Mask: ఆ దేశాల్లో మాస్కులు అక్కర్లేదు..!

కరోనా మహమ్మారి వల్ల మనుషుల జీవితాలు తలకిందులయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు, ఆంక్షల మధ్య.. రోజువారీ కార్యక్రమాలను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మాస్క్‌

Updated : 19 Jun 2021 16:42 IST

కరోనా మహమ్మారి వల్ల మనుషుల జీవితాలు తలకిందులయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు, ఆంక్షల మధ్య రోజువారీ కార్యక్రమాలను చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మాస్క్‌ ధరించడం. బయటకు వెళ్తే కచ్చితంగా మాస్క్‌ ధరించాలన్న నిబంధనను అన్ని దేశాలు తప్పనిసరి చేశాయి. దుకాణానికో.. ఆస్పత్రికో వెళ్లాలన్నా మాస్క్‌ధరిస్తే తప్ప ఎంట్రీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలంతా ఎదరుచూస్తున్నారు. అయితే, కొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మాస్క్‌ ధరించకుండా సాధారణ జీవితాన్ని గడిపే భాగ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల అమెరికాలో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికానే కాదు.. మరికొన్ని దేశాలు కూడా మాస్క్‌ తప్పనిసరి అనే నిబంధనను తొలగించాయి. ఒకట్రెండు షరతులతో మాస్క్‌ లేకుండా బయట తిరిగేందుకు అనుమతిస్తున్నాయి. మరి ఆ దేశాలేవో చూద్దామా..!

ఇజ్రాయెల్‌

అమెరికా కంటే ముందే పలు దేశాలు మాస్క్‌ తప్పనిసరి నిబంధనను తొలగించాయి. అందులో ఒకటి ఇజ్రాయెల్‌. 92 లక్షలకుపైగా జనాభా ఉన్న ఈ దేశంలో 70 శాతానికిపైగా ప్రజలకు వ్యాక్సిన్‌ వేశారు. అందరికీ రెండు డోసులు పూర్తి కావడం విశేషం. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, వేగవంతమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో మహమ్మారిపై ఇజ్రాయెల్‌ విజయం సాధించింది. అందుకే గత ఏప్రిల్‌ నెలలోనే మాస్క్‌ తప్పనిసరి నిబంధనను తొలగించింది. ప్రజలంతా మాస్క్‌ లేకుండానే స్వేచ్ఛగా తిరగొచ్చని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తంగా 8.4లక్షల కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. 6,427 మరణాలు చోటుచేసుకున్నాయి. 


భూటాన్‌

భూటాన్‌.. చిన్న దేశం. కరోనా పుట్టిన చోటైన చైనా.. కరోనా రెండో దశ ప్రభావానికి తల్లడిల్లుతున్న భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న ఈ దేశం.. కరోనా వ్యాప్తిని ముందుగానే గ్రహించి పూర్తి లాక్‌డౌన్‌ పెట్టకపోయినా కఠినమైన ఆంక్షలు, నిబంధనలు, వ్యాక్సినేషన్‌తో ప్రజలను కాపాడుకుంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్కడి ప్రభుత్వం రెండు వారాల్లోనే దేశంలోని 90 శాతం ప్రజలకు వ్యాక్సిన్‌ ఇచ్చింది. ఆ ధైర్యంతోనే భూటాన్‌ను మాస్క్‌ ఫ్రీ దేశంగా ప్రకటించుకుంది. దాదాపు 7.79 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటి వరకు 1,882 కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరు మాత్రమే కరోనా కారణంగా మృతి చెందారు.


చైనా

కరోనా వ్యాప్తి ఎక్కడైతే మొదలైందో.. ఆ దేశంలో ప్రజలు ఇప్పుడు మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. మొదట్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగి ఆందోళనకు గురైన చైనా.. ఆ తర్వాత కఠినమైన లాక్‌డౌన్‌ విధించి కరోనా వ్యాప్తిని నియంత్రించింది. ఎక్కడికక్కడ తాత్కాలిక ఆస్పత్రులు నిర్మించి.. సరైన సమయంలో చికిత్స అందించి ప్రజలను రక్షించింది. సొంతగా వ్యాక్సిన్‌ కనిపెట్టి వ్యాక్సినేషన్‌ను వేగంగా చేపట్టింది. దాదాపు ప్రజలంతా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అందుకే చైనాలో సాధారణ పరిస్థితులు తొందరగా వచ్చేశాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఇప్పటివరకు 91.5వేల కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు, 4,636 మరణాలు మాత్రమే నమోదయ్యాయి.


న్యూజిలాండ్‌

ఎలాంటి పరిస్థితులనైనా మహిళలు సమర్థంగా ఎదుర్కొంటారని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ నిరూపించారు. తమ దేశంలోకి కరోనా వ్యాపించిదని తెలియగానే వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టారు. కరోనా కట్టడికి ఆమె అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో న్యూజిలాండ్‌ తొందరగానే కరోనా రహిత, మాస్క్‌ ఫ్రీ దేశంగా మారింది. జెసిండా కృషిని ప్రపంచం ప్రశంసించింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్‌లో 2,714మంది కరోనా బారిన పడగా.. 26 మంది బలయ్యారు. 


దక్షిణ కొరియా

జులై నుంచి దక్షిణ కొరియా కూడా మాస్క్‌ ఫ్రీ దేశంగా మారనుంది. కరోనా వ్యాక్సిన్‌ ఒక్క డోసు వేసుకున్నా మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చని ఆ దేశ ప్రధాని కిమ్‌ బూ-క్యుమ్‌ ఇటీవల ప్రకటించారు. ఇప్పటి వరకు కేవలం 7.7 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సెప్టెంబరు నాటికి కనీసం 70 శాతం మందికి టీకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ద.కొరియాలో మొత్తం 1.5లక్షల కేసులు నమోదయ్యాయి. 1,996 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్డారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని