Expensive Mansion : పురాతన భవనం.. అ‘ధర’హో!

అధునాతన సౌకర్యాలతో కూడిన నిర్మాణాలు రూ.వేల కోట్ల ధర పలకడం మామూలే. లండన్‌(London)లో మాత్రం ఓ పురాతన భవనం ఆ ఘనత సొంతం చేసుకుంది. 

Updated : 22 Mar 2023 13:37 IST

(Image : Facebook)

లండన్‌(London)లో 205 ఏళ్ల ఓ పురాతన భవనాన్ని విక్రయానికి పెట్టారు. దాని ధర ఎంతో తెలుసా.. మన భారతీయ కరెన్సీలో అచ్చంగా రూ.2480 కోట్లు. దాంతో ఇది ప్రపంచం(World)లోనే అత్యంత ఖరీదైన పురాతన భవనంగా వార్తల్లో నిలిచింది.

సకల సౌకర్యాల ‘వైట్‌ హౌస్‌’

ఈ భవనాన్ని ‘వైట్ హౌస్‌ ఆఫ్‌ రీజెంట్స్‌ పార్క్‌’ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది చూడటానికి కొంచెం అమెరికా(America) అధ్యక్షుడి భవనం వైట్‌ హౌస్‌(White house)ను పోలి ఉంటుంది. ఈ నివాసానికి దగ్గర్లో ఓ నది ప్రవహిస్తోంది. భవనం లోపల 40 బెడ్‌రూమ్‌లున్నాయి. 8 గ్యారేజీలు, టెన్నిస్‌ కోర్టు, ఆవిరి స్నానం చేసుకునేందుకు ఓ ప్రత్యేకమైన గది, గ్రంథాలయం, అతిపెద్ద డైనింగ్‌ రూమ్‌ వంటి సౌకర్యాలున్నాయి. మొత్తం 29 వేల చదరపు అడుగుల లివింగ్‌ స్పేస్‌ ఉంది.

విక్రయిస్తే రెట్టింపు ధర!

జార్జియాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి జేమ్స్‌ బుర్టన్‌ 1818లో ఈ భవనం నిర్మించారు. ఇందులోనే ఆయన కుటుంబ సభ్యులు నివాసం ఉండేవారు. ఆ తరువాత దీన్ని బెడ్‌ఫోర్డ్‌ కళాశాలగా మార్చారు. కొన్ని దశాబ్దాల పాటు అందులో తరగతులు నడిచాయి. అనంతరం 1980లో మళ్లీ ఒక ప్రైవేటు నివాస స్థలంగా మారింది. అప్పటి నుంచి అనేక మంది చేతులు మారుతూ వస్తోంది. ప్రతి సారి దాని ధర రెట్టింపు అవుతూ ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా దీన్ని రూ.2480 కోట్లకు విక్రయానికి పెట్టారు. ప్రపంచంలో ఇంత ధర పలికిన పురాతన భవనం ఇదేనని చెబుతున్నారు.

నివాసం కాదు.. పెట్టుబడి

గతంలో ఎక్కువ మొత్తంలో అప్పులు చేసిన దీని యజమానులు.. వాటిని తీర్చేందుకు ఈ భవనాన్ని పలుమార్లు విక్రయిస్తూ వచ్చారు. ఈ క్రమంలో దాని రేటు కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. చాలా మంది ఈ భవనాన్ని కొనుగోలు చేసినా ఇందులో నివాసం ఉండేవారు కాదు. దీన్ని ఓ పెట్టుబడిగా చూస్తూ మంచి ధర వస్తే వేరొకరికి విక్రయించడానికి సిద్ధపడేవారు. ప్రస్తుతానికి ఈ రెండు అంతస్తుల భవనమే ప్రపంచంలో అత్యంత ఖరీదైన పురాతన భవనంగా భావిస్తున్నారు.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని