Round shape lake : ప్రపంచంలోనే గుండ్రని సరస్సు.. దాని ప్రత్యేకతలు తెలుసా!

ప్రపంచంలోనే అత్యంత గుండ్రంగా కన్పించే సరస్సు (Round shape lake) ఫ్లోరిడాలో (Florida) ఉంది. దాని పేరు ‘కింగ్స్‌లీ’. ఆ సరస్సు ప్రత్యేకతల గురించి చదివేయండి.

Published : 04 Jun 2023 11:46 IST

Image : kingsleylake.org

సరస్సులు విభిన్న ఆకారాల్లో కన్పిస్తుంటాయి. అయితే ఫ్లోరిడాలోని (Florida) ‘కింగ్స్‌లీ’ (kingsley lake) లేక్‌ మాత్రం గుండ్రంగా.. చూడ ముచ్చటగా దర్శనమిస్తుంటుంది. దీనిని ‘సిల్వర్‌ డాలర్‌ లేక్‌’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత గుండ్రంగా ఉన్న సరస్సు ఇదేనని భావిస్తున్నారు. ఆ సరస్సు విశేషాల గురించి తెలుసుకోండి.

వేసవి హంగామా అక్కడే

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం క్లే కౌంటీలో వేసవి వచ్చిందంటే చాలు అందరూ కింగ్స్‌లీ లేక్‌ వైపు పయనమవుతారు. అక్కడ వేసవి వినోదానికి కొదవుండదు. ఈ లేక్‌లో బాస్‌ ఫిష్‌లు కోకొల్లలుగా కన్పిస్తాయి. దీనిని చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి మరో ప్రధాన కారణం గుండ్రటి ఆకారం. ఈ సరస్సును కాస్త ఎత్తులో నుంచి చూస్తే అది ఎంత గుండ్రంగా ఉందో అర్థమవుతుంది. అందుకే ఈ సరస్సుకు ‘సిల్వర్‌ డాలర్ లేక్‌’ అని ముద్దు పేరు పెట్టారట. ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఆ సరస్సు పైనున్న ఆకాశ మార్గం గుండా విమానాలు నడిపిన పైలట్లు. అవును.. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ సరస్సు పై నుంచి చూస్తే ఒక వెండి నాణెం మెరుస్తున్నట్లుగా కన్పిస్తుండటంతో పైలట్లు దీనికి ఆ పేరు పెట్టారు.

ఇవే సరస్సు ప్రత్యేకతలు

ఈ అరుదైన సరస్సు 2వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని తీరం 5.5 మైళ్ల పొడవుంది. ఉత్తర, పడమర దిశల్లో కలిపి సుమారు 200 రేవులున్నాయి. కింగ్స్‌లీ లేక్‌ సుమారు 90 అడుగుల లోతు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇది ఫ్లోరిడాలోనే లోతైన సరస్సుగా కూడా పేరుగాంచింది. సహజంగా ఏర్పడినందున ఈ సరస్సు ఫ్లోరిడాలోనే పురాతన, ఎత్తయిన సరస్సు అని స్థానికులు చెబుతున్నారు. 

-ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని