నిజమైన హీరో: సాయంలో మరో సోనూసూద్‌!

తినడానికి తిండి లేదు. చేయడానికి పనిలేదు. దాచుకున్న డబ్బులూ లేవు. సరే..! సొంతూరుకు వెళ్లి కలో గంజో తాగుదామంటే బస్సులు లేవు. సుదూర ప్రాంతాలకు చేరవేసే రైళ్లూ బంద్‌. లాక్‌డౌన్‌ రెండోసారి పొడగించినప్పుడు...

Published : 22 Jul 2020 02:07 IST

లాక్‌డౌన్‌లో ఎందరో కష్టాలను తీర్చిన ఒడియా హీరో సవ్యసాచి మిశ్రా

తినడానికి తిండి లేదు. చేయడానికి పనిలేదు. దాచుకున్న డబ్బులూ లేవు. సరే..! సొంతూరుకు వెళ్లి కలో గంజో తాగుదామంటే బస్సులు లేవు. సుదూర ప్రాంతాలకు చేరవేసే రైళ్లూ బంద్‌. లాక్‌డౌన్‌ రెండోసారి పొడగించినప్పుడు కనిపించిన దృశ్యాలివి.

మరి దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్న ఆ నిరుపేదలు ఏం చేస్తారు? తెగించినవారు కాలినడకనే నమ్ముకున్నారు. మధ్యలోనే ప్రాణాలు వదిలారు. మరికొందరు సాయం చేసే ఆపన్న హస్తం కోసం ఎదురుచూశారు.

అప్పుడు వలస కూలీలను ఇళ్లకు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేయడం, రైళ్లు, విమానాలు బుక్‌చేస్తూ, కడుపు నిండా తిండి పెడుతూ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు వేసే సోనూ సూద్‌ సిసలైన హీరోగా నిలిచాడు. ఇది అందరికీ తెలిసిన కథే. కానీ మనందరికీ తెలియని మరో హీరో ఉన్నాడు. పేదల బాధను తీర్చిన ఆ కథానాయకుడే ఒడియా నటుడు ‘సవ్యసాచి మిశ్రా’.

స్మైల్‌ ప్లీజ్‌ అంటూ..

‘ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంది. కానీ దానికి సహనం అవసరం! దేవుడిపై విశ్వాసం, సానుకూల ఆలోచనల నుంచే ఆ సహనం అలవడుతుంది’ తన స్వచ్ఛంద సంస్థ ‘స్మైల్‌ ప్లీజ్’ కోసం ముంబయిలో సాయం అందించిన యూసుఫ్‌ మెహరెల్లి కేంద్రం, కల్యాణ్‌ బాబు, ధీరజ్‌ బాబుకు ధన్యవాదాలు చెబుతూ సవ్యసాచి మిశ్రా తన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ఇది. ఆ స్టేట్‌మెంట్‌ను బట్టి అతడి మనసేంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్తుల కష్టాలను పరిష్కరించే ఓర్పూ, ఓ మంచి పనిచేస్తే ఎవరైనా తనకు తోడ్పాటు అందిస్తారన్న విశ్వాసాన్ని మనం గ్రహించొచ్చు. ఎందుకంటే ఏదో అలా.. ఆరంభించిన తన స్వచ్ఛంద సంస్థ లాక్‌డౌన్‌లో అంతమంది కష్టాలను తీరుస్తుందని తానే కలగనలేదు మరి!

విద్యార్థులతో మొదలు

కరోనా వైరస్‌ ముప్పుతో హఠాత్తుగా లాక్‌డౌన్‌ అమలు చేయాల్సిన పరిస్థితి. దాంతో చాలామంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. రాజస్థాన్‌ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోసలిన్‌ మిశ్రా సవ్యసాచిని సోషల్‌ మీడియా ద్వారా సంప్రదించాడు. అంతేకాదు అతడిలాగే చాలామంది ఉన్నారని చెప్పాడు. మొదట్లో సవ్యసాచికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా వారిని వెనక్కి తీసుకురావాలో తోచలేదు. కానీ మనసులో మాత్రం వారిని అక్కడ చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకురావాలన్న ఆలోచన నిండిపోయింది. దాంతో తనకు తెలిసిన పోలీసు అధికారులను సంప్రదించి అనుమతులు తీసుకున్నారు. వారు చెప్పిన ప్రకారం ఏర్పాట్లు చేసి 80 మందికి 72 మంది విద్యార్థులను ఉత్తరాఖండ్‌, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి ఎన్నో ప్రయాలకోర్చి ఒడిశాకు రప్పించారు.

పెరిగిన వినతులు

ఎప్పుడైతే విద్యార్థులను రప్పించాడో అతడికి వినతులు వెల్లువలా రాసాగాయి. కష్టాలు తీర్చాలంటే అన్నీ ఒక్కడే చూసుకోవడం కష్టమని వేర్వేరు రాష్ట్రాలు, జిల్లాలు, నగరాల్లో 100 మంది వాలంటీర్లను ఆహ్వానించారు. అందుకు తగ్గట్టే మంచి స్పందన లభించింది. చక్కని వాలంటీర్లు దొరికారు. ఆ తర్వాత ఆయన లాక్‌డౌన్‌లో కష్టాలు పడుతున్న దాదాపు 1500 మందిని తిరిగి ఒడిశాకు తీసుకొచ్చారు. బస్సులు ఏర్పాటు చేశారు. ఆహారం అందించారు. దుబాయ్‌లో చిక్కుకుపోయిన ఒడియా వాసుల కోసం ఏకంగా విమానాన్ని బుక్‌ చేశారు. ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియా ద్వారా తాను ఏర్పాటు చేసిన బస్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రకటించి అక్కడెవరైనా ఒడిశా పౌరులుంటే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

పాపం.. అమ్మాయి

కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించే తండ్రి చనిపోవడంతో ఓ 19ఏళ్ల అమ్మాయి ఉపాధి కోసం తెలిసినవాళ్ల సాయంతో బాపట్లకు చేరుకుంది. వెళ్లిన కొన్నాళ్లకే ఆమె జీవితం కష్టాలమయంగా మారింది. యజమాని ఆమె ఫోన్‌ లాక్కొని, వాళ్లమ్మతో మాట్లాడకుండా చేశారు. ఆమెను చిత్రహింసలు పెట్టారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. అంతలోనే లాక్‌డౌన్‌ రావడంతో వాళ్లమ్మ సైతం అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. వెంటనే ఆమె సవ్యసాచికి ఫోన్‌ చేసి సాయం కోరింది. దాంతో డాక్టర్‌ సాంబశివరావు (తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్‌), పోలీసులు ఇంకా మరికొందరి సాయంతో ఆమెను రక్షించి తల్లిఒడికి చేర్చారు. ఆ ఆనందంలో ఆ యువతి సవ్యసాచి కాళ్లమీద పడిపోవడం గమనార్హం.

దుబాయ్‌ నుంచి మృతదేహం

ఓ యువకుడు పేదవాడు. దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అతడి తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. అంత్యక్రియలు చేసేందుకు ఆ యువకుడు రాలేని పరిస్థితి. ఈ విషయం అతడి స్నేహితుడు సవ్యసాచికి ఫేస్‌బుక్‌ ద్వారా తెలియజేశాడు. వెంటనే దుబాయ్‌లోని దౌత్యకార్యాలయం, ఒడియా సంఘంతో మాట్లాడి రెండోరోజే విమానంలో ఒడిశాకు రప్పించారు. లాక్‌డౌన్‌ ఒత్తిడిని తట్టుకోలేక కుంగుబాటుతో ఓ వ్యక్తి దుబాయ్‌లో మరణించారు. ఆయన్ను వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులు సవ్యసాచికి మొరపెట్టుకున్నారు. దుబాయ్‌లో చిక్కుకుపోయిన 189 మందితో పాటు ఆ మృతదేహాన్నీ ప్రత్యేక విమానంలో తీసుకొచ్చేందుకు సాయం చేశారు.

ఆగిపోయిన పెళ్లి మళ్లీ..

చౌవుద్వార్‌ అమ్మాయి కల్పనా పట్నాయక్‌కు జూన్‌లో పెళ్లి కుదిరింది. ఏదో పనిపై ఆమెతో పాటు కుటుంబీకులు తమిళనాడు వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో పెళ్లి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. వీరి సంగతి సవ్యసాచికి తెలియడంతో అధికారులతో మాట్లాడి వారిని తమిళనాడు నుంచి ఒడిశాకు రప్పించారు. క్వారంటైన్‌ నిబంధనలు పూర్తయ్యాక పెళ్లి చేయించారు. దాంతో ఆ కొత్తజంట సవ్యసాచికి ధన్యవాదాలు తెలియజేసింది.

ఇతరుల సాయమూ

స్వచ్ఛంద సంస్థ కోసం సవ్యసాచి ఇప్పటికే ఎంతో ఖర్చుచేశారు. మొదట్లో ఇతరులు సాయం చేస్తానంటే సున్నితంగా తిరస్కరించేవారు. అయితే ఆర్తుల నుంచి విజ్ఞప్తులు ఎక్కువ కావడంతో ప్రస్తుతం ఇతరుల సాయమూ తీసుకుంటున్నారు. అయితే నగదు రూపంలో కాదు. బస్సులు రాయితీకి ఏర్పాటు చేయడం, ఆహారం అందించడం, అన్నార్తులకు కావాల్సినవి అందించడం వంటి పనుల్లో సాయం స్వీకరిస్తున్నారు. ఎన్నోసార్లు.. ఎంతో మందికి సాయం చేసిన సవ్యసాచి నిజమైన హీరోనే కదా.

- ఇంటర్‌నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని