Restaurant : కొండంత రెస్టారెంట్.. 5800 మంది విందు ఆరగించొచ్చు!

సాధారణంగా ఏ రెస్టారెంట్‌లో (Restaurant)అయినా పదుల సంఖ్యలో వెళ్లి తినడానికి వసతి ఉంటుంది. మరీ పెద్దవి అయితే వందల మంది వెళ్లి తినొచ్చు. కానీ చైనాలోని (China)ఓ రెస్టారెంట్‌లో ఒకేసారి 5800 మంది విందు ఆరగించవచ్చట. ఆ సంగతేంటో చదివేయండి.

Updated : 14 May 2023 10:52 IST

(Image :guinnessworldrecords.com)

చైనాలోని (China)చాంగ్‌క్వింగ్‌ పట్టణానికి సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌పాట్‌ రెస్టారెంట్‌ (Restaurant)ఉంది. ‘హాట్‌పాట్‌’అంటే కొందరు సమూహంగా ఏర్పడి టేబుల్‌ మధ్య పాత్ర పెట్టి ఏదైనా వంటకం (Food)వండుకుంటారు. తరువాత దాన్ని వడ్డించుకుని, కబుర్లు చెబుతూ తింటారు. ప్రస్తుతం వండే పరిస్థితి లేదు కాబట్టి కేవలం చెఫ్‌లు తయారు చేయగా.. తెచ్చిపెట్టిన ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ కొండపైనున్న ఈ రెస్టారెంట్‌లో సుమారు 900 టేబుళ్లున్నాయి. ఏకకాలంలో వాటిపై 5800 మంది విందు ఆరగించవచ్చని దాని నిర్వాహకులు చెబుతున్నారు.

చాంగ్‌క్వింగ్‌ రెస్టారెంట్‌ హాట్‌పాట్‌కు చాలా ప్రసిద్ధి. కొండప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ అసలు పేరు పిపా యువాన్‌. మొత్తం 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇందులో ఎవరైనా టేబుల్ బుక్‌ చేసుకుంటే అదెక్కడుందో కనుక్కోవడానికి ఒక మనిషి సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇది అతి పెద్ద హాట్‌ పాట్‌ రెస్టారెంట్‌గా ఖ్యాతి గడించింది. గతేడాది గిన్నిస్‌ బుక్‌లో కూడా చోటు సంపాదించింది. పిపా యువాన్‌లో కస్టమర్లు ఎవరు ఆర్డర్‌ పెట్టినా ఆ వంటకం తీసుకురావడానికి కనీసం 30 నిమిషాలు సమయం పడుతుంది. అయినా ఇక్కడకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. రిజర్వేషన్‌ చేసుకోకుండా వస్తే వేసవి కాలంలో ఇక్కడ టేబుల్ దొరకడం అసాధ్యమట. చైనా నలుమూలల నుంచి పర్యాటకులు ఈ రెస్టారెంట్‌కు తరలివస్తుంటారు. 

ఒక్క రెస్టారెంట్‌లో నిత్యం టన్నుల కొద్దీ వంటలు తయారు చేస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే ఇక్కడ  వెయిటర్లు, కుక్‌లు, కిచెన్‌లో పని చేసే సిబ్బంది అంతా కలిపి వందల సంఖ్యలో ఉంటారు. కేవలం క్యాషియర్లే 25 మంది దాకా ఉన్నారట. ఇక్కడ పగలు, రాత్రి అనే తేడా ఉండదు. చాలా మంది టూరిస్టులు రాత్రి పూటే వస్తుంటారు. ఎందుకంటే ఆ సమయంలో కొండ మొత్తాన్ని వివిధ రకాల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరిస్తారు. ఆ సందడి ఓ జాతరను తలపిస్తుంటుంది. ఇంత బిజీగా ఉన్న రెస్టారెంట్‌లో అసలు రుచి ఉంటుందా అని అనుమానం వస్తుంది. కానీ, ఆన్‌లైన్‌లో మాత్రం నెటిజన్లు దీనికి మంచి రివ్యూలే ఇస్తున్నారు. రద్దీ వేళల్లో ఆహారం తీసుకురావడం కాస్త ఆలస్యమైనప్పటికీ రుచిలో మాత్రం రెస్టారెంట్ నిర్వాహకులు రాజీ పడబోరని చెబుతున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని