No Railway Station : ఇప్పటి వరకూ రైలు కూత వినని రాష్ట్రమిదే..!

దేశంలోని పలు రాష్ట్రాల్లో వందేభారత్‌, శతాబ్ది, రాజధాని వంటి రైళ్లు వందల కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఒక్క రైలు కానీ.. రైల్వేస్టేషను కూడా లేని రాష్ట్రం ఒకటి ఉందంటే నమ్ముతారా? అదే ఈశాన్య రాష్ట్రం సిక్కిం.

Updated : 21 Feb 2023 11:04 IST

ప్రస్తుతం దేశంలో రైల్వేస్టేషను లేని రాష్ట్రం సిక్కిం(sikkim) మాత్రమే. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినా ఈ రాష్ట్రం ఇంకా ఏ రైల్వే(railway) వ్యవస్థతోనూ అనుసంధానం కాలేదు. సిక్కింలో రవాణా మొత్తం రోడ్డు మార్గం గుండానే సాగుతుంది. ఎన్‌హెచ్‌10 జాతీయ రహదారి ద్వారా ఇతర రాష్ట్రాల వాహనాలు సరిహద్దులు దాటుతుంటాయి. ఆరు లక్షలకు పైగా జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో ఎవరైనా రైలు ఎక్కాలంటే మాత్రం పొరుగున ఉన్న పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి సిలిగుడి, జల్పాయ్‌గుడి స్టేషన్ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. 

ఇన్నాళ్లు ఎందుకు?

సిక్కింకు ఇన్నాళ్లూ రైల్వే లైను లేకపోవడానికి ప్రధాన కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులేనని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలోని చాలావరకు ప్రాంతాలు ఎత్తయిన పర్వతాలపై ఉంటాయి. గతంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అలాంటి క్లిష్టమైన చోట్ల రైల్వేలైను ఏర్పాటు చేయడానికి తోడ్పడలేదు. 2008లో రైల్వేశాఖ.. పశ్చిమబెంగాల్‌ను(west bengal) సిక్కింతో కలిపేందుకు సివోక్‌-రాంగ్‌పో రైలు మార్గం నిర్మాణం దిశగా అడుగులు వేసింది. వన్యప్రాణులు సంచరించే అభయారణ్యాలు, కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉండటం, నిధుల కేటాయింపులో జాప్యం కారణంగా ప్రాజెక్టుకు అనుమతులు రావడంలో ఆలస్యమైంది. 2016లో అడ్డంకులు తొలగిపోవడంతో పనులు వేగవంతమయ్యాయి. 2021 నాటికే ప్రాజెక్టు(railway project) పూర్తవుతుందని అంచనా వేసినా కరోనా కారణంగా ఆ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పటికీ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.

త్వరలోనే రైలు కూత..

పశ్చిమబెంగాల్‌ నుంచి సిక్కిం కలిసేలా సివోక్‌-రాంగ్‌పో రైల్వే మార్గం నిర్మాణం పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఐక్రాన్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఈ పనులు చేపడుతోంది. సివోక్‌-రాంగ్‌పో లైన్‌ పూర్తయితే రెండో దశలో గ్యాంగ్‌టక్‌కు రైళ్ల రాకపోకలు సాధ్యమవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. మహానంద అభయారణ్యం ప్రాంతం గుండా వెళ్లే ఈ మార్గంలోని రైల్వే లైనుకు అనుమతి కఠిన ఆంక్షలతో లభించింది. ట్రాక్‌పై రైళ్ల వేగపరిమితి, పట్టాలపై వన్యప్రాణుల సంచారం గురించి తెలిసేలా సెన్సర్ల అమరిక తదితర రక్షణ చర్యలు తీసుకుంటూ పనులు చేయాలని గుత్తేదారుకు ప్రభుత్వం నిర్దేశించింది. సిక్కింలో రైల్వే వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుందనే మాటలు గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పనులు చకచకా జరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని