100 Years Old Restaurants: వందేళ్లు దాటినా ఫుడ్‌ లవర్స్‌ను ఆకర్షిస్తున్న రెస్టారంట్లు ఇవే!

 కొన్నేళ్ల నుంచి నిరంతరంగా భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటున్న కొన్ని రెస్టారంట్లు మన దేశంలో ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందేళ్లకు పైగా సేవలందిస్తూ తమ కమ్మని వంటకాలతో ఫుడ్‌ లవర్స్‌ను ఆకర్షిస్తున్న రెస్టారంట్లు

Updated : 16 Dec 2021 19:05 IST

అమ్మ చేతి వంటకు వంకలు పెట్టలేం. కానీ ప్రియంగా ఆహారాన్ని అందించే రెస్టారంట్లు ఇప్పుడు చాలానే అందుబాటులోకి వచ్చాయి. రెస్టారంట్లలో కమ్మని భోజనం చేశాక.. ఆ రుచికి ఆహా అంటూ పొంగిపోతుంటారు కొందరు. నలభీమపాకంలా ఉందని పొగుడుతూ లొట్టలేసుకుంటూ తింటుంటారు మరికొందరు. మళ్లీ తినాలనుకుంటే ఇలాంటి రెస్టారంట్లకే వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం కొన్ని వేలల్లో రెస్టారంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటన్నిట్లో రుచికరమైన భోజనం దొరుకుతుందా అంటే టేస్ట్‌ చేస్తే గాని చెప్పలేం. ఒక్కోసారి బాగుండొచ్చు.. ఇంకోసారి తింటే ఆ టేస్ట్‌ రాకపోవచ్చు. కానీ, కొన్నేళ్ల నుంచి నిరంతరంగా భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటున్న కొన్ని రెస్టారంట్లు మన దేశంలో ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందేళ్లకు పైగా సేవలందిస్తూ తమ కమ్మని వంటకాలతో ఫుడ్‌ లవర్స్‌ను ఆకర్షిస్తున్న రెస్టారంట్లు ఏవి? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకుందామా..


🏨 లియోప్లాడ్‌ కేఫ్‌, ముంబయి

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 150 ఏళ్ల నాటి రెస్టారంట్‌ పేరే లియోప్లాడ్‌ కేఫ్‌. ఇది ఇప్పటికీ చూడటానికి ఎంతో అందంగా ఉంటూ అక్కడికి వచ్చే ఆహార ప్రియుల్ని ఆకట్టుకుంటుంది.  2008లో జరిగిన ముంబయి దాడుల్లో ఈ కేఫ్‌పైనా బుల్లెట్ల వర్షం కురిసింది. అయితే, అక్కడ ఇప్పటికీ బుల్లెట్ గుర్తులు ఇంకా కనిపిస్తూ ఉంటాయి. ఈ రెస్టారంట్‌ పర్యాటకులను సైతం ఆకర్షిస్తోంది. అంతేకాకుండా ప్రేమికుల ఫేవరేట్‌ ప్లేస్‌గానూ ప్రసిద్ధి చెందింది. 


(photo source: twitter.com/kaushikcbasu)

🏨 ఇండియన్‌ కాఫీ హౌస్‌, కోల్‌కతా

కోల్‌కతాలో 1876లో మొదటి ఇండియన్‌ కాఫీ హౌస్‌ను ప్రారంభించారు. దీన్నే మొదట్లో అల్బర్ట్‌ హాల్‌గా పిలిచేవారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్‌ కాఫీ హౌస్‌గా పేరు మార్చారు. చాలా మంది దీన్ని ఐసీహెచ్‌గానూ పిలుస్తుంటారు. ఈ రెస్టారంట్‌ మంచి కాఫీని, అల్పాహారాన్ని తీసుకోవాలనే ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. 5 స్టార్ హోటల్‌ను తలపించేలా ఉంటూ మంచి అనుభూతిని ఇస్తుంది.


(photo source: twitter.com/MegTheDesiArmy)

🏨 టండే కబాబ్‌, లఖ్‌నవూ

లఖ్‌నవూలో ప్రసిద్ధి చెందిన మొగులాయి వంటకాలే కాదు అక్కడ టండే కబాబ్‌ కూడా చాలా ఫేమస్‌. టండే కబాబ్‌ అనేది కబాబ్‌లో ఒక రకం వంటకం కాకపోయినా దీన్ని తయారుచేసిన ఓ దివ్యాంగుడు సరదాగా టండే అని నామకరణం చేశాడు. అప్పటినుంచి దీన్ని  అందరూ టండే కబాబ్‌ అని పిలవడం మొదలుపెట్టారు.   ఈ రెస్టారంట్‌ 115 ఏళ్ల నుంచి నడుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇది ఎంతో  ప్రసిద్ధి చెందింది. ఇందులో తయారు చేసిన కబాబ్స్‌ ఎంతో రుచిగా ఉంటాయి. ఒకసారి రెస్టారంట్‌లోకి అడుగుపెట్టగానే దాని వాసనకు నోరు ఊరుతుందని ఇందులోకి వెళ్లినవారు చెబుతుంటారు.



🏨 కరీమ్, దిల్లీ

న్యూదిల్లీలో జామా మసీదుకు సమీపంలోని కరీమ్ రెస్టారంట్‌ కూడా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ దీనికి ఆహారప్రియుల తాకిడి బాగా ఉంటుంది. దీన్ని 1913లో హాజీ కరీముద్దీన్ ప్రారంభించారు. ఆయన నవాబ్‌ రాయల్‌ వంటకాలు చాలా బాగా చేస్తారని ప్రసిద్ధి. ఆయన బాటలోనే ఈ రెస్టారంట్‌ను నడిపిస్తున్నారు. 5 స్టార్‌ హోటల్‌లో వండే చెఫ్‌ కూడా ఇంత అద్భుతంగా వండలేరని అక్కడి భోజనప్రియులు కితాబిస్తుంటారు.


 

(photo source: twitter.com/dnomadarchitect)

🏨 గ్లెనరీ, డార్జిలింగ్

రొమాంటిక్‌ ప్లేస్‌గా, వేసవి సెలవుల్లో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించే పర్యాటక ప్రదేశం డార్జిలింగ్‌లో కూడా ఫేమస్‌ రెస్టారంట్‌ ఉంది. అదే గ్లెనరీ రెస్టారంట్‌. దాదాపు 130 ఏళ్ల నాటి నుంచి కమ్మని వంటకాలతో ఫుడ్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. గ్లెనరీ రెస్టారంట్‌ విదేశీ అనుభూతిని కలిగిస్తోంది. ఇందులో ప్రతి ఒక్క వంటకం అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఈ రెస్టారంట్‌కు వెళ్లాలనుకునేవారు బేక్‌డ్‌ పదార్థాలను తప్పక టేస్ట్‌ చేయాలని చెబుతారు. ఈ రెస్టారంట్‌ రద్దీగా, ఇరుకుగా ఉండే నెహ్రూ రోడ్డులో ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని వెళ్లాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని