Pre wedding shoot : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ప్లాన్‌ చేస్తున్నారా.. అయితే ఓ లుక్కేయండి!

ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్‌ (Pre wedding) షూట్లకు ఆదరణ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు అనువైన ప్రాంతాలపై ఓ లుక్కేయండి.

Updated : 09 Apr 2023 14:16 IST

తెలుగు రాష్ట్రాల్లో.. మే నెలలో పెళ్లిళ్లకు (Marriages) అత్యధిక ముహుర్తాలున్నాయి. దాంతో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ (Pre wedding shoot) కోసం ఎక్కడికి వెళ్తే బాగుంటుందని కాబోయే వధూవరులు, వారి కుటుంబ సభ్యులు నెట్టింట్లో శోధిస్తున్నారు. దేశంలోని సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తుంది. అతి తక్కువ బడ్జెట్‌లో.. మనకు సమీపంలోనే పురాతన కోటలు, అందమైన అటవీ ప్రాంతాలు, ఆహ్లాదకర సముద్ర తీరాలున్నాయి. అక్కడకు వెళ్తే ఖర్చులు కలిసి వస్తాయి. పైగా మన తెలుగింటి వారసత్వం కూడా ఫొటో (Photo), వీడియో ఆల్బమ్‌లలో (Album) ఉట్టిపడుతుంది. ఆ ప్రదేశాలేవో పరిశీలించండి.

గోల్కొండ కోట

హైదరాబాద్‌ నగర శివారులో గోల్కొండ కోట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు చాలా అనువైన ప్రాంతం. ఎండ ఎక్కువగా లేని రోజున ఫొటో షూట్‌కు వెళ్తే అద్భుతమైన చిత్రాలు తీసుకోవచ్చు. నిజాం కాలంలోని రాతి కట్టడాలు బ్యాక్‌గ్రౌండ్‌కు ఒక రాయల్‌ లుక్‌ను తీసుకొస్తాయి. కోట ప్రవేశద్వారం.. మధ్యలో చూడచక్కని గ్రీనరీ కొత్త జంట స్టిల్స్‌కు సరికొత్త శోభనిస్తాయి. హైదరాబాద్‌ నగరం మొత్తం కన్పించేలా ఉన్న కొన్ని వ్యూ పాయింట్స్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.

గండి కోట

గోల్కొండ కోట తరహా రాజసం వైయస్‌ఆర్‌ జిల్లా గండికోటలో కన్పిస్తుంది. కోటలోని జుమ్మా మసీదు, ఎర్ర కోనేరు, మాధవరాయస్వామి, రంగనాయకుల దేవాలయం వద్ద మైమరపించే చిత్రాలు తీసుకోవచ్చు. గండికోటకు సమీపంలోని కొట్టాలపల్లె వద్దనున్న గాలి మరలు కూడా ఫొటోషూట్‌కు అనువుగా ఉంటాయి. మైలవరం జలాశయం వద్ద సైతం వివిధ రకాల స్టిల్స్‌ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

వరంగల్‌ కోట

నాటి కాకతీయుల కోట నేటి ఖిలావరంగల్‌ కోటగా ప్రసిద్ధిగాంచింది. ఈ పురాతన కోటలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కన్పిస్తుంటుంది. 13వ శతాబ్దం నాటి కాకతీయ కళా తోరణాల వద్ద చూడచక్కని చిత్రాలు తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కనిపించే శిలాతోరణం ఇక్కడిదే. మెట్లబావులు సహా పుట్ట కోట, మట్టి కోట, రాతి కోట. నాలుగు దిక్కుల సింహ ద్వారాల వద్ద వైవిధ్యమైన చిత్రాలను క్లిక్‌ మనిపించొచ్చు.

అరకు లోయ

ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు ఫొటో షూట్లకు చాలా అనుకూలమైన ప్రాంతం. ఇక్కడి తూర్పు కనుమల్లో టీ తోటలు సుందరంగా కన్పిస్తుంటాయి. బొర్రా గుహలు, ఆదివాసీ మ్యూజియం, పద్మాపురం బొటానికల్‌ గార్డెన్స్‌ వంటి ప్రదేశాల్లోనూ కెమెరాలను క్లిక్‌మనిపించవచ్చు. దారి పొడవునా దట్టమైన అటవీ ప్రాంతం కన్పిస్తుంది. సొంత వాహనంలో వెళ్తే అక్కడక్కడ కాసేపు ఆపి స్టిల్స్‌ తీసుకోవచ్చు.

రుషి కొండ బీచ్‌

విశాఖలోని అందమైన ప్రాంతాల్లో రుషి కొండ బీచ్‌ ఒకటి. కేరళ, గోవా తరహాలో ఇక్కడి తీరంలో కొన్ని చోట్ల కొబ్బరి చెట్లు కన్పిస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మత్స్యకారులు ఒడ్డున నిలిపి ఉంచిన బోట్ల వద్ద రకరకాల పోజులిస్తూ ఫొటోలు తీసుకోవచ్చు.

తలకోన అటవీ ప్రాంతం

తిరుపతి నుంచి భాకరాపేట మీదుగా సిద్ధేశ్వరాలయానికి వెళ్లి.. అక్కడి నుంచి 2 కి.మీ.లు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తే తలకోన అందాలు సాక్షాత్కరిస్తాయి. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ కాబోయే వధూవరులు సరికొత్త స్టిల్స్‌ దిగొచ్చు. ఇక్కడి జలపాతం వద్ద తీసుకునే చిత్రాలు ఆల్బమ్‌కే హైలెట్‌గా నిలుస్తాయి. అరుదైన జీవ, వృక్ష జాతులకు ఆవాసమైన తలకోనలో బస చేయడానికి అటవీశాఖ అతిథి గృహాలు కూడా ఉన్నాయి. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని