ఖైదీల కష్టానికి ప్రతీక: ది వాల్‌ ఆఫ్ టియర్స్‌

‘ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్ చైనా’ గురించి అందరికి తెలుసు. క్రీస్తుపూర్వం నుంచి పలు రాజ్యాలు నిర్మిస్తూ వచ్చిన ఈ గోడ పొడవు 21,196 కిలోమీటర్లు ఉంటుంది. ఇదో అద్భుతమై కట్టడం కనుకే ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా నిలిచింది. కానీ, మీరు ఎప్పుడైన ‘ది వాల్‌ ఆఫ్‌ టియర్స్‌(కన్నీటి గోడ)’గురించి విన్నారా?

Updated : 02 Oct 2020 21:09 IST


(Photo: google earth 3d picture screenshot)

‘ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్ చైనా’ గురించి అందరికి తెలుసు. క్రీస్తుపూర్వం నుంచి పలువురు రాజులు నిర్మిస్తూ వచ్చిన ఈ గోడ పొడవు 21,196 కిలోమీటర్లు ఉంటుంది. ఇదో అద్భుతమై కట్టడం కనుకే ప్రపంచంలోని వింతల్లో ఒకటిగా నిలిచింది. కానీ, మీరు ఎప్పుడైన ‘ది వాల్‌ ఆఫ్‌ టియర్స్‌(కన్నీటి గోడ)’గురించి విన్నారా?

ది వాల్‌ ఆఫ్‌ టియర్స్‌ అనే గోడ ఈక్వడార్‌లోని గాలాపోగస్‌ ద్వీపసమూహంలోని ఇస్బెల్లా ఐలాండ్‌లో ఉంది. గతంలో ఇక్కడ ఖైదీలకు విధించిన క్రూరమైన శిక్షకు, ఖైదీల కష్టానికి ప్రతీక ఈ గోడ అని స్థానికులు అభివర్ణిస్తుంటారు. దీని వెనుక హింస, తిరుగుబాటు, కష్టం, త్యాగాలతో కూడుకున్న చరిత్ర ఉంది. పూర్వం గాలాపోగస్‌ ఐలాండ్స్‌లో నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. అయితే 19వ శతాబ్దంలో మాన్యువల్‌ జె. కొబొస్‌ అనే వ్యక్తి.. కొందరు ఖైదీలను తీసుకొచ్చి ఇక్కడ తను ఏర్పాటు చేసుకున్న చెరకు, కాఫీ తోటల్లో పని చేయించుకునేవాడు. అయితే, కొబోస్‌ పెట్టే హింసలు భరించలేక ఖైదీలే అతడిని హత్య చేశారు. 

ఆ తర్వాత జోస్‌ వాల్డిజెన్‌ అనే వ్యక్తి  ప్రభుత్వం నుంచి 12 ఏళ్లపాటు ఈ ఐలాండ్స్‌లో సహజ రంగులను సేకరించే పనిపై ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు కూడా 1878లో కార్మికుల చేతిలో హతమయ్యాడు. అలా ఈ ఐలాండ్స్‌ ఎప్పుడూ హింసాత్మక, నిర్జీవ ప్రాంతంగా ఉండిపోయేది. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత అంటే 1946లో ప్రభుత్వం 300 మంది ఖైదీలతో ఈ ఐలాండ్స్‌లోని ఇస్బెల్లా ఐలాండ్‌లో ఓ కాలనీ ఏర్పాటు చేసింది. వీరితో ఐలాండ్‌ చుట్టూ గోడ నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గోడ నిర్మాణం కోసం ఖైదీలు చాలా దూరం నడుచుకుంటూ వెళ్లి క్వారీల్లో రాళ్లను పగలగొట్టి.. వాటిని మోసుకుంటూ వచ్చి గోడ నిర్మించాల్సి వచ్చేది. అలా రాళ్లను మోసుకుంటూ చాలా మంది ఖైదీలు అనారోగ్యానికి గురై మరణించారు. ప్రభుత్వం తమతో ఇంత వెట్టి చాకిరీ చేయించడాన్ని వ్యతిరేకించిన కొందరు ఖైదీలు 1958లో ఎదురు తిరిగారు. వారికి కాపలా ఉన్న పోలీసులను హతమార్చారు. ఈ క్రమంలో అనేక మంది ఖైదీలు సైతం పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం కాలనీని మూసివేసింది. 

అయితే, ఖైదీలు నిర్మించిన గోడ మాత్రం ఇప్పటికీ ఇస్బెల్లా ఐలాండ్‌లో దర్శనమిస్తుంది. ఆరు మీటర్లు ఎత్తు, వంద మీటర్ల పొడవు ఉన్న ఈ గోడను ఎంతో మంది ఖైదీలు కన్నీరు పెట్టుకుంటూ, చెమటోడుస్తూ నిర్మించారు. అందుకే దీనికి ‘ది వాల్‌ ఆఫ్ టియర్స్‌’అని పేరు పెట్టారు. ఈ ఐలాండ్స్‌ సందర్శనకు వచ్చిన పర్యటకులు కచ్చితంగా ఈ కన్నీటి గోడను సందర్శిస్తుంటారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని