కరోనా కాలంలోనూ.. కొలువులున్నాయ్‌! 

ఎన్నో కలలు కన్న యువతరానికి అనుకోని కుదుపు. కరోనా రాకతో ఉద్యోగాలు కోల్పోయి కొందరు, ఉద్యోగాన్వేషణలో వెనకబడి మరికొందరు, అంకుర ఆరంభానికి ఎదురుచూస్తున్న వారు ఇంకొందరు. ఏం చేయాలో తోచని స్థితి. ముందుకెళావెళ్లాలో అర్థం కాని పరిస్థితి. కానీ కరోనా కాలంలోనూ కొన్ని రంగాలు దూసుకుపోతున్నాయ్‌. రానున్న రోజుల్లో వీటిలో అంకుర, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అపారం.

Published : 16 Oct 2020 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో కలలు కన్న యువతరానికి అనుకోని కుదుపు. కరోనా రాకతో ఉద్యోగాలు కోల్పోయి కొందరు, ఉద్యోగాన్వేషణలో వెనకబడి మరికొందరు, అంకుర ఆరంభానికి ఎదురుచూస్తున్న వారు ఇంకొందరు. ఏం చేయాలో తోచని స్థితి. ముందుకెళా వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఈ సమయంలోనూ కొన్ని రంగాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. వాటిల్లో రానున్న రోజుల్లో అంకుర, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అపారం.

సవాళ్లు.. అవకాశాలు
కరోనా నానాటికీ విజృంభిస్తుండటం, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యయిక పరిస్థితి నడుస్తుండటంతో ప్రస్తుతం హెల్త్‌, వెల్‌నెస్‌ రంగంలో సవాళ్లతో పాటు అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. గత కొంతకాలంగా ఆరోగ్య అంకురాలు ఊపందుకున్నాయి. హోం క్వారెంటైన్‌లో ఉన్న వారికి ఆన్‌లైన్‌లోనే కన్సల్టేషన్‌, వైద్యం, వైద్య పరీక్షలు, ఔషధ పంపిణీ తదితర ఆరోగ్య సేవలు, సలహాలు అందిస్తున్నారు. ఇక రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, వెంటిలేటర్‌, పీపీఈ కిట్లు, క్రిమిసంహారక సొరంగాలు, 5 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితం తెలిపే ఈయూఏ(ఎమర్జెన్సీ యూస్‌ ఆథరైజేషన్‌ ), ఐసోలేషన్‌ వార్డుల్లో వైరస్‌ బారిన పడినవారికి కావాల్సిన ఆహారం, మందులను అందించేందుకు రోబోలు, వైరస్‌ను మట్టుబెట్టే యూవీడీ రోబోలు.. వంటి అనేక అంకుర సంస్థలు విజయవంతమయ్యాయి. కరోనా పోరులో సహాయంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వాలూ ఈ రంగంలో ఉద్యోగాలు, అంకుర సంస్థల ప్రారంభానికి అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. 

అంతా ఈ-లెర్నింగ్‌

ఇప్పడు ప్రపంచమంతా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అన్ని రంగాలూ ఆన్‌లైన్‌ బాట పట్టాయి. వాటిల్లో ముఖ్యమైనది విద్య. పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ పాఠాలను అందిపుచ్చుకున్నాయి. కేవలం ఇవి మాత్రమే కాదు. ఒకేషనల్‌ కోర్సులు, రీస్కిల్లింగ్‌ ప్రోగ్రాంలు... ఇలా అనేకానేక కోర్సులు, పోటీ పరీక్షల శిక్షణకూ ఇప్పుడు ఆన్‌లైన్‌ సేవలే ఆధారంగా మారాయి. వీటి ద్వారా సింపుల్‌గా, స్మార్ట్‌గా నచ్చిన సమయంలో మెచ్చిన కోర్సులు అభ్యసించొచ్చు. కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. బైజుస్, అన్‌అకాడమీ, టాపర్‌‌, వేదాంత వంటి ఈ-లెర్నింగ్‌ సంస్థలకు లాక్‌డౌన్‌ కాలంలో వినియోగదారులు మూడురెట్లు పెరిగారు. వీటిలోనూ ఉద్యోగావకాశాలున్నాయి. రానున్న రోజుల్లోనూ ఆన్‌లైన్‌ విద్యలో ఉద్యోగ, అంకుర అవకాశాలు అనేకం ఉండనున్నాయి. 

ఇంటి వద్దకే..
కరోనా ఉధృతితో సామాజిక దూరానికి అలవాటుపడ్డాం. సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌, కిరాణా దుకాణాలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నాం. అందుకే ఇప్పడు ఈ-కామర్స్‌, డెలివరీ ఆధారిత రంగాలు, ఆన్‌లైన్‌ కిరాణా స్టార్టప్‌లు పెద్ద ఎత్తున ఊపందుకున్నాయ్‌. అనేక ఈ కామర్స్‌ సంస్థలు కరోనా నిబంధనలను పాటిస్తున్నామని హామీ ఇస్తుండటంతో ప్రజలు వీటిపై మక్కువ చూపుతున్నారు. నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు, దుస్తులు.. తదితర వస్తువులన్నింటికీ ఇప్పుడు ఆన్‌లైనే వేదిక. గత కొంతకాలంగా సాంకేతికాభివృద్ధి మూలంగా ఈ పరిశ్రమ వృద్ధిలో ఉన్నప్పటికీ కొవిడ్‌ రాకతో ఇది తార స్థాయికి చేరింది. ఈ-కామర్స్‌, డెలివరీ ఆధారిత రంగాలు గ్రామీణ ప్రాంతాలకూ చేరువయ్యాయి. కరోనాతో నిరుద్యోగిత పెరుగుతున్న కాలమిది! ఈ సమయంలోనూ ఇటీవల అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలు భారత్‌లో ఉద్యోగ ప్రకటనలిచ్చాయి.

ఆరోగ్య ఔషదాలు
   కరోనా రాకతో మరింత ఊపందుకున్న మరో రంగం ఫార్మా. ఇప్పటికే దేశంలో ప్రజలకు కావాల్సిన ఔషదాలు, సౌకర్యాలకు సరిపడేలా వివిధ ఫార్మా సంస్థలు పాటుపడుతున్నాయి. ఇక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ఫార్మా రంగం మరింత మెరుగవ్వచ్చు. దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా అందేలా కృషి చేయడం ఫార్మా రంగం ముందున్న పని. ప్రస్తుత ఫార్మా రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకొన్నాయి. ఈ-ఫార్మసీ స్టార్టప్‌లు వేగవంతమయ్యాయి.  అనేక నూతన ఆన్‌లైన్‌ ఫార్మసీ అంకురాలు ప్రారంభమయ్యాయి. మెడ్‌లైఫ్‌, 1ఎంజీ వంటి ఆన్‌లైన్‌ ఫార్మసీల నుంచి ప్రజలు వారికి కావాల్సిన ఔషధాలను ఆర్డర్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ రంగంలో అనేక అంకుర, ఉద్యోగావకాశాలు రానున్నాయి. 

ఉద్యోగానికి నైపుణ్యం
ఇక ముందు ఉద్యోగాల తీరూ మారనుంది. సాంకేతికత మరింత చేరువవడంతో కొత్త ఉద్యోగాలు అనేకం ఉండనున్నాయి.. డేటా ఎనలిస్ట్‌, ఏఐ ఇంజినీర్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌, డిజైన్‌ థింకింగ్‌, మొబైల్ డెవలపర్‌, కంటెంట్‌ క్రియేషన్‌, బిజినెస్‌ అనలిస్ట్‌ వంటి వాటికి కావల్సిన  నైపుణ్యాలను పెంచుకుంటే అంకుర, ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని