమానం జారిపోయింది. ఫలితంగా ముందు భాగం, నోస్‌ గేర్‌ డోర్‌ దెబ్బతింది.
  • ఇక చివరి.. ఏడో ప్రమాదం జులై 4న సంభవించింది. డెన్నిస్‌ అప్పటికి తన గమ్యస్థానం బోయిన్‌ సిటీకి 80 మైళ్ల దూరంలో ఉన్నాడు. విమానం మిషిగాన్‌ లేక్‌పై ఎగురుతూ ఉంది. ఇంజిన్‌లోని(engine) నుంచి కొన్ని ద్రవాలు లీక్‌ అయ్యాయి. దీంతో తన పని ముగిసిపోయింది.. ఇక చావే శరణ్యం అనుకున్నాడు. గమ్మత్తైన విషయం ఏమిటంటే.. డెన్నిస్‌ కొన్నది ఉభయచర విమానం. నేలపైనా.. నీళ్లపైనా ల్యాండ్‌ కావచ్చు. కానీ, ఏం ప్రయోజనం.. మళ్లీ ఫ్లాప్స్‌ పనిచేయడం మానేశాయి. చివరికి విమానం నీళ్లపై వాలిపోయింది. అప్పటికే అప్రమత్తంగా ఉన్న డెన్నిస్‌ విమానం శిథిలాలపై ఎక్కి నిల్చున్నాడు. గంట సేపటి తరువాత యూఎస్‌ కోస్ట్‌ గార్డ్స్‌ వచ్చి అతడిని కాపాడారు.

ఇన్ని ప్రమాదాలను ఎదుర్కొన్నా డెన్నిస్‌కు ఒక్క గాయం కూడా కాలేదు. ఏ ప్రమాదంలోనూ అతడి శరీరంపై చిన్న గీత కూడా పడలేదు. విమానం కొనుగోలు చేసి ఇంటి తెచ్చుకోవాలనే తన ప్రణాళిక మొత్తం నాశనమైపోయిందని జరిగిన ఘటనలను డెన్నిస్‌ వివరించాడు. ఏడు ప్రమాదాలకు కారణమైన విమానం అసలు యజమాని మాత్రం తాను విక్రయించిన సమయంలో అదంతా బాగానే ఉందని మీడియాకు తెలిపాడు. ఎక్కువ విమాన ప్రమాదాలు చేసిన కారణంగా డెన్నిస్‌ కోలియర్‌ ఫ్లయింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేశారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు