శకుంతలాదేవి.. ది హ్యూమన్‌ కంప్యూటర్‌!

మూడేళ్ల ప్రాయం. అంకెలు నేర్వాల్సిన సమయం. కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కల ట్రిక్‌తో తండ్రినే ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆరేళ్లు నిండని వయసు... విద్యాభ్యాసం కూడా ఎరుగని ఆ చిన్నారి.. ఏకంగా యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది!! 50 ఏళ్ల........

Published : 23 Jul 2020 11:36 IST

మూడేళ్ల ప్రాయం. అంకెలు నేర్వాల్సిన సమయం. కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కల ట్రిక్‌తో తండ్రినే ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆరేళ్లు నిండని వయసు... విద్యాభ్యాసం కూడా ఎరుగని ఆ చిన్నారి.. ఏకంగా యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది!! 50 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ కంటే ముందుగా అంకెలు గణించి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడమే కాక.. గిన్నిస్‌బుక్‌లోనూ చోటు సంపాదించారామె. ప్రముఖ గణిత మేధావి, హ్యూమన్‌ కంప్యూటర్‌గా సుపరిచితురాలైన శకుంతలాదేవి గురించే ఈ ఉపోద్ఘాతమంతా. గణితంలోనే కాదు.. ఆమెకు జ్యోతిషంలోనూ పట్టుంది. రచయిత కూడా. పేరుకే హ్యూమన్‌ కంప్యూటర్‌ అయినా.. ఆమె సైతం సాధారణ మనిషి ఎదుర్కొన్న కష్టాలను అనుభవించారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అందుకే ఆమె జీవితం కథా వస్తువైంది. త్వరలో ‘శకుంతలాదేవి’గా ముందుకు రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ శకుంతలాదేవి పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జులై నెలాఖరులో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

చదువుకోకపోయినా.. లెక్కల్లో మేటి

బెంగళూరులో 1929 నవంబర్‌ 4న సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శకుంతలాదేవి. ఆచారాలు, కట్టుబాట్లను పక్కన పెట్టి ఆమె తండ్రి సర్కస్‌లో పనిచేసేవారు. చిన్నతనంలో పేదరికంలో పెరిగిన శకుంతలాదేవికి గణితమంటే మక్కువ. ఆ విషయాన్ని మూడేళ్ల ప్రాయంలోనే గుర్తించారు ఆమె తండ్రి. ఓ రోజు పేక ముక్కలతో ట్రిక్‌లో తండ్రినే ఓడించడంతో ఆమె ప్రతిభ బయటపడింది. అంకెలను గుర్తు పెట్టుకోవడంలో ఆమెకున్న ప్రతిభను గుర్తించిన తండ్రి.. సర్కస్‌ మానేసి ఆమె చేత గణిత ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఆ నోటా.. ఈ నోటా శకుంతాలా దేవి పేరు మార్మోగింది. ఏకంగా ఆరేళ్ల వయసులోనే యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఆమె ఎదిగింది.

కంప్యూటర్‌తో పోటీ..

14 ఏళ్ల వయసులోనే తండ్రితో కలిసి గణిత ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆమె లండన్‌ చేరుకున్నారు. అప్పటి నుంచి విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. అలా యూరప్‌, అమెరికా వంటి దేశాలను చుట్టొచ్చారు. సంప్రదాయ విద్యానభ్యసించకుండానే ఆమె ఇలా ప్రదర్శనలు ఇవ్వడం ఆమెకే చెల్లింది. ఈ క్రమంలో 1977లో టెక్సాస్‌ సదరన్‌ మెథడిస్ట్‌ యూనివర్సిటీలో ఒక ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. 201 అంకెలు కలిగిన ఒక సంఖ్యకు 23వ వర్గమూలాన్ని చకచకా చెప్పేశారు. కేవలం 50 సెకన్లలో గణించి ఆహూతుల్ని ఆశ్చర్యపోయేలా చేశారు. ఇది చేసేందుకు కంప్యూటర్‌కు 60 సెకన్లు తీసుకోవడం గమనార్హం. 1980లో జూన్‌ 18న లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో ఇచ్చిన ప్రదర్శన.. శకుంతలాదేవి జీవితంలో మైలురాయి. ప్రపంచానికి హ్యూమన్‌ కంప్యూటర్‌గా పరిచయమైంది ఆ రోజే. ఆ ప్రదర్శనలో అప్పటికప్పుడు కంప్యూటర్‌ ఇచ్చిన రెండు 13 అంకెలు కలిగిన సంఖ్యలను గుణించి కేవలం 28 సెకన్లలో సమాధానమిచ్చారు శకుంతలాదేవి. దీంతో ఆమె పేరు గిన్నిస్‌బుక్‌లో స్థానం సాధించింది. ఈ రికార్డు ఇప్పటికీ పదిలమే. కేవలం అంకెలు గణించడమే కాదు.. గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పగలరంటే ఆమె మేధస్సును అర్థం చేసుకోవచ్చు. 

వైవాహికం.. ఓ పుస్తకం

1960లో కోల్‌కతాకు చెందిన పరితోష్‌ బెనర్జీ అనే ఐఏఎస్‌ అధికారిని శకుంతలా దేవి వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే ఆయన హోమో సెక్సువల్‌ అని తెలిసింది. కొద్దికాలానికే వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. ఈ దంపతులకు కుమార్తె కూడా ఉన్నారు. హోమో సెక్సువల్‌ అయిన భర్తను దగ్గర నుంచి చూసిన ఆమె.. ఆ తర్వాతి కాలంలో ‘ద వరల్డ్‌ ఆఫ్‌ హోమో సెక్సువల్స్‌’ పేరిట 1977లో ఓ పుస్తకం రాశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని అప్పట్లోనే తన పుస్తకం ద్వారా చెప్పాలనుకున్నారు. 2018లో సుప్రీంకోర్టు సైతం స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు వెలువరించడం గమనార్హం. ఇదే కాదు.. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు.

ఇందిరపై పోటీ

అత్యయిక స్థితి విధించడంపై ఆగ్రహించిన శకుంతలా దేవి.. ఏకంగా ఇందిరాగాంధీపైనే పోటీకి దిగారు. అదీ మెదక్‌ నుంచి కావడం గమనార్హం. 1980లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీతో పాటు మెదక్‌ నుంచీ ఇందిరా గాంధీ పోటీచేశారు. మెదక్‌ ప్రజలను మోసగించేందుకు గాంధీ కుటుంబం ప్రయత్నిస్తోందంటూ ఆమెపై శకుంతలాదేవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మందిలో శకుంతలాదేవి 9వ స్థానంలో నిలిచారు. అవే ఎన్నికల్లో బొంబాయి సౌత్‌ నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013లో ఏప్రిల్‌లో బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

వెండితెరపైకి..

ఆమె మరణించిన ఏడేళ్ల తర్వాత వెండితెరపై ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా వస్తోంది. ‘శకుంతలా దేవి’ పేరుతో అను మేనన్‌ దీన్ని తెరకెక్కించారు. ఇటీవలే చిత్రం ట్రైలర్‌ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్‌లో బాల్యం నుంచి ఆమె ఎదిగిన క్రమాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో సరదాగా సాగిపోయే సన్నివేశాలు, గణిత ప్రదర్శనలు, తల్లీకూతుళ్ల మధ్య సాగే సన్నివేశాలు ఇందులో కనిపించాయి. శకుంతలాదేవి కుమార్తె పాత్రలో బాలీవుడ్‌ నాయిక సన్యా మల్హోత్ర కనిపించనున్నారు. వీరి మధ్య భావోద్వేగ సన్నివేశాలు ట్రైలర్‌లో ప్రధానంగా చూపించారు. దీనిబట్టి సాధారణ జనానికి తెలీని ఇంకో కోణాన్ని కూడా ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. శకుంతలాదేవి కుమార్తె అనుపమ బెనర్జీ కూడా ఈ చిత్రం స్క్రిప్ట్‌కు తోడ్పాటు అందించారు. ఆమె జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరించారనేది చూడాలి మరి!!

-ఇంటర్నెట్‌డెస్క్‌

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని