Published : 18 Aug 2022 15:52 IST

Netaji Mystery: నేతాజీ మరణం.. 77 ఏళ్లుగా మిస్టరీగానే..!

తాను బతికుండగానే మిస్టరీకి ముగింపు పలుకుతానన్న అనితా బోస్‌

కోల్‌కతా: జపాన్‌లోని రెంకోజి ఆలయం (Renkoji Temple)లో ఉన్న సుభాష్‌ చంద్రబోస్‌ (Netaji Subhas Chandra Bose) చితాభస్మానికి డీఎన్‌ఏ పరీక్ష (DNA Test) నిర్వహించేందుకు భారత్‌తోపాటు జపాన్‌ ప్రభుత్వాన్ని త్వరలోనే ఆశ్రయిస్తానని నేతాజీ కుమార్తె అనితా బోస్‌ (Anita Bose) పేర్కొన్నారు. 77ఏళ్లుగా బోస్‌ జీవితంపై నెలకొన్న ఈ మిస్టరీని (Mystery) తేల్చడంతోపాటు అస్థికలను భారత్‌కు తెప్పించడమే ఆయనకు నిజమైన నివాళి అని ఉద్ఘాటించారు. తాను బతికుండగానే ఈ మిస్టరీకి ముగింపు పలికేందుకు కృషి చేస్తానని అనితా బోస్‌ స్పష్టం చేశారు. 1945 ఆగస్టు 18న సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలో మరణించారని చెబుతున్నప్పటికీ వాటిపై భిన్నవాదనలు నెలకొన్న నేపథ్యంలో అనితా బోస్‌ ఈ విధంగా స్పందించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్పందన కరువు..

‘నేతాజీ కుమార్తెగా.. నేను జీవించి ఉండగానే ఈ మిస్టరీకి ముగింపు పలకాలని కోరుకుంటున్నా. ఇందులో భాగంగా అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష (DNA Test)నిర్వహించాలని భారత ప్రభుత్వానికి త్వరలోనే విజ్ఞప్తి చేస్తా. వారి స్పందన కోసం కొంతకాలం వేచిచూస్తా. సరైన స్పందన వచ్చిందంటే సరే.. లేదంటే జపాన్‌ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తా. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరించినా లేదా ఈ విషయంలో జోక్యం చేసుకోమని చెప్పినా అందుకు అనుగుణంగా నేను ముందుకు వెళ్తా’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనితా స్పష్టం చేశారు. నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలనే విషయంపై గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వారినుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదన్నారు.

77 ఏళ్లుగా మిస్టరీనే..

‘1945లో జరిగినట్లు చెబుతోన్న విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారా లేదా అని శాస్త్రీయంగా తేల్చడానికి డీఎన్‌ఏ పరీక్ష (DNA Test) మనకొక అవకాశం కల్పిస్తుంది. ఈసారి మాత్రం కాలయాపన చేసేది లేదు. కొవిడ్‌ కారణంగా ఇప్పటికే రెండేళ్లు ఆలస్యమైంది. భారత ప్రభుత్వంతోపాటు జపాన్‌తోనూ ఏకకాలంలో ప్రయత్నాలు చేస్తా. కేవలం కొన్ని నెలల మాత్రం అస్థికలను భద్రపరచాలని జపాన్‌ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. కానీ, ఇప్పటికి 77ఏళ్లు గడిచినా నాన్న మరణం మిస్టరీగానే మిగిలిపోయింది’ అని జర్మనీలో ఉన్న అనితా బోస్‌ చెప్పుకొచ్చారు.

రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు..

‘నేను ఏ ఒక్కరి పేరు చెప్పదలచుకోలేదు. కానీ, నేతాజీ జీవితాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాడుకున్నారన్న మాట వాస్తవం. అలా చేయడం మంచి పద్దతి కాదు. రాజకీయాల్లో లేని వారిలోనూ ఎంతో మంది భారతీయులు నేతాజీని ఆరాధిస్తారు. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం సుభాష్‌ చంద్రబోస్‌కు గౌరవసూచికంగా ఎంతో చేస్తోంది. అదే సమయంలో నా ప్రమేయం, ఒత్తిడి లేకుండా వారెందుకు చొరవ చూపడం లేదో తెలియదు. ఆనాడు జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పేందుకు ఆధారాలున్నా, నాతోపాటు అందరికీ ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో నేతాజీ అస్థికలు మాతృదేశానికి తెప్పించేందుకు నా వంతు కృషి చేస్తా, మా నాన్నకు గుర్తుగా ఈ పని చేయాలనుకుంటున్నా’ అని అనితా బోస్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే, భారత స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర వహించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ (Subhas Chandra Bose) కనిపించకుండా పోవడం ఏడు దశాబ్దాలుగా మిస్టరీగానే మిగిలిపోయింది. 1945, ఆగస్టు 18న తైపిలో విమాన ప్రమాదంలో సుభాష్‌ చంద్రబోస్‌ మరణించారనే వాదన ఉంది. నేతాజీకి చెందినవిగా చెబుతోన్న చితాభస్మం నింపిన పాత్రను 1945 సెప్టెంబరు నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపర్చారు. ఈ క్రమంలో ఆయన మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు మూడు దర్యాప్తు కమిషన్లు వేసింది. గతంలో కాంగ్రెస్‌ హయాంలలో ఏర్పాటు చేసిన షా నవాజ్‌ కమిషన్‌ (Shah Nawaz Commission), ఖోస్లా కమిషన్‌ (Khosla Commission)లు నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారని తేల్చాయి. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖర్జీ కమిషన్‌ (Mukherjee Commission) మాత్రం ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదని నివేదించింది. ఇలా నేతాజీ మరణంపై భిన్నవాదనలు నెలకొన్న నేపథ్యంలో అస్థికలను భారత్‌కు తెప్పించి, డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని బోస్‌ కుమార్తె అనితా బోస్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని