Tokyo Olympics:ఈ ఒలింపిక్స్‌లో రష్యా కనిపించలేదేంటీ!

ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించే దేశాల్లో రష్యా ముందువరుసలో ఉంటుంది. అంతర్జాతీయ పోటీల్లో తమకు ఎదురులేదని ప్రతిసారి నిరూపిస్తుంటుంది. కానీ, తాజాగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న దేశాల్లో రష్యా పేరు కనిపించలేదు. ఎందుకంటే ఒలింపిక్స్‌లో ఆడకుండా రష్యాపై నిషేధముందన్న

Published : 27 Jul 2021 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించే దేశాల్లో రష్యా ముందువరుసలో ఉంటుంది. అంతర్జాతీయ పోటీల్లో తమకు ఎదురులేదని ప్రతిసారి నిరూపిస్తుంటుంది. కానీ, తాజాగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న దేశాల జాబితాలో రష్యా పేరు కనిపించలేదు. ఎందుకంటే ఒలింపిక్స్‌లో ఆడకుండా రష్యాపై నిషేధముంది. అయితే మాత్రం ఒలింపిక్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే రష్యా ఈ పోటీల్లో పాల్గొనకుండా ఊరుకుంటుందా..! మరో మార్గంలో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ‘ఆర్‌వోసీ’ పేరుతో ఆ దేశ‌ క్రీడాకారులు విశ్వక్రీడల్లో పాల్గొనేలా చేసింది.

నిషేధం ఎందుకు?

అథ్లెట్లకు నిర్వహించే డోపింగ్‌ పరీక్షలకు సంబంధించి రష్యా అవకతవకలకు పాల్పడిందని 2014 నుంచి ఆరోపణలు వస్తున్నాయి. విచారణ జరిపిన వరల్డ్‌ యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ(వాడా).. 2015లో రష్యాలో యాంటీ డోపింగ్‌ ల్యాప్‌ను మూసివేసింది. వంద మంది క్రీడాకారుల్ని క్రీడల్లో పాల్గొనకుండా డిబార్‌ చేసింది. డోపింగ్‌ పరీక్షలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చిందన్న కారణంగా 2019 డిసెంబర్‌లో రష్యాపై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్లు వాడా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒలింపిక్స్‌, ఫిఫా వరల్డ్‌ కప్‌-2022, సహా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి రష్యాకు వీలు లేకుండా పోయింది. దీంతో ఒలింపిక్స్‌లో పాల్గొనడం కోసం కఠోర శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆందోళనకు గురయ్యారు. అయితే, వాడా నిర్ణయంపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని రష్యా ఉపయోగించుకుంది. 

ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు.. కానీ!

ఈ విషయంపై కోర్ట్‌ ఆఫ్‌ అర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్‌) విచారణ చేపట్టి.. వాడా విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని రెండేళ్లకు తగ్గించింది. అంటే రష్యాపై నిషేధం 2022 డిసెంబర్‌ వరకే ఉంటుంది. కానీ ఒలింపిక్స్‌ 2020(కరోనా కారణంగా ఈ క్రీడలు 2021లో జరుగుతున్నాయి)లో పాల్గొనే అవకాశం లేక అథ్లెట్లు నష్టపోతారు. అందుకే, డోపింగ్‌ కుంభకోణంతో సంబంధంలేని క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి అవకాశం కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో కొన్ని షరతులతో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి కాస్‌ వెసులుబాటు ఇచ్చింది. రష్యా నుంచి ఒలింపిక్స్‌కు అర్హత పొందే క్రీడాకారులు అక్కడ రష్యా దేశం పేరు, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని వాడకూడదని స్పష్టం చేసింది. 

అలా రష్యా కాస్త ఆర్‌వోసీగా మారింది!

కాస్‌ తీర్పుపై వాడా అసంతృప్తి వ్యక్తం చేయగా.. రష్యా స్వాగతించింది. దీంతో ఒలింపిక్స్‌లో ఆడే అథ్లెట్లు రష్యాకి కాకుండా రష్యన్‌ ఒలింపిక్స్‌ కమిటీ(ఆర్‌వోసీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందుకే, విశ్వక్రీడల్లో రష్యా పేరు ఉండాల్సి చోట ఆర్‌వోసీ దర్శనిమిస్తోంది. ప్రారంభోత్సవ సమయంలోనూ రష్యన్‌ అథ్లెట్లు ఆర్‌వోసీ పేరుతో.. మార్చ్‌ నిర్వహించారు. 

రష్యాకు పేరు మార్పు కొత్తేం కాదు..!

రష్యా చరిత్ర చూస్తే ఆ దేశ భౌగోళిక స్వరూపం, పేరులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించే అథ్లెట్ల శిబిరం పేరు కూడా మారేది. 1900 నుంచి 1912 వరకు రష్యన్‌ ఎంపైర్‌ పేరుతో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రష్యా.. 1952-88 మధ్య సోవియట్‌ యూనియన్‌గా.. 1992లో యూనిఫైడ్‌ టీమ్‌గా, 1996 నుంచి రష్యా పేరుతో ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది. నిషేధం నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌-2020లో ఆర్‌వోసీగా మారింది. ప్రస్తుతం ఒక స్వర్ణం, 4 రజతం, 3 కాంస్య పతకాలను కైవసం చేసుకున్న ఆర్‌వోసీ(రష్యా).. పతకాల పట్టికలో 8వ స్థానంలో ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని