Germany Chancellor: ఏంజెలా మెర్కెల్.. ముగిసిన 16 ఏళ్ల ప్రస్థానం..!
దశాబ్దిన్నర క్రితం జర్మనీకి తొలి మహిళా ఛాన్స్‌లర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించిన ఏంజెలా మెర్కెల్.. సుదీర్ఘ కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన మహిళగా మరో ఘనత సాధించారు.
డిసెంబర్ 8తో పదవీకాలం పూర్తి
బెర్లిన్: దశాబ్దిన్నర క్రితం జర్మనీకి తొలి మహిళా ఛాన్స్‌లర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించిన ఏంజెలా మెర్కెల్.. సుదీర్ఘ కాలంపాటు ఆ పదవిలో కొనసాగిన మహిళగా మరో ఘనత సాధించారు. జర్మనీ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేందుకు ప్రయత్నించినట్లు పేరుతెచ్చుకున్న మెర్కెల్.. యూరోపియన్ యూనియన్‌ను ఏకతాటిపై నిలబెట్టడంలోనూ కృషి చేసిన వ్యక్తిగా ప్రసిద్ధికెక్కారు. అంతేకాకుండా తన పదవీకాలంలో ఎన్నో సంక్షోభాలను దీటుగా ఎదుర్కొని విదేశాల మన్ననలను పొందిన 67ఏళ్ల మెర్కెల్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంతి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇలా 16ఏళ్ల పాటు ఏకధాటిగా జర్మనీ ఛాన్సలర్ పదవిలో కొనసాగిన ఆమె ప్రస్థానం డిసెంబర్ 8తో ముగియనుంది.
మూడో వ్యక్తిగా రికార్డు..
తూర్పు జర్మనీకి చెందిన ఏంజెలా మెర్కెల్ మొదట్లో ఓ శాస్త్రవేత్త. అనంతరం క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. నవంబర్ 22, 2005లో జర్మనీ ఛాన్సలర్‌గా పగ్గాలు చేపట్టారు. జర్మనీలో సుదీర్ఘకాలం పాటు ఈ పదవిని చేపట్టిన వ్యక్తిగా బిస్మార్క్ (దాదాపు 23ఏళ్లు) రికార్డు సృష్టించగా.. ఏంజెలా గురువుగా భావించే హెల్మట్ కోల్ పదహారేళ్ల పాటు (16ఏళ్ల 26రోజులు) అధికారంలో కొనసాగిన రెండో వ్యక్తిగా ప్రసిద్ధికెక్కారు. వీరిద్దరి తర్వాత అత్యధిక కాలం ఛాన్సలర్ పదవి చేపట్టిన మూడో అధినేతగా ఏంజెలా మెర్కెల్ తాజా ఘనత సాధించారు. రెండోస్థానంలో ఉన్న హెల్మట్ కోల్ కంటే మెర్కెల్ కేవలం పదిరోజుల (16ఏళ్ల 15రోజులు) తక్కువ సమయం మాత్రమే అధికారంలో కొనసాగారు. ఏంజెలా మెర్కెల్ తన హయాంలో సంక్షోభ సమయాల్లోనూ సమర్థవంత నిర్వహణతో శక్తివంతమైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అగ్ర రాజ్యాధినేతలు మారినా..
నవంబర్ 22, 2005న జర్మనీ ఛాన్సలర్‌గా ఏంజెలా మెర్కెల్ అధికార పగ్గాలు చేపట్టారు. ఆ పదవిలో ఏకధాటిగా పదహారేళ్ల కాలం ఏంజెలా కొనసాగగా.. అదే సమయంలో అగ్రరాజ్యాల అధినేతలు ఎంతోమంది మారడం విశేషం. ముఖ్యంగా ఆమె జర్మనీ ఛాన్సలర్‌గా ఉన్న 16ఏళ్లలో అమెరికాకు నలుగురు అధ్యక్షులు ఎన్నికయ్యారు. ఫ్రాన్స్‌కు నలుగురు అధ్యక్షులు, బ్రిటన్‌కు ఐదుగురు ప్రధాన మంత్రులకుతోడు ఇటలీకి ఎనిమిది మంది ప్రీమియర్లు వచ్చి వెళ్లారు. వారిలో కొందరు రెండు పర్యాయాలు చేశారు. కేవలం ఈ దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నోదేశాల్లో అధినేతలు మారినప్పటికీ ఏంజెలా మెర్కెల్ మాత్రం సుదీర్ఘకాలం పాటు (వరుసగా నాలుగుసార్లు) అధికార పగ్గాలు చేపట్టారు.
అధినేతలతో లౌక్యం..
ఏంజెలా మెర్కెల్ తన పదవీ కాలంలో ప్రపంచస్థాయిలో జర్మనీ ప్రతిష్ఠను మరింత పెంచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని జర్మనీ మార్షల్ ఫండ్ డిప్యూటీ డైరెక్టర్ సుధా డేవిడ్ విల్ప్ పేర్కొన్నారు. జర్మనీకి మెర్కెల్ ఎంతో శక్తిని అందించిందన్న ఆమె.. దౌత్య సంబంధాల్లోనూ లౌక్యం ప్రదర్శించారని కొనియాడారు. ఉదాహరణకు ఉక్రెయిన్ వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చినందుకుగానూ రష్యాపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించడంలో మెర్కెల్ క్రియాశీలంగా వ్యవహరించారు. అదే సమయంలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తోనూ చర్చలు జరిపిన తీరుతో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెర్కల్ కఠిన వైఖరి ప్రదర్శించినట్లు చెబుతుంటారు. 2017 మార్చి నెలలో అమెరికా పర్యటన సందర్భంలో వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మెర్కెల్ కలిశారు. ఆ సమయంలో కరచాలనం చేయమని అక్కడి ఫొటోగ్రాఫర్లు అరిచిన సందర్భంలో మెల్లగా స్పందించిన మెర్కెల్.. కరచాలనం కావాలని వారు అడుగుతున్నారు?అంటూ ట్రంప్ వైపు చూస్తూ అడిగారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు.
పార్టీకి తప్పని ఓటమి..
తాను అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో సంక్షోభాలను అధిగమించినప్పటికీ.. మరెన్నో సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని ఏంజెలా మెర్కెల్ అభిప్రాయపడ్డారు. అయితే, ఆరోగ్యకరమైన ఆర్థికవ్యవస్థ, తక్కువ నిరుద్యోగం వంటి సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ మహమ్మారి సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆమె విఫలమయ్యారనే విమర్శలూ ఎదుర్కొన్నారు. మరోవైపు పునరుత్పాదకశక్తి రంగాన్ని ప్రోత్సహించడంలో పురోగతి సాధించినప్పటికీ వాతావరణ మార్పులపై ఆమె వేగంగా స్పందించలేదనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఇదిలాఉండగా వచ్చే ఎన్నికల్లో (ఐదోసారి) తాను పోటీలో లేనని 2018లో మెర్కెల్ ప్రకటించారు. అనంతరం ఈఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సొంత పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మాత్రం ఆమె విఫలమయ్యారు.
శక్తిమంతమైన మహిళగా..
తన హయాంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఏంజెలా మెర్కెల్.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ.బుష్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దేశాధినేతల ప్రశంసలు అందుకున్నారు. ఓ మహిళా నాయకురాలిగా సుదీర్ఘకాలంపాటు దేశాధినేత బాధ్యతలు చేపట్టడం పట్ల మన్ననలు పొందారు. అంతేకాకుండా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించే ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో వరుసగా గడిచిన పదేళ్లుగా ఆమె నిలుస్తున్నారు. ఇలా జర్మనీ ఛాన్సలర్‌గా 16 ఏళ్ల పాటు సాగిన ఏంజెలా మెర్కెల్ ప్రస్థానం డిసెంబర్ 8తో ముగియనుంది. తదుపరి ఛాన్సలర్‌గా ఓలఫ్ స్కాల్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India-Canada: ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా: భారత విదేశాంగ శాఖ ధ్వజం
-
Rajnath Singh: ‘చర్చించే ధైర్యం మాకుంది..!’ చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర మంత్రి
-
Hyderabad: ఉప్పల్‌లో పాక్ - న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్.. హెచ్‌సీఏకు పోలీసుల సూచనలు
-
Justin Trudeau: భారత మీడియా ప్రశ్నలకు.. నోరు విప్పని ట్రూడో!
-
Oscar 2024: ఆస్కార్-2024.. అధికారిక ఎంట్రీ కోసం పోటీ పడుతున్న చిత్రాలివేనా?
-
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో ‘కెనడా’ టెన్షన్.. 19,750 దిగువకు నిఫ్టీ!