ఫ్లాష్‌బ్యాక్‌: 10 వేల ప్రాణాలు బలిగొన్న మద్యనిషేధం!

కొన్ని రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బదులు శానిటైజర్లు తాగి 13 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. మద్యనిషేధంలో భాగంగా ధరలు భారీగా పెంచడంతో కొనలేని పరిస్థితుల్లో కొందరు, మద్యం లభించక.....

Published : 11 Oct 2020 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బదులు శానిటైజర్లు తాగి 13 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. మద్యనిషేధంలో భాగంగా ధరలు భారీగా పెంచడంతో కొనలేని పరిస్థితుల్లో కొందరు, మద్యం లభించక కొందరు శానిటైజర్లు తాగడం మొదలుపెట్టారు. శానిటైజర్లను ఇథైల్‌ ఆల్కహాల్‌ తదితర రసాయనాలతో తయారు చేస్తారు. ఇందులోనూ ఆల్కహాలే కదా ఉందని తాగేశారు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలాంటి ఘటనే ఓ సారి అమెరికాలో చోటుచేసుకుంది. మద్య నిషేధం పకడ్బందీగా అమలు చేయాలన్న అమెరికా ప్రభుత్వ సంకల్పం... పదివేల ప్రాణాలు బలిగొనేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే!

1920ల్లో అమెరికా ప్రభుత్వం దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలు చేసింది. ఆల్కహాల్‌ ఎవరికీ అందుబాటులో ఉండకుండా కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఇలాంటి సందర్భాల్లోనూ కొందరు వ్యాపారులు ప్రత్యామ్నాయాలు వెతుక్కున్నారు. పెయింట్స్‌ తదితర పరిశ్రమలు ఉపయోగించే పారిశ్రామిక ఇథైల్‌ ఆల్కాహాల్‌తో మద్యం తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. కెమిస్ట్‌ల సాయంతో ఇథైల్‌ ఆల్కహాల్‌ నుంచి ఆల్కహాల్‌ను వేరు చేసి అక్రమంగా అమ్మేవారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఇథైల్‌ ఆల్కహాల్‌ నుంచి ఆల్కహాల్‌ వేరు చేయడానికి వీల్లేకుండా మిథనాల్‌, పైరిడిన్‌, బెంజీన్‌, మెర్క్యూరీ సాల్ట్‌, జింక్‌, క్లోరోఫాం, ఎసిటోన్‌, మిథైల్‌ ఆల్కహాల్‌ సహా పలు రసాయనాలను కలపాలని పరిశ్రమలను ఆదేశించింది.

అయినా కొందరు అక్రమంగా పరిశ్రమల నుంచి పారిశ్రామిక ఆల్కహాల్‌ను దొంగిలించి, దాన్ని ఆల్కహాల్‌ రూపంలోకి మార్చి విక్రయించేవారు. విషపూరిత రసాయనాలు కలిసిన ఆల్కహాల్‌ను తాగడంతో దేశవ్యాప్తంగా వేలమంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంత ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నా మద్యం అక్రమ అమ్మకాలు ఆగలేదు. వీటిని ఆపడం కోసం ప్రభుత్వం పారిశ్రామిక ఆల్కహాల్‌లో విషం కలపడం ఆపలేదు. దీంతో మద్యనిషేధానికి వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. ఎవరైతే మద్య నిషేధం అమలు చేయాలని పోరాడారో.. వారే ఈ విషపూరిత మద్యం వల్ల కలుగుతున్న నష్టాలను చూసి మద్యనిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఎట్టకేలకు ఆల్కహాల్‌ను నిషేధించడం సాధ్యం కాదనిపించి 1933లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌‌వెల్ట్‌ మద్యనిషేధాన్ని ఎత్తివేస్తూ సంతకం చేశారు. అయితే అప్పటికే అమెరికాలో విషపూరిత మద్యం తాగి పది వేల మంది మృతి చెందినట్లు లెక్కగట్టారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారట. ఇంకొందరు కంటిచూపు కోల్పోయారు. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని చరిత్రకారులు అంటున్నారు. అమెరికా చరిత్రలో చోటుచేసుకున్న విషాదకరమైన ఘటనల్లో ఇదీ ఒకటిగా అభివర్ణిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని