India islands : నిండా మునుగుతున్న ద్వీపాలు.. చొరవ చూపకపోతే ఇక మ్యాప్‌లో కనిపించవు!

వాతావరణ (Weather) మార్పుల కారణంగా సముద్రం(Sea) భూమి(Earth)ని ఆక్రమిస్తోంది. తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భారత(India) చిత్రపటంలోని కొన్ని ద్వీపాలు(Islands) ఇకపై కన్పించకుండా పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 26 Mar 2023 13:56 IST

ప్రపంచం(World)లో వాతావరణ మార్పుల వేగం పెరిగింది. అంటార్కిటికాలో గత 25 ఏళ్లలో 3 లక్షల టన్నుల మంచు కరిగిపోయినట్లు తాజాగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర(Sea) మట్టాలు 9 మిల్లీ మీటర్ల మేర పెరిగాయని వెల్లడైంది. మన దేశానికి మూడు వైపులా సముద్రం తీరం ఉంది. చుట్టూ 1382 ద్వీపాలున్నాయి(Islands). సముద్రం, నదుల కోత, మడ అడవుల నరికివేత, ఉష్ణోగ్రత(Temperature) పెరుగుదల, అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా ఈ ద్వీపాలు రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా మాయమయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే రక్షణ చర్యలు చేపడితే ఆ ప్రమాదాన్ని కాస్తయినా నివారించవచ్చని చెబుతున్నారు. లక్ష దీవుల్లోని ఒక ద్వీపం ఇప్పటికే పూర్తిగా మ్యాప్‌లో కనిపించడం లేదట. అలాంటి ముప్పు పొంచి ఉన్న కొన్ని ముఖ్యమైన జనావాస ద్వీపాలు ఏవో పరిశీలించండి.

పగడాల ‘లక్షదీవులు’

పర్యాటక రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిన లక్షదీవులు 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పగడపు దిబ్బలు అధికంగా కన్పిస్తాయి. 2010, 2016 సంవత్సరాల్లో వచ్చిన ఎల్‌నినో కారణంగా ఆ దిబ్బలు క్షీణించాయి. అరేబియా సముద్రంలో పెరుగుతున్న వేడి కూడా అందుకు ఒక కారణం. ఇక్కడ ఒక వాటర్‌ విల్లా ప్రాజెక్టు చేపట్టాలని నీతి ఆయోగ్‌ సూచించింది. ఆ ప్రాజెక్టు వల్ల లక్షదీవుల్లోని మడుగులకు భారీగా నష్టం వాటిల్లుతుందని, దీనిపై పునరాలోచన చేయాలని 2021లో ఒక శాస్త్రవేత్తల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రాజెక్టులు, అకాల తుపానుల మూలంగా నేల కోతకు గురవుతోంది. ఒక అధ్యయనం ప్రకారం 2080-2100 మధ్య కాలంలో ఏడాదికి 0.78 మిల్లీమీటర్ల మేర జలాలు పెరుగుతాయని తెలిసింది. దాంతో చిన్న దీవులు అంతరించి పోయే ప్రమాదముంది. అందుకే ఇక్కడ నివసిస్తున్న దాదాపు 64 వేల మంది తమ అస్థిత్వం కోసం పోరాడుతున్నారు.

అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు

బంగాళాఖాతంలో ద్వీపాల సముదాయం అండమాన్‌ అండ్‌ నికోబార్‌. 2004 సునామీ కారణంగా అండమాన్‌ నికోబార్‌లోని ఇందిరాపాయింట్‌ వద్దనున్న లైట్‌హౌస్‌ నాలుగు మీటర్లు మునిగిపోయింది. రాకాసి అలల ధాటికి ఈ ద్వీపాల స్వరూపమే మారిపోయింది. ద్వీపాల వైవిధ్యాన్ని కాపాడుతున్న మడ అడవులు దాదాపుగా క్షీణించిపోయాయి. ఫలితంగా గడిచిన పదేళ్లలో దాదాపు 450 భూకంపాలను చవి చూడాల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వం చేపట్టిన ఓ మౌలిక సుదుపాయాల ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే నికోబార్‌లోని అడవులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక్కడ సముద్ర మట్టం ఏటా 5మిల్లీమీటర్లు పెరుగుతూ వస్తోంది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ.

భారత్‌-శ్రీలంక మధ్యన ‘వహాన్‌’  

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి తీరానికి 6 కిలోమీటర్ల దూరంలో వహాన్‌ ఐలాండ్‌ కన్పిస్తుంది. ఇది భారత్‌కు, శ్రీలంకకు మధ్యలో ఉంటుంది. 1969 నాటికి 20.08 హెక్టార్లలో వ్యాపించి ఉన్న ఈ ద్వీపం 2.33 హెక్టార్లకు తగ్గిపోయి ఓ బల్బులాగా ప్రస్తుతం దర్శనమిస్తోంది. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌లోని ఈ ద్వీపం ఒక దశాబ్దం క్రితం దాదాపుగా అదృశ్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఇక్కడ పగడాల తవ్వకాలు ఎక్కువగా జరిగేవి. అలా క్రమంగా పగడపు దిబ్బలు అంతరించిపోవడంతో ఈ ద్వీపం ఉత్తరభాగాన్ని అలలు ముంచెత్తడం మొదలైంది. 2013లో ఈ ద్వీపం రెండు భాగాలుగా చీలిపోయింది. దాంతో స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. పరిశోధకుల సూచనల మేరకు కాంక్రీటుతో కృత్రిమ దిబ్బలను తయారు చేసి సముద్రంలో పేర్చారు. ఫలితంగా ఈ ద్వీపంలో క్రమంగా ఇసుక పోగవుతున్నట్లు వెల్లడైంది.

గిన్నిస్‌కెక్కిన ‘మజూలీ ’ 

అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదీ ద్వీపం మజూలీ. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించింది. 2016లో దీనిని జిల్లాగా ప్రకటించారు. ఆ ఘనత అందుకున్న తొలి ఐలాండ్‌ ఇదే. వ్యవసాయం, ఆవాల సాగు, చేపల పెంపకం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ మార్గాలు. 1950 నాటికి 1250 చదరపు కిలోమీటర్లున్న ఈ ద్వీపం ప్రస్తుతం 483 చదరపు కిలోమీటర్లకు  కుంచించుకుపోయింది. నది కోతకు గురికావడం, దాని దక్షిణ భాగంలో కట్టలు కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

యాస్‌ తుపానుతో ‘ఘోరామర’

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి దక్షిణ భాగంలో కోల్‌కతాకు 92 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం కన్పిస్తుంది. ఈ ప్రాంతం 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. మట్టి కోతకు గురి కావడంతో ఉపాధినిస్తున్న తాటి చెట్లు నిలవడం కష్టంగా మారుతోంది. ఈ ప్రాంతంలో తమలపాకు సాగు కూడా అధికం. 2021లో వచ్చిన ‘యాస్‌’ తుపానుకు ముందు ఇక్కడ 550 యూనిట్ల తోటలు సాగయ్యేవి. తుపాను కారణంగా ఆ తోటలు, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి ద్వీపం ఉత్తర, ఈశాన్య భాగంలో కోత కొనసాగుతోంది. ఇదే ఒరవడి సాగితే ద్వీపం జాడ లేకుండా పోతుందేమోనని స్థానికులు భయాందోళకు గురవుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ 40వేల మంది వరకూ నివసించే వారు. ఇప్పుడు ఆ సంఖ్య 4వేలకు పడిపోయింది.

ఉప్పుగా మారుతున్న ‘మన్రో థురుతు’

కేరళలోని కొల్లం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపం ఉంది. ట్రావెన్‌కోర్‌ రాజ్య బ్రిటిష్‌ పరిపాలనాధికారి కల్నల్ జాన్‌ మన్రో పేరు దీనికి పెట్టారు. ఈ ద్వీపం క్రమక్రమంగా క్షీణించిపోతోంది. ఒకప్పుడు 12-13వేలున్న జనాభా ఇప్పుడు 8వేలకు తగ్గిపోయింది. వారంతా కొబ్బరి సాగు, పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్నారు.అలల తాకిడి, వరదల కారణంగా ఈ నేల ఉప్పుగా మారింది. దాంతో సారవంతమైన ఈ భూభాగం వ్యవసాయానికి పనికిరాకుండా పోతోంది. ఈ ద్వీపానికి సమీపంలో నిర్మిస్తున్న థెన్మల డ్యామ్‌, విచ్చలవిడి ఇసుక తవ్వకాల కారణంగా ఈ నష్టం చవి చూడాల్సి వస్తోందని ఓ పరిశోధనలో వెల్లడైంది. కల్లాడ నదిలోని వ్యర్థాలు, ఉప్పునీటి మడుగుల వల్ల మట్టి మాత్రమే కాకుండా భూగర్భ జలాల్లోనూ మార్పు వచ్చిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని