పెద్ద టాటూలతో జాగ్రత్త..!

ఒకప్పుడు ప్రియమైన వ్యక్తుల పేర్లను చేతిపై పచ్చబొట్టు వేయించుకునేవారు. ఇప్పుడు అదే.. టాటూ కల్చర్‌గా మారి అంతటా విస్తరిస్తోంది. ప్రజలు

Updated : 03 Oct 2020 10:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు ప్రియమైన వ్యక్తుల పేర్లను చేతిపై పచ్చబొట్టు వేయించుకునేవారు. ఇప్పుడు అదే.. టాటూ కల్చర్‌గా మారి అంతటా విస్తరిస్తోంది. ప్రజలు తమకు నచ్చిన వాక్యాలు, చిత్రాలు, విభిన్న కళాకృతులను టాటూలుగా వేసుకుంటున్నారు. అయితే, ఈ టాటూల వల్ల స్వేద గ్రంథులు దెబ్బతింటాయని, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

డల్లాస్‌లోని సౌథర్న్‌ మెథడిస్ట్‌ కాలేజ్‌కి చెందిన స్కాట్‌ డేవిస్‌ అనే శాస్త్రవేత్త సారథ్యంలోని బృందం టాటూల వల్ల కలిగే అనర్థాలపై విశ్లేషించింది. చెమట పట్టడమనేది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. శరీరంలో ఉష్ణోగ్రతను స్వేద గ్రంథులు నియంత్రిస్తాయి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు స్వేదగ్రంథులు చెమటను విడుదల చేసి బయటకు పంపుతుంటాయి. తద్వారా ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. అయితే టాటూలు వేసే క్రమంలో సూదులు లేదా టాటూలో ఉండే సిరా చర్మం లోపల ఉండే స్వేద గ్రంథుల్ని దెబ్బతీసే ప్రమాదముందని పరిశోధకులు వెల్లడించారు. అలాగే అవి మూసుకుపోయే అవకాశాలున్నాయని తేల్చారు. ఈ పరిణామం వల్ల టాటూ వేసిన చోట చెమట ఉత్పత్తి కాదని, దాని మూలంగా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. టాటూ వేసేటప్పుడు చర్మంపై నిమిషానికి 50 నుంచి 3వేల వరకు రంధ్రాలు పడతాయని, వాటి వల్ల స్వేద గ్రంథులు దెబ్బతింటాయని చెప్పారు. ఈ మేరకు అప్లయిడ్‌ ఫిజియాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.

పరిశోధనలో భాగంగా కొందరిలో టాటూ వేసుకున్న వారిని, వేసుకోని వారిని రెండుగా విభజించి వేడి వాతావరణంలో ఉంచారు. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంటపాటు నిలబెట్టారు. అయితే, అనుకున్న సమయానికి ఇరు వర్గాల వారికీ చెమటలు పట్టాయి. కానీ, టాటూ వేసుకోని వారి కంటే టాటూ వేసుకున్న వారి చర్మం నుంచి చెమట చాలా తక్కువ రావడాన్ని పరిశోధకులు గమనించారు. చిన్న చిన్న టాటూలతో ఎలాంటి ప్రమాదం లేదని, శరీర భాగాలపై పెద్ద టాటూలు వేసుకునే వారిలోనే ఈ సమస్య తలెత్తుతుందని చెప్పారు. కొందరు డెర్మటాలజిస్టులు మాత్రం ఈ విషయంలో మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని