Rajasthan : ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’.. పొడవు ఎంతో తెలుసా!
రాజస్థాన్ రాష్ట్రంలోని కుంభాల్‌గడ్ కోట ‘ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’గా పేరొందింది.
ప్రపంచంలోని ఓ వింతగా.. అతి ఎత్తయిన, పొడవైన గోడ ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’(The Great Wall of China) పేరుగాంచింది. అలాంటి గ్రేట్ వాల్ మన దేశంలోనూ ఒకటి ఉందంటే మీరు నమ్ముతారా! అదే పర్యాటకులు ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్న కుంభాల్‌గడ్ కోట గోడ.
‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ ఎక్కడుంది?
కుంభాల్‌గడ్ కోట గోడ రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం రాజ్‌సమంద్ జిల్లాలో ఉంది. ఆరావళి పర్వతాలకు(Aravalli Hills) పశ్చిమశ్రేణిలో.. దాదాపు 36 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఉంది. పదమూడు ఎత్తయిన పర్వతాలు కోట చుట్టూ ఉన్నాయి. ఉదయ్‌పుర్(Udaipur)కు ఈ ప్రాంతం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని మేవాడ్ రాజు రాణా కుంభ నిర్మించాడు. ఈ కోటలోనే మహారాణా ప్రతాప్ జన్మించారట.
3వ శతాబ్దం నుంచే..
ఘన చరిత్ర ఉన్న ఈ కోట ఆనవాళ్లు 3వ శతాబ్దం నుంచే ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మౌర్య వంశ పాలకుడు అశోకుడి మనవడు సంప్రతి అక్కడ కోటను నిర్మించారట. కోట చుట్టూ ఉన్న గ్రామాన్ని ‘మచ్చింద్’ అని, కోటను మచ్చీంద్రపుర్ అని పిలిచేవారట. చరిత్రలో సంప్రతి చాలా ధైర్యవంతుడైన రాజుగా కీర్తి పొందాడు. శాంతికాముకుడైన ఆయన మధ్యప్రాచ్యంలో సైతం మందిరాలు నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తరువాత ఈ ప్రాంతంలో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు.
14వ శతాబ్దం ప్రారంభం నాటికి అల్లావుద్దీన్ ఖిల్జీ విస్తృతంగా ప్రాచుర్యం పొందాడు. భారత ఉప ఖండంలో పలు రాజ్యాలను జయిస్తూ వెళ్లాడు. దక్షిణాదిలో కూడా ఖిల్జీ జయించిన రాజ్యాలున్నాయి. రాజస్థాన్‌లోని పలు భూభాగాలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఖిల్జీ మేవాడ్ ఆక్రమణ కోసం తీవ్రంగా యత్నించాడు. అలాంటి ఇబ్బందులు ఇక రాకూడదని భావించిన సిసోదియా రాజవంశానికి చెందిన రాణా కుంభ్ 15వ శతాబ్దంలో మేవాడ్, మార్వార్‌ను వేరు చేసేలా ఒక పెద్ద గోడను నిర్మించాలని సంకల్పించాడు. ఆ పని వేగంగా పూర్తి కావాలని తన పరివారాన్ని ఆదేశించడంతో ఒకటిన్నర దశాబ్ద కాలంలోనే కోట గోడ నిర్మాణం పూర్తయింది. మేవార్ రాజులు తమ పరిపాలనా కాలంలో పలు కోటలు నిర్మించారు. అవి ఉత్తరాన ఆరావళి పర్వతాలు మొదలుకొని దక్షిణాన రాజస్థాన్ వరకు ఉన్నాయి. రాణా కుంభ్ దాదాపు 32 కోటలు నిర్మించగా.. అందులో కుంభాల్‌గడ్ అతిపెద్దది.
సాధువు ఆత్మార్పణతో..
వాస్తవానికి రాణా కుంభ్ కేలివాడలో కోటను నిర్మించాలని అనుకున్నాడు. అది ప్రస్తుతం కోట ఉన్న ప్రదేశానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎప్పుడు నిర్మాణం మొదలు పెట్టినా అది కూలిపోతూ ఉండేది. దాంతో ఆయన పరిష్కార మార్గం చూపాలని ఒక సాధువును కోరాడు. ఎవరినైనా బలి ఇస్తే నిర్మాణం సాఫీగా సాగుతుందని సాధువు చెప్పాడు. ఇది తెలిసి తమను తాము బలి ఇచ్చుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో సాధువే తాను బలయ్యేందుకు సిద్ధం అన్నాడు. అయిష్టంగానే సాధువు నిర్ణయాన్ని రాణా కుంభ్ అంగీకరించాడు. సాధువు చెప్పిన ప్రకారం ఆయన ఆగిన తొలిచోట ప్రధాన ద్వారం, రెండోసారి ఆగిన చోట దేవాలయం, సాధువు పూర్తిగా పడిపోయిన చోట కోట గోడ ఆఖరి పాయింట్‌ను నిర్మించారు.
అద్భుత నిర్మాణం
మెలికలు తిరుగుతూ కన్పించే కుంభాల్ కోట గోడ మేఘాలను తాకుతున్నట్లుగా ఉంటుంది. ఈ గోడ సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంటుంది. రాణా కుంభ్ ఆస్థానంలో పని చేస్తున్న రచయిత, సిద్ధాంత కర్త కోట నిర్మాణానికి కావాల్సిన ప్రణాళికను రూపొందించాడు. అది కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే.. 15 అడుగుల వెడల్పు గోడలపై ఒకేసారి 8 గుర్రాలు నడిచేలా కట్టడం ఉంది. కోటలో నిర్మించిన ఒక్కో ద్వారానికి ఒక్కో పేరు పెట్టారు. హాతి పోల్, హనుమాన్ పోల్, రామ్ పోల్ అని వాటిని వర్గీకరించారు. శత్రువులు తేలికగా చొరబడకుండా మూల మలుపులు, కష్టతరమైన మెట్లు ఉన్నాయి. అల్లంత దూరం నుంచే పసిగట్టే వ్యవస్థను కోట చుట్టూ ఏర్పాటు చేశారు. థార్ ఎడారి, ఆరావళి పర్వతాల నుంచి శత్రువులు వస్తున్నప్పుడే వారిని చూసే వీలు కోటలోని వారికి ఉంది.
రెండు అంతస్తుల కోటలో ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది. రాజు, రాణి ఛాంబర్లు, వాచ్‌టవర్, వర్షపు నీరు నిల్వ చేసే రిజర్వాయర్, ఫిరంగుల గది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కోటలోని ఒక్కో గదికి ఒక్కో పేరు పెట్టారు. బాదల్ మహల్, కుంభ మహల్ ఇలా.. వాటిని పిలుస్తారు. గోడలపై జీవం ఉట్టిపడే రీతిలో అద్భుతమైన బొమ్మలు చెక్కారు. కోర్టుయార్డు నుంచి రాయల్ ఛాంబర్‌లోకి అడుగుపెట్టేలా మార్గం ఉంది. వేలాది మందికి వండి పెట్టేలా వంటగది.. అందులో మాంసాహార, శాకాహార వంటకాలను వేర్వేరుగా తయారు చేసే ఏర్పాట్లున్నాయి. ఇక రాత్రిపూట వెలుతురు కోసం 100, 50 కేజీల దూది పట్టే కాగడాలను వినియోగించేవారు. ఆ వెలుతురు దాదాపు కిలోమీటరు పైగా దూరం కనిపించేదట.
అనేక దండయాత్రలు
రాణా కుంభ్ కోటను దక్కించుకోవడానికి పలు రాజ్యాల రాజులు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ కోట ఏంటి?దానికి అంతటి గోడ ఏంటి? అని శత్రు రాజ్యాలు జుట్టు పీక్కునేవి. మేవాడ్ పాలకుల చేతిలో ఉన్న ఆ కోటను దక్కించుకునేందుకు అక్బర్, మార్వార్ పాలకుడు రాజా ఉదయ్‌సింగ్, అమేర్ పాలకుడు రాజా మాన్ సింగ్, గుజరాత్ మీర్జాలు ఏకమయ్యారు. వారంతా కలిసి కోటకు వెళ్లే నీటిని విషపూరితం చేయడంతో విధిలేని పరిస్థితిలో మేవాడ్ రాజులు లొంగిపోయారు. అక్బర్ జనరల్ షాబాజ్ ఖాన్ 15వ శతాబ్దం చివరిలో కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1818లో ఈ కోటను మరాఠా రాజులు ఆక్రమించారు.
మన దేశంలోని చాలా కోటలు పర్వతాలపై లేదా అడవుల్లో ఉంటాయి. కుంభాల్‌గడ్ కోటకు ఈ రెండు అనుకూలతలు ఉన్నాయి. అందుకే 2013లో యునెస్కో ‘హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్’ పేరిట పలు కోటలతో కలిపి దీనికి వారసత్వ గుర్తింపు ఇచ్చింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!