Empire: చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాలివే!

ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్న దేశాలన్నీ ఒకప్పుడు ఏదో ఒక సామ్రాజ్యంలో భాగంగానే ఉండేవి. ఒక ప్రాంతానికి చెందిన చక్రవర్తులు.. తమ సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కాంక్షతో ఇతర రాజ్యాలను భయపెట్టో, యుద్ధం చేసో, ఆశ చూపో సొంతం చేసుకునేవారు.

Published : 14 Nov 2021 16:35 IST

ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్న దేశాలన్నీ ఒకప్పుడు ఏదో ఒక సామ్రాజ్యంలో భాగంగానే ఉండేవి. ఒక ప్రాంతానికి చెందిన చక్రవర్తులు.. తమ సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కాంక్షతో ఇతర రాజ్యాలను భయపెట్టో, యుద్ధం చేసో, ఆశ చూపో సొంతం చేసుకునేవారు. అలా ప్రపంచంలోని అనేక రాజ్యాలు ఇతర రాజ్యాలలో కలిసి పెద్ద పెద్ద సామ్రాజ్యాలుగా ఆవిర్భవించాయి. అలా చరిత్రలో అత్యధిక శాతం భూమిని స్వాధీనం చేసుకొని అతిపెద్ద సామ్రాజ్యాలుగా ఓ వెలుగు వెలిగిన కొన్ని రాజ్యాలున్నాయి. అవేవో చూద్దామా..!

బ్రిటీష్ సామ్రాజ్యం (1600-1960)

భారత్‌ను పరిపాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్నే ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యంగా చరిత్రకారులు చెబుతుంటారు. 13.71 మిలియన్‌ చదరపు మైళ్ల విస్తీర్ణం అంటే.. భూమి విస్తీర్ణంలో 26శాతాన్ని బ్రిటీష్ పాలకులే పరిపాలించారు. 1920-30 మధ్య కాలంలో బ్రిటీష్‌ సామ్రాజ్యంలో 45.8కోట్ల మంది ఉండేవారు. ఇది అప్పటి ప్రపంచ జనాభాలో 20శాతం. ఇంగ్లాండ్‌ కేంద్రంగా పాలన సాగిన ఈ రాజ్యం ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు, కాలనీలు ఏర్పాటు చేసుకుంటూ, నెమ్మదిగా వాటిని స్వాధీనం చేసుకునేది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో చాలా ప్రాంతాలను బ్రిటన్‌ పాలించింది. అయితే మొదటి ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటీష్‌ సామ్రాజ్యానికి కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి దాని ఆధిపత్యం తగ్గుముఖం పట్టింది. వలస దేశాలన్నీ బ్రిటీష్ చెర నుంచి విముక్తి పొందుతూ స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత బ్రిటీష్ పాలన కుప్పకూలిపోయింది. కానీ ఇప్పటికీ బ్రిటీష్‌ సామ్రాజ్యం నామమాత్రంగా కొనసాగుతుండటం గమనార్హం.


మంగోల్‌ సామ్రాజ్యం (1206 - 1368)

బ్రిటీష్‌వాళ్లకు ముందు అత్యధిక భూభాగాన్ని పరిపాలించింది మంగోల్‌ సామ్రాజ్యమే. మంగోలియా చక్రవర్తులు ఇతర రాజ్యాలపై దండెత్తుతూ 9.27మిలియన్‌ చదరపు మైళ్ల(భూ విస్తీర్ణంలో 17శాతం) మేరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 1270-1309 కాలంలో మంగోల్‌ సామ్రాజ్యంలో 11కోట్ల జనాభా ఉండేది. అంటే అప్పటి ప్రపంచ జనాభాలో 25శాతం. చెంఘీజ్‌ఖాన్‌ పాలనలో మంగోలియా సామ్రాజ్యం అనేక రాజ్యాలపై విజయం సాధించింది. చైనా, రొమానియా, పాకిస్థాన్‌, సైబీరియా, ఉక్రెయిన్‌, బెలారస్‌, జార్జియా, పర్షియా, ఇరాక్‌, మధ్య ఆసియా, రష్యాలోని అత్యధిక భాగం మంగోలియా రాజ్యంలో భాగమయ్యాయి. అయితే 1331లో బ్యుబోనిక్‌ ప్లేగ్‌ (బ్లాక్‌ డెత్‌) ప్రబలడం, చక్రవర్తులు హత్యలకు గురికావడంతో రాజ్య నిర్వహణ, ప్రజల సంరక్షణ చేపట్టడం చేతకాక నెమ్మదిగా మంగోలియా సామ్రాజ్యం అంతమైపోయింది.


రష్యన్‌ సామ్రాజ్యం (1721 - 1917)

రష్యన్‌ సామ్రాజ్యం 17వ శతాబ్దంలో భారీగా భూభాగాన్ని స్వాధీనపరచుకుంది. ఆసియా, యూరోప్‌లో కొంతభాగాన్ని, ఉక్రెయిన్‌, బెలారస్‌, మోల్డోవా, ఫిన్లాండ్‌, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌, జార్జియా.. ఇలా అనేక ప్రాంతాలు రష్యన్‌ సామ్రాజ్యం అధీనంలోకి వెళ్లాయి. 8.80 మిలియన్ చదరపు మైళ్ల(భూ విస్తీర్ణంలో 16.92శాతం)మేరకు ఈ సామ్రాజ్యం విస్తరించింది. 1913లో రష్యన్‌ సామ్రాజ్య జనాభా 17.6కోట్లు. 1917లో రష్యా విప్లవంతో ఆ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. దాని స్థానంలో యూనియన్‌ ఆఫ్‌ సోవియేట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌ పేరుతో వివిధ దేశాలు కలిసి ఒక్కటిగా ఏర్పడ్డాయి.


క్వింగ్‌ సామ్రాజ్యం (1636 - 1912/17)


(Photo:wikipedia)

చైనాలో మంగోలియా రాజ్యం పతనమయ్యాక మళ్లీ అంతటి పేరు సంపాదించింది క్వింగ్‌ సామ్రాజ్యమే. చైనాలో ఇదే చివరి రాజ్యం. ప్రస్తుత చైనాతోపాటు మంగోలియా, రష్యాలో కొంతభాగాన్ని క్వింగ్‌ సామ్రాజ్యం పరిపాలించింది. మొత్తంగా 5.68మిలియన్‌ చదరపు మైళ్ల (భూ విస్తీర్ణంలో 10.91శాతం) వరకు ఇది విస్తరించింది. 19వ శతాబ్దంలో క్వింగ్‌ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. 1851 సమయంలో ఈ రాజ్య జనాభా 43.2కోట్లు. 20వ శతాబ్దంలో ఈ సామ్రాజ్యం అంతరించి, రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ప్రభుత్వం ఏర్పడింది.


స్పానిష్ సామ్రాజ్యం (1492 - 1976)

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 దేశాల్లో స్పానిష్‌ సామ్రాజ్యం విస్తరించింది. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూ మెక్సికోతో పాటు మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని అనేక దేశాలపై స్పెయిన్‌ గుత్తాధిపత్యం చెలాయించింది. మొత్తంగా 5.29 మిలియన్‌ చదరపు మైళ్లు(భూ విస్తీర్ణంలో 10.17శాతం) స్పెయిన్‌ సొంతమైంది. 1740-90 మధ్య స్పానిష్ సామ్రాజ్యంలో 6.82కోట్ల జనాభా ఉండేది. 1898లో జరిగిన స్పానిష్‌-అమెరికన్‌ యుద్ధం తర్వాత ఆ సామ్రాజ్యం క్రమంగా పతనమైంది. ఇవే కాకుండా చరిత్రలో అనేక మంది సామ్రాట్టులు వివిధ కాలాల్లో, వివిధ రాజ్యాలను ఆక్రమించి తమ సామ్రాజ్యాలను విస్తరించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని