Health: ఆరోగ్యం విషయంలో ఈ అపోహలు వద్దు!

ఆరోగ్యం గురించి ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని నమ్మవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అపోహలేంటి? నిజాలేంటి?

Published : 04 Nov 2021 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్నాళ్లు ఒక ఎత్తు.. కరోనా కాలం ఒక ఎత్తు. మొన్నటి వరకు ఎలాంటి వ్యాధులు వచ్చినా వైద్యులు నయం చేస్తారన్న ధీమా ఉండేది. కానీ కరోనాను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవడమే మార్గం కావడంతో ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహిస్తున్నారు. అయినా ఆరోగ్యం గురించి ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని నమ్మవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అపోహలేంటి? నిజాలేంటి? తెలుసుకుందామా..

శీతాకాలంలోనే ఫ్లూ ప్రభావం

శీతాకాలంలోనే ఎక్కువగా ఫ్లూ జ్వరం వ్యాప్తి చెందుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ, ఏడాది పొడవునా ఫ్లూ జ్వరాలు వస్తుంటాయి. అక్టోబర్‌లో మొదలయ్యే జ్వరాలు మే వరకు కొనసాగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వేసవికాలంలో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అందుకే జ్వరం వచ్చినా పెద్దగా తెలియదని అంటున్నారు. 

ఫ్లూ వ్యాక్సిన్‌ 

ఫ్లూ జర్వం ఎవరికైనా రావొచ్చు. అందుకే అప్పుడప్పుడు ఫ్లూ వ్యాక్సిన్‌ను వేసుకోవాలి. అయితే కొంతమంది ఈ వ్యాక్సిన్ పనిచేయదని గట్టిగా నమ్ముతారు. వ్యాక్సిన్‌ వందశాతం పనిచేయకపోవచ్చు. కానీ 60శాతానికిపైగా ఫ్లూ జ్వరం నుంచి కాపాడుతుందట. వ్యాక్సిన్‌ వేయించుకున్నా ఫ్లూ జ్వరం వస్తే.. అది అంత ప్రమాదకరంగా ఉండదని, తొందరగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక అపోహ.. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని. శరీరంలో అధికశాతం ఉండేది నీరే. శరీరంలో జరిగే ప్రతి చర్యకూ నీరు కావాలి. మూత్రవిసర్జన ద్వారా నీరు బయటకు పోయినా.. తిరిగి శరీరంలో నీటిశాతాన్ని సమతుల్యం చేయాలంటే మంచినీరు తాగాల్సిందే. అయితే ఎనిమిది గ్లాసుల నీరు కచ్చితంగా తాగాలనే నియమం లేదు. తాగే నీటితోపాటు మనం తీసుకునే ఆహారంలో ఉండే నీరు కూడా శరీరంలోకి వెళ్తుంటుంది. అది కూడా శరీరానికి అవసరమయ్యే నీటిశాతంలో చేరుతుంది. కాబట్టి దేహ అవసరాన్ని బట్టి తాగే నీటి పరిమాణం ఎక్కువైనా, తక్కువైనా ఫర్వాలేదు. అలా అని అసలు నీరు తాగకపోతే నిర్జలీకరణం జరిగి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు.

చేతుల శుభ్రతకు వేడినీళ్లు

చేతుల ద్వారా అనేక సూక్ష్మక్రిములు శరీరం లోపలికి వెళ్తుంటాయి. ఒకవేళ రోగకారక సూక్ష్మక్రిములు కూడా శరీరంలోకి వెళ్తే అస్వస్థతకు గురవుతాం. అందుకే బయటకు వెళ్లి వచ్చినా, ఏదైనా పట్టుకున్నా చేతులను శుభ్రం చేసుకోవాలి. ఈ కరోనా కాలంలో చేతులను శుభ్రంగా కడుక్కోవడం మరింత పెరిగింది. అయితే చాలామంది వేడినీళ్లతో చేతులు కడుక్కుంటేనే సూక్ష్మక్రిములు నశిస్తాయని అపోహపడుతుంటారు. నిజానికి వేడి నీళ్లు అవసరం లేదు. సాధారణ నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కుంటే సరిపోతుంది. సబ్బుతో చేతులను రుద్దుకుంటున్న సమయంలో ఉత్పత్తి అయ్యే వేడే సూక్ష్మక్రిములను నశింపజేస్తుందట.

పురుషులకు మాత్రమే గుండెపోటు?

గుండెపోటు కేవలం పురుషులకే వస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. ఎక్కువగా మగవారికే గుండెపోటు రావడం గురించి తెలిసి అలా అనుకుంటుంటారు. కానీ, గుండెపోటుకు లింగ, వయసు భేదాలు లేవు. ఎవరికైనా గుండెపోటు వచ్చే ముప్పు ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో యువతలోనూ గుండెపోటు సాధారణమైందని, ముఖ్యంగా మహిళల్లోనూ పెరుగుతోందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.

మాకెలాంటి వ్యాధులు రావు

కొంతమందికి వ్యాధులు కాదు.. జ్వరం కూడా సోకదు. దీంతో తాము వ్యాధులకు అతీతమని భ్రమపడుతుంటారు. మనిషికి ఇన్‌ఫెక్షన్లు‌ కచ్చితంగా వస్తుంటాయి. అయితే రోగనిరోధక శక్తి ఉన్నవాళ్లు వాటిని తట్టుకోగలరు. అంతమాత్రాన తమకేం కావట్లేదని వ్యాక్సిన్లు, రోగనిరోధక చర్యలు తీసుకోవడం మానేయవద్దు. అలా చేస్తే ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.

హై బీపీ సైలంట్‌ కిల్లర్‌

అధిక రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే. నిత్యం మందులు‌ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే అధిక రక్తపోటు లక్షణాలు చాలామందిలో కనిపించవు. రక్తపోటు విపరీతంగా పెరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యే వరకు దాన్ని గుర్తించలేరు. కానీ కొన్ని సందర్భాల్లో అధిక రక్తపోటు లక్షణాలు గుర్తించొచ్చు. తలనొప్పి, కంటిచూపులో మార్పు, గుండెనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అధిక రక్తపోటు లక్షణాలేనని వైద్యులు అంటున్నారు.

గుండెపోటు.. ఛాతినొప్పి ఒక్కటేనా?

సాధారణంగా గుండెపోటు అనగానే ఛాతిలో నొప్పి.. ఈ ఒక్క లక్షణమే అనుకుంటాం. కానీ గుండెపోటుకు మరిన్ని లక్షణాలున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దవడ, ఎడమ చేయి నొప్పి, మైకం కమ్మడం, అజీర్ణం, తీవ్ర అలసట, వాంతులు, తరచూ చెమటలు పట్టడం కూడా గుండెపోటు లక్షణాలే.

శానిటైజర్లు, యాంటిబ్యాక్టీరియల్‌ సబ్బులే కాదు

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా శానిటైజర్లు, యాంటిబ్యాక్టీరియల్‌ సబ్బుల వినియోగం భారీగా పెరిగింది. ఇవి ఉపయోగిస్తే చేతులపై ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. నిజమే కానీ, ఇవి మాత్రమే పరిష్కారం కాదు. సాధారణ సబ్బులు కూడా సూక్ష్మక్రిములను నాశనం చేయగలవు. సాధారణ సబ్బుతోనూ కొన్ని క్షణాలపాటు చేతుల్ని రుద్ది శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

సన్నగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లా?

లావుగా ఉండేవాళ్లు అనారోగ్యానికి గురవుతారని, సన్నగా ఉన్నవాళ్లు రోగాల బారిన పడరని కొంతమంది నమ్ముతుంటారు. అది అసత్యం. సన్నగా ఉండేవారు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. లావుగా ఉన్నవారిలో సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేసేవాళ్లూ ఆరోగ్యంగానే ఉంటున్నారు. అలాగే బక్కగా ఉన్నవాళ్లూ వ్యాధులకు గురవుతున్నారు. 

బలంగా ఉండాలంటే మాంసం తినాల్సిందేనా?

శరీరం బలంగా ఉండాలంటే మాంసం తినాలని, అందులో లభించే మాంసపుకృత్తులు చాలా అవసరమని అంటుంటారు. కానీ ఈ మధ్య కాలంలో శాకాహారులు పెరిగిపోతున్నారు. మాంసం తినకపోయినా ఆరోగ్యకరమైన శరీరానికి కావాల్సిన ప్రొటిన్లు శాకాహారంలోనూ లభిస్తాయి. బీన్స్‌, పప్పు దినుసుల్లో ఇవి అధికంగా ఉంటాయి.

సెలబ్రిటీల డైట్‌ ఇతరులకు మంచిదేనా?

సెలబ్రిటీ తారలు శరీరాన్ని అదుపులో పెట్టుకుంటారు. శరీరాకృతి చక్కగా ఉండటం వారి వృత్తిలో అవసరం మరి. కాబట్టి ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకొని డైటింగ్‌ చేస్తుంటారు. కొన్నిసార్లు అభిమానుల కోసం వారి డైట్‌ రహస్యాన్ని చెప్పేయడం.. అభిమానులు కూడా దాన్ని మొదలుపెట్టడం చేస్తుంటారు. ఇది అంత మంచి విధానం కాదని నిపుణులు అంటున్నారు. తారలు తీసుకునే ఆహారం, ఉండే వాతావరణం, చేసే పనులు వేరుగా ఉంటాయి. సాధారణ మనుషుల జీవన పరిస్థితులు వేరుగా ఉంటాయి. గుడ్డిగా వారు చెప్పినవి చేస్తూ, బాగా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. నిజంగా మీరు డైటింగ్‌ చేయాలనుకుంటే పోషకాహార నిపుణులను సంప్రదిస్తే మీ ఆహారపు అలవాట్లను బట్టి మీకు ప్రత్యేకంగా డైట్‌ కోర్స్‌ ఇస్తారు.

కొవ్వు పదార్థాలు తింటున్నారా?

కొవ్వు పదార్థాలు తింటే మనిషి లావెక్కుతారని అందరికీ తెలిసిందే. అయితే తక్కువ కేలరీలు ఉండి.. ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటూ మనిషి సన్నగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కేలరీలు తక్కువగా ఉన్న కొవ్వు పదార్థాలు తీసుకుంటే కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది. కాబట్టి ఎక్కువ తినలేరు. అలా సన్నగానే ఉండే అవకాశాన్ని కొవ్వు పదార్థాలు కల్పిస్తాయట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని