Mystery: చైనా గొర్రెల వింత ప్రవర్తన.. 12 రోజులుగా వృత్తాకారంలో తిరుగుతూ..!

చైనాలోని ఓ గొర్రెల మంద వింతగా ప్రవర్తిస్తోంది. రోజుల తరబడి వృత్తాకారంలో తిరుగుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Published : 23 Nov 2022 01:03 IST

బీజింగ్‌: చైనాలో ఓ గొర్రెల మంద (Sheep Flock) వింతగా ప్రవర్తిస్తోంది. కొన్ని రోజులపాటు సమూహంలోని గొర్రెలు వృత్తాకారంలో తిరుగుతూనే ఉన్నాయి. పగలూ రాత్రి అలసట లేకుండా తిరుగుతున్న వాటితీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో చైనా అధికారిక మీడియా ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్‌ అయ్యింది. రోజుల పాటు ఆ బృందంలోని గొర్రెలన్నీ ఒకేవిధంగా ప్రవర్తించడం ప్రస్తుతం మిస్టరీగా (Mystery) మారింది.

చైనా (China) ఉత్తర భాగంలోని ఇన్నర్‌ మంగోలియాకు చెందిన మయో అనే వ్యక్తి వందల సంఖ్యలో గొర్రెలను పెంచుతున్నాడు. అందులో కొన్ని గొర్రెలు నవంబర్‌ తొలి వారం నుంచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఒక మందలోని గొర్రెలు అవి ఉన్నచోటే వృత్తాకారంలో తిరగడం ప్రారంభించాయి. తొలుత కొన్ని గొర్రెలు ఇలా నడవడం మొదలుపెట్టగా.. వాటికి మరిన్ని తోడయ్యాయి. అలా ఏకంగా 12 రోజులపాటు ఆ మందలోని గొర్రెలన్నీ క్రమం తప్పకుండా తిరుగుతూనే ఉండటంపై ఆశ్చర్యం నెలకొంది. అయితే, నవంబర్‌ 4న అలా నడవడం మొదలైనట్లు పేర్కొన్న చైనా మీడియా.. నవంబర్‌ 16న సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేసింది. ప్రస్తుతం అవి ఇంకా అలాగే తిరుగుతున్నాయా..? లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా అలా తిరిగే క్రమంలో నీరు, ఆహారం తీసుకుంటున్నాయా అనే విషయం కూడా వెల్లడించలేదు.

ఆ వ్యాధే కారణమా..?

లిస్టెరియోసిస్‌ (Listeriosis) బాక్టీరియా సోకడం వల్ల ఇలా గొర్రెల మంద వింతగా ప్రవర్తిస్తూ ఉండవచ్చని పశువైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనినే సర్క్లింగ్‌ వ్యాధి (Circling Disease) అని కూడా పిలుస్తారు. కలుషిత ఆహారం, నేల, జంతువుల మలం వల్ల ఇది వ్యాపిస్తుంది. కుంగుబాటు, ఆకలి తగ్గడం, జ్వరం, పాక్షిక పక్షవాతం, సర్కిల్‌గా తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో ఓవైపు దెబ్బతినడంతో అవి వింతగా ప్రవర్తించేందుకు దారితీస్తాయి. ఈ వ్యాధి సోకిన జంతువులు 48 గంటల్లోనే మరణించే ప్రమాదం ఉంది. కానీ, ఇవి మాత్రం ఆరోగ్యంగా ఉండడంతోపాటు సుమారు రెండు వారాలు ఏకధాటిగా వృత్తాకారంలో తిరిగాయి.

అయితే, ఇతర జంతువుల వేట నుంచి తప్పించుకోవడం, తమ సమూహాన్ని రక్షించుకునే క్రమంలో గొర్రెలు ఇలా తమ ముందున్న  వాటిని అనుసరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇలా రోజులకు తరబడి అనుసరించడం మాత్రం ఆశ్చర్యమేనని ఇంగ్లాండ్‌లోని హార్ట్‌ప్యూరీ యూనివర్సిటీలోని వ్యవసాయవిభాగాధిపతి ప్రొఫెసర్‌ మ్యాట్‌ బెల్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని ఓ గ్రామంలో గతేడాది ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ మైదాన ప్రాంతంలో ఉన్న గొర్రెల మంద ఇలాగే వృత్తాకారంలో తిరిగిన ఫొటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు