Rajasthan : ఆ గ్రామంలో చిరుతలు దైవంతో సమానం.. వాటికి పూర్తి స్వేచ్ఛ!

మన దేశంలోని ఓ గ్రామంలో మనుషులకు ఏ హాని తలపెట్టకుండా చిరుతలు(Leopards) స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.

Published : 22 Mar 2023 10:31 IST

మనకు కూతవేటు దూరంలో చిరుత సంచరిస్తోందని తెలియగానే హడలిపోతాం. రాజస్థాన్‌(Rajasthan)లోని ఓ గ్రామ ప్రజలు  మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. అవి కూడా వారికి ఏ మాత్రం హాని చేయకుండా స్వేచ్ఛగా  తిరుగుతాయి. ఆ సంగతేంటో చదివేయండి.

ఆరుతో మొదలై.. అరవై దాకా..

రాజస్థాన్‌(Rajasthan)లోని పాలి జిల్లాలో బెరా గ్రామం ఉంది. ఆరావళి పర్వతాలకు సమీపంలో ఈ ప్రాంతం ఉంటుంది. సుమారు 50 ఏళ్ల క్రితం ఇక్కడికి సమీపంలోని కుంభాల్‌గడ్‌ జాతీయ పార్కు నుంచి 6 చిరుతలు తప్పించుకున్నాయి. అవి అటుఇటూ తిరుగుతూ బెరా గ్రామ పరిసరాలను తమ ఆవాసంగా మలుచుకున్నాయి. ఇక్కడ కొన్ని కొండ గుహలు, అటవీ ప్రాంతం కూడా ఉండటంతో అవి ఎక్కడికీ వెళ్లలేదు. దాంతో వాటి సంతతి క్రమంగా వృద్ధి చెందింది. 2020నాటికి ఇక్కడ 50-60 చిరుతలు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుతలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన అటవీ(Forest) అధికారులు ఈ ప్రాంతాన్ని జవాయ్‌ లెపర్డ్ కన్జర్వేషన్‌ జోన్‌గా ప్రకటించారు. పర్యాటకులకు చిరుతలను చూపించడానికి పలువురు సఫారీలు నిర్వహిస్తున్నారు. చిరుత కనిపించకపోతే మీకు డబ్బు వాపస్‌ చేస్తామని సఫారీ నిర్వాహకులు చెబుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.

దైవంలా పూజిస్తూ..

ప్రపంచంలో అత్యధికంగా చిరుతలు సంచరిస్తున్న ప్రాంతంగా బెరా గుర్తింపు పొందింది. కొన్నేళ్లుగా స్థానిక రబారి జాతి ప్రజలు వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. వీరు గొర్రెలు, పశువులు కాస్తూ ఉంటారు. గత కొన్ని దశాబ్దాలుగా చిరుతలు గ్రామంలోని రోడ్లు, పొలాలు, బావులు, కొండల వద్ద స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. రహదారిపై వెళ్తున్నప్పుడు మధ్యలో చిరుతలు కన్పిస్తే అవి వెళ్లేంత వరకు ఈ గ్రామస్థులు ముందుకు కదలరు. ఇక్కడ కేవలం చిరుతలు మాత్రమే కాదు నక్కలు, హైనాలు, బ్లూ బుల్స్‌, మొసళ్లు తదితర జంతువులు తిరుగుతుంటాయి. రెండు వందల రకాల పక్షులు(Birds) సైతం ఈ ప్రాంతంలో కన్పిస్తాయి.

అదో.. దైవ బలి!

అప్పుడప్పుడూ చిరుతలు స్థానికులు పెంచే పశువులను వేటాడతాయి. స్థానికులు ఆ చర్యను అడ్డుకోరు. పైగా దాన్ని గౌరవిస్తారు. తమ దగ్గర నుంచి ఒక గొర్రెను చిరుతలు తీసుకెళ్లిపోతే.. దేవుడు ప్రతిగా రెండు ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఇక ప్రభుత్వం కూడా ప్రజలకు పరిహారం ఇస్తుంది. వన్‌ ధన్‌ యోజన పథకం కింద మేక చనిపోతే రూ.4వేలు, ఆవు చనిపోతే రూ.15వేలు అందజేస్తోంది. ఈ పరిహారం తీసుకోవడానికి కూడా ప్రజలు ముందుకు రారు. ఎందుకంటే చిరుత పులులు తాము పెంచుకుంటున్న జీవాలను వేటాడటం దైవ బలిగా భావిస్తారు. చుట్టూ ఉన్న ఆలయాల్లో కూడా చిరుత బొమ్మలను ఏర్పాటు చేసి ఓ దైవంలా పూజిస్తుంటారు.

పర్యాటకుల తాకిడి

మన దేశంలో 10వేలకు పైగా చిరుతలున్నాయి. ఎక్కడ చూసినా వాటికి ఆహారం లభించక జనావాసాలపై దాడి చేస్తుంటాయి. ఈ క్రమంలో మనుషుల వేటకు చిరుతలు బలవుతున్నాయి. కానీ, బెరాలో మాత్రం మనుషులకు, చిరుతలకు మధ్య సఖ్యత కన్పిస్తుంది. చిరుతలు స్వేచ్ఛా సంచరించడం స్థానికులకు వింతగా తోచనప్పటికీ బయటి వారు వాటిని చూడటానికి ఎక్కువగా వస్తుంటారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక్కడ కొందరు తమ స్థలాలను హోటళ్లుగా మార్చారు. దాంతో చిరుతల సంచారానికి అవసరమైన స్థలం క్రమంగా తగ్గిపోతోందని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిరుతలు బయటకు రావు. అందుకే చాలా మంది వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లు అక్టోబరు నుంచి జనవరి మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్సుకత చూపుతుంటారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు