‘వాటర్‌ బాటిల్’‌పై కేసు.. ఐదేళ్ల తర్వాత గెలుపు

రెస్టారెంట్లలో, సినిమా థియేటర్లలో ఆహార పదార్థాలు, మంచినీటి బాటిళ్ల ధర ఆకాశాన్ని అంటుతాయన్న విషయం తెలిసిందే. చాలా మంది ఎందుకంతా ధర అని ప్రశ్నించకుండానే కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ, రోహిత్‌ పాటిల్‌ అలా ఊరుకోలేదు. ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన రోహిత్‌కు

Published : 15 Jan 2021 09:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఆహార పదార్థాలు, మంచినీటి బాటిళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయన్న విషయం తెలిసిందే. చాలా మంది ఎందుకంతా ధర అని ప్రశ్నించకుండానే కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ.. రోహిత్‌ పాటిల్‌ అలా ఊరుకోలేదు. ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన రోహిత్‌కు వాటర్‌ బాటిల్‌పై వేసిన బిల్లు చూసి చిర్రెత్తుకొచ్చింది. రెస్టారెంట్‌‌ యాజమాన్యాన్ని నిలదీశాడు. వారు సరిగా స్పందించకపోవడంతో వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. ఐదేళ్ల నిర్విరామ న్యాయపోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించాడు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన 67 ఏళ్ల రోహిత్‌ పాటిల్‌ ఐదేళ్ల కిందట.. అంటే 2015 అక్టోబర్‌ 16న తన స్నేహితులతో కలిసి ఎస్‌జీ హైవేలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. నచ్చిన ఆహారం, వాటర్‌ బాటిల్‌ ఆర్డర్‌ చేసుకొని తిన్నాడు. తీరా బిల్లు చూస్తే వాటర్‌ బాటిల్‌కు రూ.164 వేశారు. మొదట రోహిత్‌ ఆ ధర చూసి పొరపాటుగా అచ్చు అయిందనుకున్నాడట. సిబ్బందిని అడిగితే వాటర్‌ బాటిల్‌ ధర అంతేనని స్పష్టం చేశారు. దీంతో ఆశ్చర్యపోవడం రోహిత్‌ వంతయింది. రూ.20 ఖరీదు చేసే వాటర్‌ బాటిల్‌కు అంత ధర ఏంటని హోటల్‌ యాజమాన్యాన్ని రోహిత్‌ నిలదీశాడు. చాలా సేపు వాదించాడు. అయినా హోటల్‌ యాజమాన్యం తగ్గకపోవడంతో రోహిత్‌ బిల్లు మొత్తాన్ని చెల్లించక తప్పలేదు.

కోర్టులో కేసు..

అయితే.. హోటల్‌ దోపిడీని ఎలాగైనా అడ్డుకోవాలని రోహిత్‌ బలంగా నిర్ణయించుకున్నాడు. హోటల్‌ నుంచి వెంట తెచ్చుకున్న వాటర్‌ బాటిల్‌, దాని బిల్లు ఆధారంగా అదే ఏడాది నవంబర్‌ 3న వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు కావడంతో హోటల్‌ యాజమాన్యానికి నోటీసులు వెళ్లాయి. హోటల్‌ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. వాటర్‌ బాటిల్‌కు రూ.164 బిల్లు వేయడం తప్పేమీ కాదని.. హోటల్‌లో అందించే సేవలకు తగ్గట్టుగానే ధర ఉందని చెప్పుకొచ్చారు. అలా ఇరువైపుల వాదనలు ఐదేళ్లపాటు కొనసాగాయి. ఈ క్రమంలో రోహిత్‌ 28 సార్లు కోర్టు మెట్లు ఎక్కిదిగాడు. ఎంతో మంది ఈ చిన్న విషయానికి కేసులు, కోర్టులు ఎందుకు.. వదిలేయమని రోహిత్‌తో చెప్పారట. కానీ, ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

తుది తీర్పు..

ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 5న ఫోరం.. రోహిత్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఒక వాటర్‌ బాటిల్‌కు అంత ధర ఉండటం అన్యాయమని, ఎంఆర్‌పీ ధర కంటే భారీ మొత్తంలో అధికంగా రుసుము వేయడం నేరంగా పేర్కొంది. వేధింపులకు గురిచేసినందుకుగానూ రూ.2,500, ఇతర ఖర్చులకుగానూ రూ.3,000 మొత్తంగా రూ.5,500 పరిహారంగా బాధితుడు రోహిత్‌కు ఇవ్వాలని కోర్టు హోటల్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల లోపే చెల్లించాలని పేర్కొంది. కోర్టు తీర్పుతో రోహిత్‌ సంతృప్తి చెందాడు. హోటల్‌ ఇచ్చే పరిహారం మొత్తాన్ని ఏదైన స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని