Monarch butterfly : మహా ‘మోనార్క్’లు ఈ సీతాకోక చిలుకలు.. వేల మైళ్లు ప్రయాణిస్తాయి!
తాము బతకడం.. భావి తరాలను బతికించడం కోసం జీవితాంతం యుద్ధం చేస్తుంటాయి ‘మోనార్క్’ జాతి సీతాకోక చిలుకలు (Monarch butterfly).
ఈ సువిశాల భూగోళంపై వేలవేల వర్ణాల సీతాకోక చిలుకలు (Butterfly) సంచరిస్తున్నాయి. వాటిలో ‘మోనార్క్’ జాతి సీతాకోక చిలుకలది (Monarch butterfly) ప్రత్యేకమైన శైలి. అమెరికా (America), కెనడా (Canada) దేశాల్లో ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. తమ మనుగడను కాపాడుకొనేందుకు మోనార్క్ జాతి సీతాకోక చిలుకలు కొన్ని ఏకంగా 4 వేల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణం చేస్తాయి. మెక్సికోలోని (Mexico) సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లి.. అక్కడే నిద్రాణస్థితిలో ఉండి తిరిగి తమ స్వస్థలానికి చేరుకుంటాయి. ఆ విశేషాలేంటో తెలుసుకోండి మరి..
దారి తెలియని సుదూర ప్రయాణం!
అన్ని సీతాకోక చిలుకల్లాగే.. ‘మోనార్క్’లు కూడా గుడ్డు, గొంగళి పురుగు, ప్యూపా, సీతాకోక చిలుకలుగా రూపాంతరం చెందుతాయి. నారింజ, నలుపు, తెలుపు ముదురు రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ సీతాకోక చిలుకలు రెక్కలు విప్పితే పది సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. వాతావరణ మార్పులు సంభవించగానే మోనార్క్‌లు దాదాపు మూడు వేల మైళ్ల దూరం ప్రయాణించి మెక్సికో చేరుకుంటాయి. ఆ ప్రదేశాన్ని మునుపెన్నడూ చూడకపోయినా అవి విచిత్రంగా ఏటా అక్కడికే వెళ్తాయి. మెక్సికోలోని చల్లటి వాతావరణాన్ని తట్టుకునేందుకు ఈ కీటకాలు నిద్రాణ స్థితిలోకి వెళ్తాయి. వలస కాలం పూర్తయ్యే నాటికి స్త్రీ మోనార్క్‌ల పునరుత్పత్తి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. దాంతో పురుష మోనార్క్‌లు వాటితో సంభోగం చేస్తాయి. నిజానికి మెక్సికో వాతావరణం కూడా ‘మోనార్క్’ల జీవన విధానానికి అనువుగా ఉంటుంది. ఎత్తయిన దేవదారు వృక్షాలు సీతాకోకచిలుకలు గుంపులు గుంపులుగా ఉండటానికి తోడ్పడతాయి. కొందరు మెక్సికో పౌరులు సైతం వాటి మనుగడకు భంగం వాటిల్లకుండా చూసుకుంటున్నారు. మోనార్క్‌లు నివాసం ఉండే చెట్లను కొట్టివేయకుండా.. ఆ ప్రాంతంలో జన సంచారం అధికం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
‘మిల్క్ వీడ్’ తోడ్పాటు
వసంత కాలం ప్రారంభం కాగానే అవి తిరిగి తమ సొంత స్థానానికి ప్రయాణం సాగిస్తాయి. ఈ క్రమంలో దారి వెంట కనిపించిన ‘మిల్క్‌వీడ్’ మొక్కలపై గుడ్లు పెడతాయి. ఈ ప్రక్రియ మార్చి నుంచి ఏప్రిల్ ప్రారంభంలో జరుగుతుంది. నిజానికి ‘మోనార్క్’ల జీవన చక్రంలో ‘మిల్క్ వీడ్’ మొక్కలు కీలక భూమిక పోషిస్తాయి. గుడ్లు మొదలుకొని సీతాకోకచిలుకగా రూపాంతరం చెందే వరకు మోనార్క్‌లు ఈ మొక్కలను ఆధారం చేసుకొనే ఎదుగుతాయి. కొంచెం విషపూరితమైన ఈ మొక్కలు ‘మోనార్క్’లను మాత్రం ఏమీ చేయవు.ఈ మొక్క ఆకులను తిన్న మోనార్క్ శరీరంలోకి కూడా కొంచెం విషం ఎక్కుతుంది. దాంతో మోనార్క్ శరీరం కూడా విష పూరితంగా ఉంటుంది. అందువల్ల వాటికి శత్రువుల నుంచి జీవిత కాలం రక్షణ లభిస్తుంది. ‘మిల్క్ వీడ్’పై ఉన్న గుడ్ల పునరుత్పత్తి ప్రక్రియ మళ్లీ ఆగస్టు, సెప్టెంబరు మొదట్లో ప్రారంభమవుతుంది. అలా మూడు నుంచి నాలుగు తరాల మోనార్క్‌లు అభివృద్ధి చెందుతుంటాయి.
దారి పొడవునా పోరాటం
ప్రతి ఏటా కెనడా, ఉత్తర అమెరికా నుంచి మోనార్క్‌లు వలస వెళ్తుంటాయి. ఆగస్టు చివర్లో, నవంబరు, డిసెంబరు మాసాల్లో ఈ వలసలు జరుగుతుంటాయి. వాటి గమ్యస్థానం సెంట్రల్ మెక్సికోలోని ఓయామెల్ ఫారెస్ట్. ఈ మోనార్క్‌లు రోజుకు 50 మైళ్ల దూరం సునాయాసంగా ప్రయాణిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంటకు ఇవి 12 మైళ్ల దూరం వెళతాయట. నైరుతి దిశగా సాగే వాటి ప్రయాణంలో పెద్దపెద్ద నదులు తారసపడతాయి. ఈ ప్రయాణంలో ‘మోనార్క్’లకు ఎన్నో తుపానులు ఎదురవుతుంటాయి. ‘మోనార్క్’లను తినేందుకు రకరకాల పక్షులు ప్రయత్నిస్తాయి. హైవేల గుండా ప్రయాణం చేసేటప్పుడు భారీ వాహనాలు తగిలి ప్రాణాలు కోల్పోతుంటాయి. సుదూర ప్రయాణం కావడంతో కొన్ని తీవ్రమైన అలసటతో మరణిస్తాయి. అలా మిలియన్ల కొద్దీ బయలుదేరిన మోనార్క్‌ల సంఖ్య మెక్సికో చేరే సరికి భారీగా తగ్గిపోతుంది. మెక్సికోలోనూ వాటికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. చెట్లపై ఉన్నప్పుడు భారీ గాలులు వీస్తుంటాయి. తీవ్రమైన మంచు వర్షానికి తట్టుకోలేక వేలాది సీతాకోక చిలుకలు చనిపోతుంటాయి. ఈ వలస కాలంలో సీతాకోకచిలుకలు మకరందాన్ని సేకరించి కార్బోహైడ్రేట్లను పోగు చేసుకుంటాయి. తిరిగి వెళ్లేందుకు కావాల్సిన శక్తిని శరీరంలో నిల్వ చేస్తాయి. కానీ వీటిలోనూ సగానికి సగం మెక్సికోలోనే ప్రాణాలు కోల్పోతాయి.
వలస ఓ మిస్టరీనే..
ఒక దేశం నుంచి మరో దేశానికి వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం ఈ సీతాకోక చిలుకలకు ఎందుకొచ్చిందీ అనే విషయం శాస్త్రవేత్తలకు ఇంకా అంతుచిక్కడం లేదు. తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఈ మోనార్క్‌లు ముందుగానే గ్రహిస్తాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారం దొరకని పక్షంలో తమ మనుగడ కష్టమని తెలిసి సురక్షిత ప్రాంతానికి వలస వెళ్తున్నాయట. మరి అప్పుడే పుట్టిన వాటికి వాతావరణ మార్పులు ఎలా తెలుస్తాయనే ప్రశ్న ఉదయిస్తుంది. అందుకు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే.. ఈ కీటకాలు వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తుంటాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడాను పసిగడతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడితే అతిశీతల వాతావారణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పక్షుల్లాగే వాటికీ తెలిసిపోతుందట. అందుకే ఆ ప్రాంతం నుంచి వలస వెళ్లేందుకు సిద్ధపడుతుంటాయని చెబుతున్నారు.
ఎంతో తెలివైనవి..
మోనార్క్ సీతాకోక చిలుకల మరో ప్రత్యేకత ఏమిటంటే వాటి భావ వ్యక్తీకరణ. మగ మోనార్క్‌లు తమ వెనుక రెక్కలపై ఉండే సువాసనల గ్రంథుల నుంచి రసాయనాలను విడుదల చేసి ఆడ మోనార్క్‌లను ఆకర్షణకు గురి చేస్తాయి. ఈ జాతి సీతాకోక చిలుకల రెక్కలు నారింజ రంగులో ఉండటం వల్ల మిగిలిన వాటికి తాము విషపూరితం అనే సంకేతాన్ని పంపుతాయి. ఈ కీటకంపై ఉండే ప్రకాశవంతమైన రంగులు హెచ్చరికలు జారీ చేస్తూ.. తమపై దాడి చేస్తే చిక్కులు తప్పవనే సందేశమిస్తాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో