Titanic : ఈ ‘టైటానిక్’ నర్సు మృత్యుంజయురాలు!
వైలెట్ జెస్సప్ (Violet jessop).. భారీ ఓడల్లో (Ship) స్టీవార్డెస్, నర్సుగా పని చేసేది. తన జీవిత కాలంలో మూడు ఓడ ప్రమాదాల నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది.
(Image : Social media)
టైటానిక్ (Titanic).. నౌకాయాన చరిత్రలోనే పెను విషాదం మిగిల్చి ఈ భారీ విలాసవంతమైన ఓడ 1912 ఏప్రిల్ 14న మునిగిపోయింది. దాదాపు 1500 మంది జలసమాధి అయ్యారు. టైటానిక్ ప్రమాదం జరిగి నేటికి 111 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఆ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ స్టీవార్డెస్ వైలెట్ జెస్సప్ (Violet jessop) గురించి తెలుసుకుందాం. ఆమె తన జీవిత కాలంలో ఇలాంటివి మూడు ప్రమాదాలను ఎదుర్కొన్నారు.
ఎవరీ వైలెట్ జెస్సప్?
వైలెట్ జెస్సప్ 1887లో అర్జెంటీనాలో జన్మించింది. ఆమె పూర్వీకులు ఐరిష్ వలసదారులు. బాల్యంలో వైలెట్‌కు టీబీ సోకింది. వైద్యులు ఆమె బతకడం కష్టమన్నారు. అయితే.. అనూహ్యంగా వైలెట్ కోలుకుంది. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ తండ్రి చనిపోవడంతో వైలెట్‌ను తల్లి ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లింది. అక్కడ వైలెట్ తల్లి ఓడలో స్టీవార్డెస్‌గా పని చేసేది. అనుకోకుండా ఆమె కూడా జబ్బు పడటంతో కుటుంబ భారం వైలెట్ తన భుజాలకెత్తుకుంది. తానూ స్టీవార్డెస్‌గా మారింది. అప్పటికి ఆమె వయసు 21 సంవత్సరాలు. అందంగా కన్పిస్తుండటంతో పని ప్రదేశంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. తన జీవితం మొత్తంలో మూడు ప్రపోజల్స్ వచ్చాయి. ఓ ఫస్ట్ క్లాస్ ప్రయాణికుడు సైతం వైలెట్‌ను పెళ్లి చేసుకుంటానని అడిగాడట. దానికి ఆమె నో చెప్పేసింది. తాను అందంగా కన్పిస్తే చిక్కులు తప్పవని భావించి తన ఆహార్యం మార్చుకుంది. పాత దుస్తులు ధరించేది. మేకప్ వేసుకునేది కాదు.
వైలెట్ ‘ఒలింపిక్’ అనే ఓడలో 1910లో స్టీవార్డెస్‌గా ఉద్యోగంలో చేరింది. అప్పట్లో నెలకు వేతనం 2.10 పౌండ్లు. అట్లాంటిక్ సముద్ర వాతావరణం తన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని తొలినాళ్లలో భయపడింది. మెల్లగా ఆ వాతావరణానికి అలవాటు పడింది. ఏడాది తర్వాత ఆ ఓడ ‘హెచ్‌ఎంఎస్ హాక్’ అనే మరో ఓడను ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు ఓడలు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ అవి మునిగిపోలేదు. దాంతో వైలెట్ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది.
కొద్ది రోజుల తర్వాత ‘వైట్ స్టార్‌లైన్’ కంపెనీ టైటానిక్‌లో పని చేయడానికి సిబ్బంది కావాలని ప్రకటన విడుదల చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సూచన మేరకు వైలెట్ టైటానిక్‌లో పనిచేయడానికి అంగీకరించింది. అయితే అనూహ్యంగా 1912 ఏప్రిల్ 14న టైటానిక్ మంచుకొండను ఢీకొని మునిగిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు 1500 మంది చనిపోయారు. లైఫ్‌బోటులో ఎక్కడంతో వైలెట్ ప్రాణాలతో బయటపడింది. బోటులో ఎక్కిన తరువాత వైలెట్ ఓ చిన్న పాపను కూడా కాపాడే ప్రయత్నం చేసింది. అయితే ఆ చిన్నారి తల్లి పాపను తన నుంచి లాక్కొందని వైలెట్ ఓ సందర్భంలో వివరించింది. అంతే కాదు టైటానిక్‌లో ఏమైనా మర్చిపోయావా అని పక్కనున్న వాళ్లు అడిగితే ‘టూత్ బ్రష్’ అని వైలెట్ సమాధానమిచ్చిందట. ఈ రెండు ప్రమాదాలు చూసిన తరువాత ఎవరైనా మరోసారి ఓడ ఎక్కాలంటే భయపడతారు. కానీ వైలెట్ అలా అనుకోలేదు.
మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతున్న నేపథ్యంలో టైటానిక్ సోదరిగా పిలిచే ‘బ్రిటానిక్’లో విధుల్లో చేరింది. అది ‘ఏజియన్ సీ’ మీదుగా రాకపోకలు సాగించేది. ఈ నేపథ్యంలో ఓ జర్మన్ ఓడ కారణంగా ‘బ్రిటానిక్’ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆ ఓడ వేగంగా మునిగిపోయింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ‘వైలెట్’ లైఫ్‌బోట్‌లోకి ఒక్క ఉదుటన దూకేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఏమైందోనని డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఓడ నుంచి దూకిన సమయంలో తలకు గాయమైనట్లు వైద్యుడు గుర్తించారు. దాంతో కొద్ది రోజులు చికిత్స తీసుకుంది. యుద్ధం ముగిసిన తరువాత రవాణా కోసం ఎక్కువగా ఓడలను వినియోగించేవారు. క్రూజ్ షిప్‌ల రాకపోకలు కూడా ఊపందుకున్నాయి. దాంతో వైలెట్ వైట్ స్టార్‌లైన్‌కు గుడ్ బై చెప్పేసి రెడ్ స్టార్‌లైన్ అనే కంపెనీలో చేరింది. ఈ సారి వైలెట్ పదవీ విరమణ అయ్యే వరకు ఆమె ప్రయాణించిన ఓడల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు. వృద్ధాప్యంలో ఆమె తోటలు, కోళ్ల పెంపకం చేసేది. 1971లో గుండెపోటు రావడంతో 84 ఏళ్ల వయసులో కన్నుమూసింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ