SR Bommai Vs Union of India: ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో ఏం జరిగిందంటే!

SR Bommai Vs Union of India గా పేరుగాంచిన ఆ కేసు.. రాష్ట్రాల శాసనసభ రద్దు, అసెంబ్లీలో మెజారిటీ లేని సమయంలో ప్రస్తావనకు వస్తూనే ఉంటోంది.

Updated : 05 Aug 2021 17:28 IST

బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్‌ బొమ్మై తండ్రి SR బొమ్మై (సోమప్ప రాయప్ప బొమ్మై). అయితే, ఇప్పటివరకు బసవరాజ్‌ బొమ్మై పేరు ఓ ప్రాంతానికే పరిమితమైనప్పటికీ.. ఆయన తండ్రి ఎస్‌ఆర్‌ బొమ్మై పేరు మాత్రం దేశవ్యాప్తంగా తరచూ వార్తల్లో వినిపిస్తుంది. మూడు దశాబ్దాల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్‌ఆర్‌ బొమ్మై ప్రభుత్వం రద్దు కావడం అప్పట్లో దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చివరకు ఆ కేసులో కేంద్రం అధికారాలపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. SR Bommai Vs Union of India గా పేరుగాంచిన ఆ కేసు.. రాష్ట్రపతి పాలన, శాసనసభ రద్దు, అసెంబ్లీలో మెజారిటీ నిరూపణ వంటి సందర్భాల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంటోంది.

జనతాదళ్‌ హయాంలో ఎనిమిది నెలలపాటు (ఆగస్టు 1988 నుంచి ఏప్రిల్‌ 1989) కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్‌ఆర్‌ బొమ్మైకు 1989 ఏప్రిల్‌ 21న ఊహించని పరిణామం ఎదురయ్యింది. ప్రభుత్వానికి సరైన మెజారిటీ లేదని ఆర్టికల్‌ 356 ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం.. బొమ్మై సర్కారును రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. బొమ్మైకి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. దీంతో ఆయన ప్రభుత్వానికి మెజారిటీ లేని కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సమర్థించుకుంది. అదే సమయంలో మెజారిటీ నిరూపించుకునేందుకు బొమ్మై అభ్యర్థించినప్పటికీ అప్పటి గవర్నర్‌ పి.వెంకటసుబ్బయ్య అవకాశం ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రద్దయ్యింది.

ఆ తర్వాత ఏం జరిగిందంటే..

రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంపై ఎస్‌ఆర్‌ బొమ్మై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తొలుత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో చివరకు బొమ్మై సుప్రీంకు వెళ్లారు. ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం (SR Bommai Vs Union of India)గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. అది పూర్తవడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది.

సుప్రీం కోర్టు ఏం చెప్పింది..?

9మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఆర్టికల్‌ 356లోని నిబంధనలు, అధికారాలను క్షుణ్ణంగా సమీక్షించింది. చివరకు 1994 మార్చి 11వ తేదీన సుప్రీం ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విస్తృత అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుపై రాష్ట్రపతి తీసుకునే నిర్ణయానికి పార్లమెంట్ ఉభయసభల ఆమోదం ఉండాలని పేర్కొంది. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించని పక్షంలో.. రెండు నెలల తర్వాత ఆ ప్రకటన వీగిపోతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాంటి సమయంలో రద్దైన శాసనసభ తిరిగి పునరుద్ధరించబడుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఆర్టికల్‌ 356 కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అసలైన వేదిక శాసనసభే..

ఆర్టికల్‌ 356 పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఏకపక్షంగా రద్దు చేసే ప్రక్రియకు సుప్రీం కోర్టు స్వస్తి చెప్పింది. ఈ ఆర్టికల్‌ కింద కేంద్రానికి ఉన్న అధికారాలపై ఆంక్షలు విధించిన సుప్రీం కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేందుకు సరైన వేదిక శాసనసభేనని స్పష్టం చేసింది. అంతేకానీ ఈ విషయంలో గవర్నర్‌ సొంత అభిప్రాయానికి తావులేదని అభిప్రాయపడింది. దీంతో ఈ కేసు కేంద్ర-రాష్ట్ర సంబంధాలపైనా ప్రభావం చూపింది. 1999లో కేంద్రంలో ఉన్న వాజ్‌పేయీ ప్రభుత్వంపైనా ఆ తీర్పు ప్రభావం పడింది. రబ్రీదేవీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిహార్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ 1999 ఫిబ్రవరి 12న కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ, 25 రోజుల్లోనే అనగా మార్చి 8న తిరిగి ప్రభుత్వం పునరుద్ధరించబడింది.

ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు లేదా ఏదైనా అసెంబ్లీలో అధికార పార్టీకి మెజారిటీ లేకపోయిన సందర్భంలో ఎస్‌ఆర్‌ బొమ్మై కేసు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తాజాగా ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడు బసవరాజ్‌ బొమ్మై క‌ర్ణాట‌క ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బొమ్మై కేసును మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని