Vande Bharat Express : ఆయన కలల ప్రాజెక్టే ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’

సంక్రాంతి పండగ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌’ పరుగులు తీస్తోంది. ఈ రైలు వేగం, అందులోని వసతుల గురించి అంతటా చర్చ నడుస్తోంది. అయితే ఈ రైలు సృష్టికర్త ఎవరు? ఆయన తన కలల ప్రాజెక్టు కోసం ఎలాంటి కృషి చేశారు? చదివేయండి మరి.

Published : 17 Jan 2023 19:19 IST

(Image : sudhanshu mani twitter)

‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్’(Vande Bharat Express).. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొత్తం ఈ రైలులో కనిపించింది. సికింద్రాబాద్‌(secunderabad)-విశాఖ(vizag) సర్వీసులతో ప్రారంభమైన ఈ రైలు(train) వేగంగా తమ గమ్యస్థానాలకు తీసుకెళ్తుండటంతో ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌’ వెనుక ఓ వ్యక్తి చేసిన అవిరళ కృషి దాగి ఉంది. ఆయనెవరో చదివి తెలుసుకోండి మరి.

ట్రైన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా

సుధాన్షు మణి(sudhanshu mani).. 1979లో రైల్వేశాఖలో మెకానికల్‌ ఇంజినీర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2016 ఆగస్టులో చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్‌ ఫ్యాక్టరీ(icf) జీఎం(general manager)గా నియమితులయ్యారు. తన ఉద్యోగ జీవితంలో వర్క్‌షాప్‌ నిర్వహణ, రైల్వే ఆపరేషన్స్‌, తయారీ, ప్రాజెక్టుల నిర్వహణ, ప్లానింగ్‌ విభాగాల్లో సేవలందించిన ఆయన 1990 నుంచి 2010 వరకు పలు డీజిల్ లోకోమోటివ్స్‌(diesel locomotive) అభివృద్ధికి కృషి చేశారు. జీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే సెమీ హైస్పీడ్ రైళ్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టారు. అతి తక్కువ కాలంలోనే తన కలల ప్రాజెక్టు ‘ట్రైన్‌ 18’(train 18)ను విజయవంతం చేసి 2018 డిసెంబరు 31న ఆయన పదవీ విరమణ చేశారు. భారతీయ రైల్వేల అభివృద్ధికి సుధాన్షు చేసిన సేవలను కీర్తిస్తూ ఆయనను ‘ట్రైన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తుంటారు. ప్రస్తుతం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్న ‘ట్రైన్‌ 18’ ప్రాజెక్టులో తన అనుభవాలను వివరిస్తూ సుధాన్షు ‘మై ట్రైన్‌ 18 స్టోరీ’ పేరుతో పుస్తకం కూడా రాశారు.

మనసులో ఉంది.. మార్గం వెతికారు

ఒక మెకానికల్‌ ఇంజినీర్‌గా రైల్వేల్లోకి అడుగుపెట్టిన సుధాన్షు మణికి ఆ వ్యవస్థలో ఎలాంటి మార్పులు లేకపోవడం ఆలోచింపజేసింది. విదేశాలు బుల్లెట్‌ రైళ్లు(bullet train) నడపాలనే ఆలోచనతో ముందుకెళ్తుంటే.. మనం ఇంకా అవే డిజైన్లు, అవే పాత బోగీలతో ఎంతకాలం ఉంటాం అనే ప్రశ్న ఆయనలో ఉదయించింది. అనుకున్నదే తడవుగా సెమీ హై స్పీడ్‌ రైళ్ల ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. మన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో అలాంటి రైళ్ల తయారీ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. కానీ సుధాన్షు పట్టుదల, పనితీరును అర్థం చేసుకున్న అప్పటి రైల్వే బోర్డు ఛైర్మన్‌ రూ.200 కోట్ల పెట్టుబడితో రెండు రైళ్ల తయారీకి మాత్రం అనుమతించారు. దీంతో మేక్‌ ఇన్‌ ఇండియా(make in india) నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘ట్రైన్‌-18’ ప్రాజెక్టును పట్టాలెక్కించడం మొదలు పెట్టారు.

సమయం లేదు మిత్రమా అంటూ కర్తవ్య బోధ

‘ట్రైన్‌ 18’ ప్రాజెక్టుకు అనుమతి లభించినా.. సుధాన్షు పదవీ విరమణ చేయడానికి రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆయన కోచ్‌ ఫ్యాక్టరీలో పని చేసే సిబ్బందిని జాగృతం చేశారు. ‘ఓ కొత్త ప్రాజెక్టు మీ చేతుల్లోకి వచ్చింది. దాన్ని విజయవంతం చేసే బాధ్యత మీదే’ అంటూ అక్కడి సిబ్బంది, ఉద్యోగుల్లో నూతనోత్తేజం నింపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే వ్యయంలో మూడో వంతు మాత్రమే వెచ్చించి ‘ట్రైన్‌ 18’ తయారీ పూర్తి చేయాలని డిజైన్‌ ఇంజినీర్లకు కర్తవ్య బోధ చేశారు. దాంతో రూ.12 కోట్లు ఖర్చు చేస్తే.. కానీ తయారు కాని ఒక బోగీ.. రూ.6 కోట్లతోనే తయారైంది. యూరప్‌, జపాన్‌ దేశాలతో సరి సమానంగా ఆ బోగీల లుక్‌ మారింది. అలా ఎట్టకేలకు భారత్‌లో తొలి సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్ పట్టాలపై ఎక్కింది. టెస్ట్‌ రన్‌లో 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి అందరి చేత ఔరా అనిపించింది. 

(Image : sudhanshu mani twitter)

మార్పులకు శ్రీకారం.. చెన్నై ఐసీఎఫ్‌

దేశీయ రైల్వే అవసరాల కోసం చెన్నై ఇంటెగ్రల్ కోచ్‌ ఫ్యాకర్టీ(chennai integral coach factory)ని 1955లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. 2015 జులై 6 నాటికి ఇక్కడ 50వేల కోచ్‌లు తయారయ్యాయి. ఈ ఘనతకు గానూ లిమ్కా బుక్‌ రికార్డ్స్‌(limca book of records)లో చోటు దక్కింది. 2017-18 మధ్య 2503 కోచ్‌లు, 2018-2019 మధ్య 3262 కోచ్‌లు ఇక్కడ ఉత్పత్తి కావడం మరో రికార్డుగా నిలిచింది. తాను జీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సుధాన్షు మణి ఇక్కడ పలు మార్పులు తీసుకొచ్చారు. కోచ్‌ ఫ్యాక్టరీ మొత్తం సౌరశక్తితో నడిచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇది భారతీయ రైల్వేలో తొలి కర్బన రహిత కంపెనీగా నిలిచింది. ఫ్యాక్టరీలోని వ్యర్థాలు, ఇతర వస్తువులు వినియోగించి చూడచక్కని ఆర్ట్‌ గ్యాలరీగానూ తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా ఆహ్లాదం ఉట్టిపడేలా ఆ ఫ్యాక్టరీని మలిచారు. రైళ్ల రంగు, డిజైన్లలో మార్పునకు చర్యలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని