Small bank : అమెరికాలోనే అతి చిన్న బ్యాంక్‌.. ఇద్దరే ఉద్యోగులు!

అమెరికాలో (America) ఆ బ్యాంక్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. కానీ, ప్రస్తుతం దాని ఆస్తులు విలువ మాత్రం కేవలం 30 లక్షల డాలర్లే. ఆ దేశంలోనే అతి చిన్న బ్యాంక్ (Bank) అయినప్పటికీ అందులో లావాదేవీలు (Transactions) ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోండి.

Published : 12 May 2023 12:16 IST

అగ్రరాజ్యం అమెరికాలో (America) సుమారు వందేళ్ల క్రితం ‘కెంట్‌ల్యాండ్ ఫెడరల్‌ సేవింగ్స్‌ అండ్‌ లోన్‌’ బ్యాంకును (Bank) స్థాపించారు. ప్రస్తుతం ఆ బ్యాంకు మొత్తం ఆస్తుల (Assets) విలువ కేవలం 30 లక్షల డాలర్లు. అందులో ఇద్దరు ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. లావాదేవీల (Transactions)కోసం ఈ బ్యాంక్‌కు ఏటీఏం (ATM) వంటి సౌకర్యాలు లేవు. ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసుకుందామంటే కనీసం వెబ్‌సైట్‌ (Website) కూడా లేదు. అందుకే వీరు లావాదేవీలు నిర్వహించడానికి ఎలాంటి రుసుములు తీసుకోరు.

తొలి నుంచీ ఒక్కటే బ్రాంచి

అమెరికాలో బ్యాంక్‌ అనే పేరు చెప్పగానే జేపీ మోర్గాన్‌ ఛేజ్‌, మోర్గాన్‌ స్టాన్లీ, సిటీగ్రూప్‌, వెల్స్‌ ఫార్గో, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి దిగ్గజ సంస్థలే గుర్తుకొస్తాయి. కానీ, ఖాతాదారులు, డిపాజిట్లలో ఎటువంటి భారీతనం లేని ఈ అతి చిన్న బ్యాంకు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే ‘కెంట్‌ల్యాండ్ ఫెడరల్‌ సేవింగ్స్‌ అండ్‌ లోన్‌’ బ్యాంక్‌. దీనిని యూఎస్‌లోనే అతి చిన్న బ్యాంక్‌గా ప్రకటించారు. ఈ బ్యాంక్‌ను 1920లో స్థాపించారు. అప్పటి నుంచి విస్తరణ, కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు లేకుండా దీని ప్రస్థానం సాగిపోతోంది. ఇండియానాలోని కెంట్‌ల్యాండ్‌లో మొదట్నుంచీ ఉన్న ఒకే ఒక్క బ్రాంచి మాత్రమే ఇప్పటికీ కొనసాగుతోంది.

సేవలు ఆ మూడు మాత్రమే!

ఇక్కడ ఖాతాదారులకు మూడు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అవి స్థిరాస్తిని తనఖా పెట్టుకోవడం, పొదుపు ఖాతాను తెరవడం, డిపాజిట్‌ సర్టిఫికెట్ తెరవడం. 1920 చివర్లో స్టాక్‌ ఎక్సేంజ్‌ ఘోరంగా పడిపోయినా తమ బ్యాంక్‌ సేవలు కొనసాగాయని ప్రస్తుత సీఈవో జేమ్స్‌.ఎ. సమన్స్‌ తెలిపారు. ఈ బ్యాంకులో నగదు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని అప్పట్లోనే ప్రజలు తమను విశ్వసించారని ఆయన తెలిపారు. అన్నట్లు ఈ జేమ్స్‌ ఎవరో కాదు ఆ బ్యాంక్‌కు నాలుగో తరం సీఈవో. తన పూర్వీకులైన హ్యూమ్‌ సమన్స్‌, జార్జ్‌ సమన్స్‌, జేమ్స్‌.ఇ. సమన్స్‌ల వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారు.

టెక్నాలజీకి దూరం

గడిచిన శతాబ్ద కాలంలో బ్యాంకింగ్‌ రంగం బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీని అంది పుచ్చుకుని ఎన్నో సంస్థలు ముందుకు సాగుతున్నాయి. అయినప్పటికీ ఈ బ్యాంకులో చెక్కులను రాయడానికి సంప్రదాయ కోడింగ్‌ మెషీన్లనే ఇంకా వినియోగిస్తున్నారట. అందువల్ల ఈ బ్యాంకింగ్‌ వ్యాపారం తన జనరేషన్‌తోనే అంతమైపోతుందేమోనన్న భయం కూడా సీఈవో జేమ్స్‌కు పట్టుకుందట. ప్రస్తుతం ఆయన వయసు 55 ఏళ్లు. బ్యాంకింగ్‌ నిబంధనలు కఠినతరం చేయడం, ఇతర బ్యాంకుల పోటీ ఎక్కువ కావడంతో ఇటీవల ఈ చిన్న బ్యాంక్‌కు వచ్చే ఆదాయం కూడా క్రమంగా తగ్గిపోతోందట.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని