శత్రువుల ముందు తల నరుక్కునేవారు!

యుద్ధంలో శత్రువులపై విజయం సాధించాలంటే సాయుధబలంతో పాటు బుద్ధిబలం కూడా కావాలి. శత్రువుల బలహీనతలు తెలుసుకోవడమో.. శత్రువులకంటే మేం బలవంతులమని చూపించడమో చేస్తే శత్రువులు భయపడి కాస్త వెనక్కి తగ్గే ఆస్కారం ఉంటుంది. శత్రుసైన్యం

Updated : 03 Oct 2020 00:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యుద్ధంలో శత్రువులపై విజయం సాధించాలంటే సాయుధబలంతో పాటు బుద్ధిబలం కూడా కావాలి. శత్రువుల బలహీనతలు తెలుసుకోవడమో.. శత్రువులకంటే మేం బలవంతులమని చూపించడమో చేస్తే శత్రువులు భయపడి కాస్త వెనక్కి తగ్గే ఆస్కారం ఉంటుంది. శత్రుసైన్యం మానసిక స్థితి బలహీనపడిన సమయంలో వారిపై విరుచుకుపడి యుద్ధం గెలవొచ్చు. ఇలా యుద్ధం జరిగే సమయంలో సైన్యాలు అనేక యుద్ధతంత్రాలను ప్రయోగిస్తుంటాయి. చైనాలో ఒకప్పుడు ఉన్న యూ అనే రాజ్యంలో కూడా సైనికులు శత్రువులను భయపెట్టడం కోసం తమ తలలను నరుక్కునేవారట. ఆశ్చర్యంగా ఉంది కదా..! అసలు ఆ యుద్ధతంత్రం ఏంటో మీరే చదవండి. 

చైనాలో క్రీస్తుపూర్వం 496-465 మధ్య యూ రాజ్యాన్ని గౌజియన్‌ అనే చక్రవర్తి పాలించాడు. పొరుగు రాజ్యం వూతో సహా అనేక రాజ్యాలతో గౌజియన్‌ యుద్ధం చేశాడు. అయితే, అతడి సైనికులు ఆత్మహత్యలు చేసుకొని శత్రుసైనికులను భయపెట్టడంలో దిట్టగా పేరొందారు. యుద్ధం ప్రారంభ సమయంలో ముందు వరసలో ఉండే సైనికులు శత్రు సైన్యం చూస్తుండగానే తమ ఖడ్గాలతో తల నరుక్కునే వారట. రాజ్యం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయమనే సందేశం శత్రువులకు ఇవ్వడం కోసం ఇలా చేసేవారట. రాజ్యం కోసం కళ్ల ముందే ప్రాణాలు తీసుకుంటున్న వారిని చూసి భయపడి అనేక రాజ్యాలు యుద్ధం చేయడానికి వెనకడుగు వేసేవట. నిజానికి ప్రాణత్యాగం చేసేవారంతా సైనికులు కాదు. రాజ్యంలో నేరాలు చేసి ఉరిశిక్ష పడ్డ దోషులు. వారికి ఉరిశిక్ష విధించడానికి బదులు ఇలా సైనికుల దుస్తుల్లో శత్రువుల ముందు నిలబెట్టి ఆత్మహత్యకు పాల్పడేలా చేసేవారట. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. దోషులకు శిక్ష పడటంతోపాటు శత్రువులు భయపడేలా చేశాడు చక్రవర్తి గౌజియన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని