Published : 07/11/2021 18:10 IST

Smart Shopping: స్మార్ట్‌గా షాపింగ్‌ చేయండి..!

పండగల సీజన్లలో షాపింగ్‌మాల్స్‌, ఆన్‌లైన్‌ పోర్టళ్లు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కొనుగోలుదారులను తెగ ఆకర్షిస్తుంటాయి. అయితే, వాళ్లు ఆఫర్లు ఇస్తున్నారు కదా అని మీ బడ్జెట్‌ను మించి కొనుగోళ్లు చేస్తే అప్పులపాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి షాపింగ్‌ చేసే సయమంలో సంయమనంతో ఉండాలి. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చూద్దాం..

క్షుణ్నంగా పరిశీలించాకే వడ్డీలేని వాయిదాలు!

ఈ మధ్య అన్ని రకాల వస్తువులను వడ్డీలేని వాయిదా (జీరో-కాస్ట్‌ ఈఎంఐ) పద్ధతిలో విక్రయిస్తున్నారు. ఈ పద్ధతిలో డబ్బు చెల్లిస్తే భారం తగ్గుతుందని కొనుగోలుదారులు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కానీ, ఒకసారి వస్తువుల ఆఫర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ వడ్డీలేని వాయిదాలను ఎంచుకోండి. కొంతమంది డీలర్లు నగదు చెల్లిస్తేనే వస్తువుపై రాయితీలు ఇస్తారు. ఇలాంటి ఆఫర్లలో వాయిదాల పద్ధతి ఎంచుకుంటే.. రాయితీని నష్టపోవాల్సి వస్తుంది. ఉదాహరణకు రూ.50వేలు పెట్టి ల్యాప్‌ట్యాప్‌ కొనుగోలు చేస్తున్నారనుకోండి. మొత్తం నగదు ఒకేసారి చెల్లిస్తే.. రూ.5వేలు తగ్గించే ఆఫర్‌ ఉందనుకుందాం. అప్పుడు వాయిదాల పద్ధతి ఎంచుకుంటే.. రూ.5 వేల రాయితీ వర్తించదు. మొత్తం రూ.50వేలకూ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆఫర్లు ఉన్నప్పుడు డబ్బులు చేతిలో ఉంటే నగదుతోనే కొనుగోలు చేయండి. డబ్బు లేకపోతేనే వడ్డీలేని వాయిదాలకు వెళ్లండి.

‘బయ్‌ నవ్‌.. పే లేటర్‌’ యమ డేంజర్‌

బ్యాంకుల ద్వారా వచ్చిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్లు పక్కనబెడితే, కొన్ని ఫైనాన్షియల్‌ కంపెనీలు ‘బయ్‌ నవ్‌.. పే లేటర్‌’ పద్ధతిని అందుబాటులోకి తెచ్చాయి. చేతిలో డబ్బు లేనప్పుడు ఏదైనా కొనుగోలు చేయాల్సి వస్తే.. ఈ ఫైనాన్స్‌ కంపెనీలు మీ బదులు డబ్బులు చెల్లిస్తాయి. ఆ తర్వాత కొంత వ్యవధి ఇచ్చి వడ్డీతో సహా తిరిగి చెల్లించమంటున్నాయి. సమయానికి చెల్లించకపోతే అధిక వడ్డీలు విధిస్తున్నాయి. డబ్బులను తర్వాత కట్టవచ్చులే అని వీటి జోలికి వెళ్లారంటే.. అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లే. ఇలాంటి సంస్థలు క్రెడిట్‌ కార్డులు లేని యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు. వారిని ఆకట్టుకోవడం కోసం విక్రయదారులతో సమానంగా.. ఈ సంస్థలు క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటిస్తుండటం గమనార్హం. వీటి నుంచి అప్రమత్తంగా ఉండండి!

ఆన్‌లైన్‌లో చూసి ఆఫ్‌లైన్‌లో కొనండి

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ఆసక్తి.. అలవాటు లేనివారు కూడా చాలామందే ఉంటారు. వస్తువును ప్రత్యక్షంగా చూసే కొనుగోలు చేయాలనుకుంటారు. అలాంటివారు.. డబ్బులు ఆదా చేయాలంటే కాస్త సమయాన్ని కేటాయించాలి. షాపింగ్‌కు వెళ్లే ముందు ఏయే వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాటి విలువ, ఆఫర్లు వివిధ ఆన్‌లైన్‌ పోర్టళ్లలో ఎలా ఉన్నాయో పరిశీలించండి. ఆ వస్తువు ఎంత తక్కువకు వస్తుందో గమనిస్తే దుకాణాల్లో డీలర్ల వద్ద ధర విషయంలో పక్కాగా బేరమాడవచ్చు.

ఆఫర్ల మతలబు తెలుసుకోవాలి

పండగల సీజన్‌ పేరుతో ఆన్‌లైన్‌ అంగళ్లు.. షాపింగ్‌మాల్స్‌ భారీ రాయితీలు ప్రకటిస్తుంటాయి. కానీ, అవి ఎలా ఇస్తున్నారనే విషయాన్ని గమనించాలి. ఆ రాయితీ పొందాలంటే.. కనీసం రూ.5వేల నుంచి రూ.10వేల విలువ చేసే కొనుగోళ్లు చేయాలనే నిబంధన పెడతారు. పెద్దమొత్తంలో కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్‌ లాభదాయకమే. కానీ తక్కువ మొత్తంలో కొనేవారికి ఇది ఉపయోగకరం కాదు. కొందరు ఈ ఆఫర్‌ పొందడం కోసం అనవసరమైన షాపింగ్‌ చేసి బడ్జెట్‌కు మించి ఖర్చుపెడతారు. కాబట్టి ఎంత ఖర్చుపెట్టగలరో ముందే ఒక అంచనాకు వచ్చి.. మీ బడ్జెట్‌కు తగ్గ ఆఫర్‌ ఉన్నచోటే కొనుగోళ్లు చేయండి.

రివార్డు పాయింట్లు.. క్యాష్‌బ్యాక్‌లు వినియోగించండి

క్రెడిట్‌ కార్డులు, బ్యాంక్‌లు ఇచ్చే షాపింగ్‌ పాయింట్లను కొనుగోళ్లలో ఉపయోగించండి. గతంలో మీరు షాపింగ్‌ చేయడం వల్ల పాయింట్స్‌ వచ్చే ఉంటాయి. సాధారణ సమయాల్లో కంటే పండగల వేళ ఆఫర్లు ఉన్నప్పుడు ఈ పాయింట్స్‌ను ఉపయోగించి కొనుగోలు చేయడం ఉత్తమం. తద్వారా ఎక్కువ ధర ఉండే వస్తువుల ఆఫర్‌ను, షాపింగ్‌ పాయింట్స్‌ను ఉపయోగించుకొని కొంటే తక్కువ ధరకు రావడంతోపాటు డబ్బులు ఆదా అవుతాయి కదా!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని