Golden bats statue : బంగారం ధర పెరిగింది.. ఆ విగ్రహం దశ తిరిగింది!

దక్షిణ కొరియాలో  (South korea) ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న మూరుమూల కౌంటీలో గతంలో ఓ బంగారు గబ్బిలాల విగ్రహం  (Golden Bats statue) నెలకొల్పారు. ఆ చర్యను చాలా మంది విమర్శించారు. ఇప్పుడు బంగారం ధరకు (Gold price) రెక్కలు రావడంతో దాని ధర సుమారు ఐదు రెట్లు పెరిగింది. ఆ కథేంటో తెలుసుకోండి. 

Updated : 11 May 2023 16:26 IST

(Image : Hampyeong.go.kr)

దక్షిణ కొరియాలో  (South korea) ఒకప్పుడు ఎరుపు-పసుపు పచ్చ రంగులో ఉండే ‘హాడ్సన్స్‌’జాతి గబ్బిలాలు (Bats) అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. 1999లో అవి హంపియోంగ్‌ కౌంటీలో వాడుకలో లేని బంగారు గనిలో (Gold mine)కన్పించాయి. ఆ కౌంటీ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో అక్కడ జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అప్పుడే స్థానిక ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే స్వచ్ఛమైన బంగారంతో గబ్బిలాల విగ్రహం ఏర్పాటు చేయడం. తద్వారా పర్యాటకులను ఆ ప్రాంతానికి రప్పించి ఆదాయాన్ని సంపాదించడం.

162 కేజీల బంగారం.. 281 కేజీల వెండి

2005లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంతో ఈ గబ్బిలాల విగ్రహ నిర్మాణం కోసం అధికారులు 21 లక్షల డాలర్లు కేటాయించారు. ఆ డబ్బుతో సుమారు ఏడు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేసేందుకు 162 కేజీల బంగారం, 281 కేజీల వెండిని కొనుగోలు చేశారు. ప్రఖ్యాత దక్షిణకొరియా శిల్పి బైన్‌-కున్‌-హో ఆ విగ్రహ నిర్మాణానికి పూనుకున్నాడు. ఒక వెండి రింగు చుట్టూ ఐదు బంగారు గబ్బిలాలు ఎగురుతున్న రీతిలో విగ్రహాన్ని తయారు చేశాడు. అందుకు సుమారు మూడు సంవత్సరాలు శ్రమించాల్సి వచ్చింది. ఈ శిల్పం ‘విశ్వ సామరస్యం, అమరత్వాన్ని సూచిస్తుంది’ అని దాని గొప్పతనాన్ని బైన్‌ వివరించారు. నిర్మాణం పూర్తయిన తరువాత ఆ శిల్పాన్ని ఒక గుహలాంటి ప్రదర్శనశాలలో ఉంచారు. మిగిలిన బంగారం, వెండితో ఒక కాఫీ టేబుల్ పరిమాణంలో బంగారు గుడ్లను తయారు చేయించారు. కొరియా పౌరాణిక హీరోలను గౌరవిస్తూ ఆ నిర్మాణాన్ని చేపట్టారు.

బంగారం పెట్టుబడిపై విముఖత

విగ్రహాల ఏర్పాటుతో ఆ ప్రాంతానికి పర్యావరణ పరంగా మేలు జరుగుతుందని స్థానిక ప్రభుత్వం విశ్వసించింది. అంతేకాకుండా ఈ నిర్మాణాన్ని చూడటానికి పర్యాటకులు భారీగా వస్తారని భావించింది. అయితే, ఈ కళాత్మక నిర్మాణంపై పెట్టుబడిని చాలా మంది విమర్శించారు. బంగారంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం వృథా అన్నారు. అప్పటికే ఆ కౌంటీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. దాంతో స్థానిక వార్తా పత్రికలు కూడా వ్యతిరేక కథనాలు ప్రచురించాయి.

అనూహ్యంగా పెరిగిన ధర

కొద్ది రోజుల తరువాత క్రమంగా బంగారం ధర పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థిక అనిశ్చితి, కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలతో పుత్తడి ధర ఆకాశాన్నంటింది. దాంతో విగ్రహం విలువ అమాంతం పెరిగిపోయింది. ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగి 1.1 కోట్ల డాలర్లకు చేరింది. బంగారు విగ్రహం కౌంటీలోని ఓ మారుమూల ప్రదేశంలో ఉన్నప్పటికీ  గత కొద్ది వారాల్లోనే సుమారు 15వేల మంది కొరియన్‌ పర్యాటకులు దాన్ని సందర్శించారు. పసిడి ధర పెరిగే కొద్ది విగ్రహాన్ని చూడాలనే ఆసక్తి కూడా చాలా మందిలో పెరుగుతోంది. అందుకే అధిక సంఖ్యలో పర్యాటకులు పోటెత్తుతున్నారని కౌంటీ ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రవేశ టికెట్‌ ధర 1.5 డాలర్లుగా నిర్ణయించారు. దాంతో కౌంటీలో జరగుతున్న ‘బటర్‌ ఫ్లై ఫెస్టివల్‌’ను చూసేందుకు వచ్చేవారంతా విగ్రహాన్ని సందర్శించేందుకు ఉత్సాహం కనబరిచారు.

దోపిడీకి దొంగల యత్నం

అత్యంత విలువైన విగ్రహం ఇక్కడుందనే విషయం అందరికీ తెలియడంతో దానిపై దొంగల కన్నుపడింది. 2019లో దాన్ని దొంగిలించేందుకు శతవిధాల ప్రయత్నించి ముగ్గురు దొరికిపోయారు. అలారం మోగడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. ఆ ఘటన తరువాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు మోషన్‌ సెన్సార్లను, హై రిజల్యూషన్‌ సెక్యురిటీ కెమెరాలను అమర్చారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ గాజు, స్టీల్‌ షెట్టర్‌తో విగ్రహానికి రక్షణ ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ విగ్రహాన్ని ఎకోలాజికల్ ఎగ్జిబిషన్‌ హాల్‌ నుంచి కౌంటీలోని హంపియోంగ్‌ ఎగ్జిబిషన్‌ పార్క్‌కు మారుస్తున్నట్లు కౌంటీ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి బంగారం ధర గరిష్ఠంగా పెరిగింది. అయినప్పటికీ విగ్రహాన్ని విక్రయించే ఆలోచన తమకు లేదని చెప్పారు. తాము లాభం కోసం ఈ విగ్రహాన్ని నెలకొల్పలేదని స్పష్టం చేశారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని