Indonesia: బురదనీటిలో వృద్ధ మహిళలు వణుకుతుంటే.. డబ్బులు సంపాదిస్తున్న క్రియేటర్లు

వృద్ధమహిళలు బురదలో స్నానం చేస్తూ వణుకుతుంటూ ఆ వీడియోలను లైవ్‌స్ట్రీమ్‌ చేసి కొందరు టిక్‌టాక్‌ క్రియేటర్లు డబ్బులు దండుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఇండోనేసియాలోని లొంబొక్‌ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి.

Published : 06 Mar 2023 01:39 IST

రెడీ..1, 2, 3.. యాక్షన్‌ అన్నాడు టిక్‌టాక్‌ క్రియేటర్‌..
అంతే.. ఎదురుగా బురద నీటిలో కూర్చున్న ఓ వృద్ధ మహిళ వణుక్కుంటూ ఆ నీటిని జగ్గుతో ఎత్తి నెత్తిమీద పోసుకుంది..
చల్లగాలికి తోడు చలి ఎక్కువ కావడంతో ఆమె మరింత వణుకుతోంది.. 
మళ్లీ నీళ్లు నెత్తిమీద చల్లుకుంది.. 
క్రియేటర్‌ కట్‌ చెప్పేంతవరకు ఈ దుర్మార్గం కొనసాగుతూనే ఉంది..

ఇదంతా లైవ్‌ స్ట్రీమ్‌ జరగడం గమనార్హం..

ఎక్కడ జరుగుతోంది?

ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలు ఇలాంటి దారుణాలకు వేదికగా నిలుస్తున్నాయి.  లైవ్‌ స్ట్రీమ్‌లో భాగంగా చూసిన వీక్షకులు ఆన్‌లైన్‌ ద్వారా కాయిన్స్‌ పంపిస్తారు. వాటిని మార్చుకోవడం ద్వారా నగదు వస్తుందని దీన్ని రూపొందించిన ఓ వ్యక్తి తెలిపాడు. ఈ బురద నీటి స్నానాలను తొలిసారిగా లొంబొక్‌ దీవిలో చిత్రీకరించారు. టిక్‌టాక్‌లో విరివిగా ప్రచారంలోకి రావడంతో ఇండోనేషియా అధికారులు స్పందించారు. వెంటనే వాటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వీడియోలను టిక్‌టాక్‌ నుంచి తొలగించాలని ఆ సంస్థకు లేఖ రాశారు. కొందరు మహిళలు కనీసం ఏడు, ఎనిమిది గంటలు ఈ నీటిలోనే ఉండటం బాధాకరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఆదాయం రావడంతో చలిని భరిస్తూ..

ఇండోనేసియాలోని లొంబొక్‌ ప్రాంతంలో పేదరికం ఎక్కువ. క్రియేటర్లు ఎక్కువ ఆదాయం ఆశ చూపించడంతో వృద్ధ మహిళలు తమ కుటుంబాల పోషణ కోసం వీటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే క్రియేటర్లు మాత్రం భారీగా ఆదాయం పొందుతూ మహిళలకు మాత్రం అతి తక్కువ మొత్తాలను ఇస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలా సేపు బురద నీటిలో ఉండటంతో వృద్ధులకు అనేక శ్వాససంబంధిత వ్యాధులు వస్తున్నట్టు సమాచారం. అమెరికా తరువాత ఇండోనేసియాలో టిక్‌టాక్‌ యూజర్లు 106 మిలియన్ల మంది ఉంటారని అంచనా. అయితే తమకు రోజువారీ వచ్చే కూలీ కన్నా టిక్‌టాక్ క్రియేటర్లు ఇచ్చే డబ్బు ఎక్కువగా ఉందని ఆ అమాయక మహిళలు చెబుతుండటం గమనార్హం. తమకు కష్టంగా ఉన్నా వీటిని భరిస్తామని వారు అంటున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో తన మనవళ్లు, మనవరాళ్లకు కనీసం ఒక్కపూటైనా కడుపు నిండుతోందని వారు తెలిపారు. అయితే ఇటువంటి చర్యలు దుర్మార్గమని క్రియేటర్లపై కేసులు పెట్టాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

జకార్తా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని