Sushi Terrorism: సుషీ రెస్టారంట్లలో.. జపాన్‌ యువత వికృత చేష్టలు..!

జపాన్‌లో (Japan) సుషీ రెస్టారంట్లలో (Sushi Restaurant)  ప్రాంకులకు పాల్పడుతోన్న ముగ్గురిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వికృత చేష్టలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ చర్యలకు పోలీసులు ఉపక్రమించారు.

Updated : 10 Mar 2023 14:14 IST

టోక్యో: ఇంటర్నెట్‌ యుగంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. అంతేస్థాయిలో వాటి దుర్వినియోగం కూడా జరుగుతోంది. ప్రాంకుల (Prank) పేరుతో కొందరు చేసే వికృత చేష్టలు తోటివారితోపాటు చూసేవారికి విసుగు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో జపాన్‌లో (Japan) సోషల్‌ మీడియా ట్రెండ్‌పై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కన్వేయర్‌ బెల్ట్‌ సహాయంతో ఆహారం అందించే సుషీ రెస్టారంట్లలో (Sushi Restaurant) ఆహార పదార్థాలను ముట్టుకోవడం, ఎంగిలి చేయడం వంటి చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అటువంటి చర్యలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఏమిటీ సుషీ వంటకం..?

జపాన్‌లో అత్యంత రుచికరమైన వంటకాల్లో సుషీ ఒకటి. సుషీ అంటే పులియబెట్టిన అన్నంతో నిల్వ చేసిన చేప వంటకం. వెనిగర్‌ కలిపిన అన్నంతో చేసే వంటకం ఎన్నో దశాబ్దాలుగా జపాన్‌లో ప్రాచుర్యంలో ఉంది. తొలిరోజుల్లో చేపల్ని నిల్వ చేసుకోవడానికి పులియబెట్టిన అన్నాన్ని ఎక్కువగా వాడేవారు. చేప ముక్కల్ని మాత్రం తీసుకుని ఆ అన్నాన్ని పారేసేవారు. తర్వాతి కాలంలో పులియబెట్టిన అన్నం, చేపలూ రెండూ తినడం మొదలుపెట్టారు. వెనిగర్‌ కలిపిన అన్నం, చేప, రొయ్యలని చుట్టి చేసే ఈ జపాన్‌ సంప్రదాయక వంటకాన్ని కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలతో తయారు చేస్తున్నారు. జపాన్‌లోనే కాకుండా ప్రపంచమంతటా సుషీ వంటకం కొత్త రుచుల్లో లభ్యమవుతోంది.

వికృత చేష్టలు..

అయితే, సుషీ రెస్టారంట్లలో  (Sushi Restaurant) ఇటీవల కొందరు యువతీ, యువకులు వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూశాయి. సోయా సాస్‌లలో ఉమ్మి వేయడం, ఇతర కస్టమర్ల కోసం బెల్టు మీద వెళ్లే ఆహారాన్ని తినడం, ఎంగిలి చేతులతో వాటిని ముట్టుకోవడం, ఇతరుల పాత్రలను వీళ్లు తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి అల్లరి పనులకు (Prank) సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్‌గా (Viral Videos) మారాయి. వీటిని చూసిన కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుషీ రెస్టారంట్లలో ఇంత దారుణం జరుగుతుందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో ఇతరుల ఆహారాన్ని అపరిశుభ్రం చేయడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని ‘సుషీ టెర్రర్‌’గా పేర్కొంటూ ఆన్‌లైన్‌ ఉద్యమం చేపట్టారు.

ముగ్గురు అరెస్ట్‌..

ప్రముఖమైన రెస్టారంట్లలో ఈ సుషీ టెర్రర్‌కు పాల్పడిన ప్రాంకులు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కస్టమర్లు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీని కారణంగా ఏకంగా ఓ ప్రముఖ సంస్థ షేర్లు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతోన్న ముగ్గురు యువతీ, యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సుషీ వ్యవహారంలో అరెస్టు చోటుచేసుకోవడం జపాన్‌లో ఇదే మొదటిసారి. మరోవైపు ఈ తరహా చేష్టలపై జపాన్‌ రెస్టారంట్ల యాజమాన్యాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు సుషీ విధానంపైనే తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతాయని.. తాజా అరెస్టులు యువతలో మార్పు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని