సూపర్‌ కార్స్: అప్పుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే?

లగ్జరీ స్పోర్ట్స్‌ కార్లను తయారు చేసే ఆస్టన్‌ మార్టిన్‌ యూకేకు చెందిన సంస్థ. ఆస్టిన్‌ మార్టిన్‌ తొలి సూపర్‌ కారు DB4 మోడల్‌. 1958 నుంచి 1963 వరకు ఈ మోడల్‌ను...

Updated : 26 Oct 2020 15:15 IST

కాలం మారుతున్న కొద్దీ కొత్త మోడల్‌ కార్లు వస్తూనే ఉంటాయి. కానీ పాత కార్లలో కనిపించే ఆ దర్పం మాటల్లో వర్ణించలేనిది. అంతరించిపోతున్న పాత మోడల్‌ కార్ల‌ను వాహన ప్రియులు సేకరిస్తూనే ఉంటారు. వాటిని అపురూపంగా చూసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. అలాంటి కార్ల తొలి మోడల్‌, తాజా మోడల్‌ గురించి తెలుసుకుందామా! 


యూకేకు చెందిన ఆస్టిన్‌ మార్టిన్‌

లగ్జరీ స్పోర్ట్స్‌ కార్లను తయారు చేసే ఆస్టన్‌ మార్టిన్‌ యూకేకు చెందిన సంస్థ. ఆస్టిన్‌ మార్టిన్‌ తొలి సూపర్‌ కారు DB4 మోడల్‌. 1958 నుంచి 1963 వరకు ఈ మోడల్‌ను సంస్థ విక్రయించింది. ఈ కారు 3.7 లీటర్‌ ఇంజిన్‌ సామర్థ్యంతో తక్కువ బరువుతో ఉండేది. ఆస్టిన్‌ మార్టిన్‌ తన లేటెస్ట్‌ వెర్షన్‌ కారును వచ్చే ఏడాది జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. Aston Martin DBS Super leggera పేరుతో శక్తివంతమైన కారును తయారు చేయబోతుంది. 5.2 లీటర్ల ఇంజిన్‌ సామర్థ్యం, ట్విన్‌ టర్బో v12, 715 bhpతో ఈ కారు రాబోతోంది. కేవలం 3.4 సెకన్లలో 62 mph దూసుకెళ్తుంది. ఈ కారు అత్యుత్తమ వేగం 211 mph.


నాలుగు సిలిండర్లతో తొలి కారు

బెంట్లీ తయారు చేసిన తొలి కారు 1919లో ఆవిష్కరించింది. ఈ కారు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బాగా అనువుగా ఉండేదట. 1924 నుంచి 1930 వరకు జరిగిన రేసుల్లో ఈ కారు ఎన్నో విజయాలను సాధించింది. ఈ సంస్థ నుంచి 2003లో వచ్చిన కాంటినెంటల్‌ GT కారు 6.0 లీటర్‌ ట్విన్‌ టర్బో W12, ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన 4.0 లీటర్‌ సామర్థ్యం కలిగిన V8 ఇంజిన్‌ అద్భుతమైన పనితీరు కనబరిచాయి. వీటిలో W12 మోడల్‌  శక్తివంతమైనదని నిపుణులు అంటుంటారు. బెంట్లీ కార్ల చరిత్రలోనే 2017లో వచ్చిన కాంటినెంటల్‌ సూపర్‌ స్పోర్ట్స్‌ కారు అత్యుత్తమ మోడల్‌గా నిలిచింది. బెట్లీ సంస్థ ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌లోకి వెళ్లిపోయింది. 


బుగట్టీ నుంచి... 

1924లో టైప్‌ 35 సూపర్‌ కారును బుగట్టీ సంస్థ విడుదల చేసింది. ఈ మోడల్‌ రాకతో అప్పటి డ్రైవర్లకు సూపర్‌ కారు నడిపిన అనుభూతి కలిగింది. రేసింగ్‌ కారు మాదిరిగా ఉండటంతో బాగా ప్రాచుర్యం పొందింది. ఫ్రాన్స్‌కు చెందిన బుగట్టీ ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌లో భాగమైపోయింది. అసలైన కంపెనీకి ఇప్పుడు ఉన్న సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. ఫోక్స్‌వ్యాగన్‌లో భాగమైన తర్వాత 2005లో వచ్చిన  కొత్త బుగట్టీ మోడల్‌ వేరాన్‌. 8.0 లీటర్‌ సామర్థ్యంతో పని చేస్తుంది. తర్వాతి అడ్వాన్స్‌డ్ మోడల్‌ ‘ది చిరాన్‌’ 2016లో విపణిలోకి వచ్చింది. 


‘సూపర్’‌ బర్డ్‌ 

సూపర్‌ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు నాస్కార్‌ 1969-70 రేసుల్లో డాడ్జ్‌ సంస్థ పాల్గొంది. అన్ని పరీక్షల్లో గట్టెక్కడంతో 1971లో డేటోనాను రేసింగ్‌ కారుగా ప్రకటించారు. ఈ కారు నాస్కార్‌లో పాల్గొనడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీంతో తాము కేవలం వేలాది మంది వినియోగదారుల నమ్మకం కోసమే నాస్కార్‌లో పాల్గొన్నట్లు అమెరికాకు చెందిన డాడ్జ్‌ సంస్థ స్పష్టం చేసింది. రీసెంట్‌గా డాడ్జ్‌ ఛాలెంజర్‌ SRT డిమెన్‌ సూపర్‌ కార్‌ను 2018లో సంస్థ తీసుకొచ్చింది. 6.2 లీటర్‌ సూపర్‌ ఛార్జ్‌డ్‌ V8తో 800bhp సామర్థ్యంతో నడుస్తుంది. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 60 ఎంపీహెచ్‌ వేగంతో దూసుకెళ్తుంది. 


పేరులోనే వైబ్రేషన్‌..

ఎవరినైనా సూపర్‌ రేసింగ్‌ కారు అంటే ఏది అని చెప్పమంటే.. ఇటలీకి చెందిన ఫెరారీ అని ఠక్కున చెప్పేస్తారు. ఫెరారీ సంస్థ మొదటి కారు 125S కాకపోయినా.. ఫెరారీ బ్యాడ్జ్‌తో విడుదలైన మొట్టమొదటి కారు అదే. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదిలో ఫెరారీ దీనిని తయారు చేసింది. 1.5లీటర్‌ సామర్థ్యంతో రూపొందింది. అదే ఏడాది 159s మోడల్‌ను తీసుకొచ్చింది. 2017లో ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్‌ మోడల్‌ 6.5 లీటర్స్‌ సామర్థ్యంతో వచ్చింది. 2019లో వచ్చిన ఫెరారీ 812 GTS వారియంట్‌ ఓపెన్‌ టాప్‌ ఫ్రంట్‌ v12 ఇంజిన్‌తో తయారైంది. 


అరవై ఏళ్ల తర్వాత...

అమెరికాకు చెందిన ఫోర్డ్‌ ప్రారంభమైన అరవై ఏళ్ల తర్వాత తన తొలి సూపర్‌ కారును రూపొందించడం విశేషం. స్పోర్టింగ్ రేస్‌లో ఫెరారీను బీట్‌ చేసేందుకు GT40 సూపర్‌ కారును సంస్థ తయారు చేసింది. 7.0 లీటర్‌ సామర్థ్యంతో V8 ఇంజిన్‌తో తీసుకొచ్చిన GT40 సూపర్‌ కారు సూపర్‌ సక్సెస్‌ అయిందనే చెప్పొచ్చు. 1966-67 సంవత్సరాల్లో లీ మాన్స్‌ రేస్‌ను ఈ సూపర్‌ కారు గెలుపొందింది. అలాగే v8 ఇంజిన్‌ 4.9 లీటర్‌ వెర్షన్‌తో వచ్చిన మోడల్‌ కూడా 1968, 1969 సంవత్సరాల్లో జరిగిన రేసుల్లోనూ విజేతగా నిలిచింది. 2017లో FORD GT మోడల్‌లో 3.5 లీటర్‌ ట్విన్‌ టర్బో ఎకో బూస్ట్‌ V6 ఇంజిన్‌తో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. 


సంస్థ స్థాపించిన మూడేళ్లకే.. 

లంబోర్గిని కంపెనీ ఖరీదైన లగ్జరీ కార్లకు మారుపేరు అనే చెప్పవచ్చు. ఇటలీకి చెందిన ఈ సంస్థ స్థాపించిన కేవలం మూడేళ్లకే సూపర్‌ కారును తయారు చేయడం విశేషం. దీని మాతృసంస్థ ‘ఆడి’. 1966లో తన తొలి సూపర్‌ కారును రూపొందించింది. 3.9 లీటర్‌ V12 ఇంజిన్‌ సామర్థ్యంతో కారును తయారు చేసింది. ఈ మధ్య కాలంలో లంబోర్గిని నుంచి వచ్చిన ‘సియాన్‌’ మోడల్‌ అత్యంత వేగవంతమైన కారు. తమ సంస్థ వ్యవస్థాపక సంవత్సరం 1963కి గుర్తుగా కేవలం 63 సూపర్‌ కార్లను ఉత్పత్తి చేసింది. ఒక్కో సూపర్‌ కారు ధర 3.6 మిలియన్‌ డాలర్లు. 6.5 లీటర్‌ V12 ఇంజిన్‌తో తయారు చేసిన సూపర్‌ కారు అత్యధిక వేగం 217 ఎంపీహెచ్‌. 


అప్పట్లో వేగవంతమైన కారు..

1940-50లలో స్పోర్ట్స్‌, టూరింగ్‌ కార్లను ఇటలీకి చెందిన మసెరాటి సంస్థ తయారు చేసింది. తొలుత 1952లో రేసింగ్‌ సందర్భంగా ఓపెన్ టాప్‌ మసెరాటి A6 కార్ల వల్ల వినియోగదారులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో తమకు పటిష్ఠమైన రూఫ్‌ కలిగిన కొత్త వెర్షన్‌తో కారును తయారు చేయాలని సంస్థకు విజ్ఞప్తులు పంపారు. అలా మసెరాటి A6GCS బెర్లినెట్టా సూపర్‌ కారు బయటకు వచ్చింది. ఎంతో అందంగా ఉండటమే కాకుండా అప్పట్లో వేగవంతమైన స్పోర్ట్స్‌ కారుగా గుర్తింపు తెచ్చుకుంది. మసెరాటి MC20 మోడల్‌ అత్యాధునికమైన ఫీచర్స్‌తో ఇటీవల మార్కెట్లోకి వచ్చింది. 210 HP/LT, 630 HP 7500RPM, 3.0 లీటర్‌ ట్విన్‌ టర్బో v6 ఇంజిన్‌తో రెండు వెర్షన్లలో అందుబాటులో ఉండనుంది. రేస్‌లతోపాటు సాధారణ ప్రయాణానికి సంబంధించిన మోడళ్లు వినియోగదారుల కోసం తీసుకురానుంది. మసెరాటి రేసర్‌ సర్‌ స్టిర్లింగ్‌ మాస్‌ (90) గౌరవార్థం MC20 మోడల్‌ను సంస్థ అంకింతం చేసింది. 


బెంజ్‌..  పలకడంలోనే ఉత్సాహం

ప్రపంచంలోనే మొదటి సూపర్‌ కారు మెర్సిడెస్‌ బెంజ్‌ సంస్థే తీసుకొచ్చిందనే వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఇది చూడటానికి ట్రాక్టర్‌ మాదిరిగా ఉంటుంది. కేవలం 35 HP సామర్థ్యంతో తయారు చేయడం విశేషం. గుర్రాలతో పనిలేకుండా ఇంజిన్‌ను ఏర్పాటు చేసిన బండిని 1900 చివర్లో మెర్సిడెస్‌ రూపొందించింది. 1901లో స్పోర్ట్స్‌ సీజన్‌లో ఈ బండి విజయవంతం కావడంతో అప్పటి నుంచి సూపర్‌ కార్లను అభివృద్ధి చేయడంలో మెర్సిడెస్‌ బెంజ్‌ వెనుకడుగు వేయలేదు. 2014లో 4.0 లీటర్‌ ట్విన్‌ టర్బో V8 ఇంజిన్‌తో Mercedes-AMG GT వచ్చింది. దీని టాప్‌ స్పీడ్ 201 MPH. జర్మనీకి చెందిన మెర్సిడెస్‌ బెంజ్‌ వాహనాలకు ఆటోమొబైల్‌ మార్కెట్లో భలే డిమాండ్‌ ఉంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని