అత్యధిక జీవన వ్యయమున్న దేశాలివీ..!
గ్రామాలతో పోలిస్తే.. నగరాల్లో జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్) ఎక్కువగానే ఉంటుంది. ఇంటి అద్దె, జీవనశైలి, ఖర్చులు, నిత్యవసరాల ధరల్లో వ్యత్యాసం ఉండటమే ఇందుకు కారణం. మన దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాలైన దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి
ఇంటర్నెట్ డెస్క్: గ్రామాలతో పోలిస్తే.. నగరాల్లో జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్) ఎక్కువగానే ఉంటుంది. ఇంటి అద్దె, జీవనశైలి, ఖర్చులు.. ఇలా చాలా కారణాలున్నాయి. మన దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాలైన దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి సహా హైదరాబాద్, బెంగళూరు, తదితర నగరాల్లో జీవన వ్యయం అధికంగా ఉంటుందని అందరికీ తెలుసు. అలాగే.. ప్రపంచ దేశాల్లో అత్యధిక జీవన వ్యయం ఉన్న టాప్‌టెన్ నగరాల జాబితాను ‘ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ)’ సంస్థ ఇటీవల విడుదల చేసింది. కొవిడ్ కారణంగా పలు నగరాల్లో నిత్యవసర వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు, జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయ కరెన్సీ విలువలోనూ మార్పులు జరిగాయి. దీంతో కరోనా కాలంగా మారిన 2020 ఏడాదికి గానూ దాదాపు 90 దేశాల్లోని 130 నగరాల్లో సుమారు 140 వస్తువుల ధరలు, రవాణా వ్యయం, అద్దె, పాఠశాల ఫీజులు, ఇతర సేవలకయ్యే ఖర్చులు తదితర అంశాల ఆధారంగా అత్యధిక జీవన వ్యయమున్న నగరాల జాబితాను రూపొందించింది. మరి ఆ నగరాలేవో తెలుసుకుందాం పదండి..
1. జ్యూరిక్, స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ ఆర్థిక రాజధాని జ్యూరిక్. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూపొందించిన అత్యధిక జీవన వ్యయం గల నగరాల్లో తొలి ర్యాంక్‌తో ప్రథమ స్థానంలో ఉంది. వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో జ్యూరిక్ నగరానికి 103 పాయింట్లు వచ్చాయి. దాదాపు 4,34,335 జనాభా ఉన్న ఈ నగరంలో అత్యధిక బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ సంస్థలున్నాయి. ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్న ఈ నగరంలో జీవన వ్యయం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ అద్దె, రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. లివింగ్ కాస్ట్.ఓఆర్‌జీ వెబ్‌సైట్ నివేదికల ప్రకారం.. ఈ నగరంలో నెలకి ఒక్కరికి అయ్యే ఖర్చు సుమారు 2,914 యూఎస్ డాలర్లు (₹2.14లక్షలు)గా ఉంటుంది.
2. పారిస్, ఫ్రాన్స్
పారిస్.. ఫ్రాన్స్ రాజధాని మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యధిక మంది టూరిస్టులు పర్యటించే ప్రాంతాల్లో ఒకటి. ఈ నగరంలో దాదాపు 12,278,210 మంది జనాభా ఉండగా.. ఏటా ఇక్కడి జనాభాకు కొన్ని రెట్ల సంఖ్యలో పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. 17వ శతాబ్దం నుంచే ఈ పారిస్ నగరం ఆర్థికం, వాణిజ్యం, ఫ్యాషన్, సైన్స్, ఆర్ట్స్, పర్యటక రంగాలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న ఈ నగరంలో జీవన వ్యయం కూడా జ్యూరిక్‌కు సమానంగా ఉంది. అందుకే జాబితాలో ఈ నగరానికి ఈఐయూ ఒకటో ర్యాంక్ కేటాయించింది. వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లోనూ పారిస్‌కు 103 పాయింట్లు వచ్చాయి.
3. హాంకాంగ్, చైనా
చైనా ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉన్న హాంకాంగ్ ప్రపంచంలో అత్యధిక జీవన వ్యయమున్న మూడో నగరం. అయితే, వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లోనూ పారిస్‌కు 103 పాయింట్లు ఉండటంతో దీనికి కూడా ఈయూఐ ఒకటో ర్యాంక్ ఇచ్చింది. ఈ నగరంలో వివిధ దేశాలకు చెందిన 75లక్షల మంది నివసిస్తున్నారు. ఉద్యోగరీత్యా వచ్చి స్థిరపడిన వారూ ఉన్నారు. అత్యధిక వేతనాలే కాదు, రియల్ ఎస్టేట్, ఖరీదైన జీవనశైలి ఈ నగరం సొంతం. ఈ నగరంలో జీవించాలంటే ఒక్కరికి నెలకు కనీసం 2,624 యూఎస్ డాలర్లు(₹1.93లక్షలు) ఖర్చవుతోందట.
4. సింగపూర్
సింగపూర్ భౌగోళికంగా చిన్న దీవి అయినా.. అత్యంత ధనికులున్న దేశంగా పేరుంది. ఇక్కడ 57లక్షల జనాభా ఉంటే.. దాదాపు 23లక్షల మంది విదేశీయులే స్థిరపడటం విశేషం. సింగపూర్ ఖరీదైన వస్తువులకు, విలాసవంతమైన హోటళ్లకు పెట్టింది పేరు. వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉండే ఈ దేశం/నగరం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో 102 పాయింట్లతో.. ఈఐయూ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.
5. టెల్ అవీవ్, ఇజ్రాయిల్
ఇజ్రాయిల్‌లోని ఈ నగరం అత్యధిక జీవన వ్యయమున్న నగరాల జాబితాలో చోటు దక్కించుకుంది. టెల్ అవీన్ నగరం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో 101 పాయింట్లతో ఈఐయూ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ నగరంలో దాదాపు 4,60,613 మంది నివసిస్తున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశంలో ఆర్థిక, సాంకేతిక రంగాలకు టెల్ అవీవ్ కేంద్రం బిందువుగా నిలిచింది.
6. ఒసాకా, జపాన్
వినూత్న సాంకేతిక ఆవిష్కరణలో ఎప్పుడూ ముందుంటుంది జపాన్. ఇక్కడ సాంకేతిక రంగంలో ఉద్యోగవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో స్థానిక జనాభాతోపాటు ఇతర దేశస్థులు కూడా ఈ దేశంలో నివసిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి మెట్రోపాలిటన్ ప్రాంతమైన ఒసాకా మహానగరంలో దాదాపు 2కోట్ల జనాభా ఉంది. ఈ ప్రాంతం ఎకనామిక్ హబ్‌గానూ దూసుకెళ్తోంది. ప్యానసోనిక్, షార్ప్ వంటి ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలు అధికంగా ఉన్న ఈ నగరంలో జీవన వ్యయం కూడా అంతే ఎక్కువగా ఉంటోంది. కాస్ట్‌ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో 101 పాయింట్లు కలిగిన ఒసాకా నగరం.. ఈఐయూ జాబితాలో ఐదో ర్యాంక్ దక్కించుకుంది.
7. జెనీవా, స్విట్జర్లాండ్
టాప్‌టెన్ అత్యధిక జీవన వ్యయమున్న నగరాల్లో రెండు నగరాలు స్విట్జర్లాండ్‌లోనే ఉండటం గమనార్హం. జ్యూరిక్ నగరంతోపాటు జెనీవా కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది. దేశంలో జ్యూరిక్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన జెనీవాకు గ్లోబల్ సిటీగాను పేరుంది. ఐక్యరాజ్య సమితి, రెడ్‌క్రాస్ తదితర అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. అంతర్జాతీయ సమావేశాలు ఎక్కువసార్లు నిర్వహించిన నగరంగానూ దీనికి గుర్తింపు ఉంది. ఇక్కడ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ.. ఖర్చులు ఎక్కువే. అందుకే జీవన వ్యయం జాబితాలో జెనీవా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 100 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
8. న్యూయార్క్, యూఎస్
అమెరికాలో అత్యధిక జనాభా ఉన్న నగరం న్యూయార్క్. ఈ నగరంలో గతేడాది జనాభా లెక్కల ప్రకారం 83.33లక్షల మంది నివసిస్తున్నారు. న్యూయార్క్ మహానగరాన్ని మినీ ప్రపంచంగా.. సంస్కృతి, ఆర్థికం, మీడియా రంగాలకు రాజధానిగా పేర్కొంటారు. అంతేకాదు.. వినోదం, వాణిజ్యం, పరిశోధన, సాంకేతిక, విద్య, రాజకీయాలు, పర్యటక రంగాలపై ఈ నగరం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ దౌత్యానికి న్యూయార్క్ నగరమే కీలకం. అత్యధిక జీవన వ్యయమున్న జాబితాలో ఈ నగరం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో 100 పాయింట్లతో ఏడో ర్యాంకులో ఉంది.
9. కోపెన్ హాగెన్, డెన్మార్క్
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో 7,94,128 మంది నివసిస్తున్నారు. చిన్నారులకు చెప్పే కథల్లో చాలా వరకు ఈ ప్రాంతంలో రచించినవేనని చరిత్రకారులు చెబుతుంటారు. ఆనంద నగరాల జాబితాలోనూ ఈ నగరం చోటు సంపాదించుకుంది. కెనాల్స్, రుచికరమైన ఆహారం, ఉద్యనవనాలకు ఈ నగరం ఫేమస్. ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ నగరం పర్యటకం పరంగా కూడా అభివృద్ధి చెందింది. జీవన వ్యయాల జాబితాలో కోపెన్‌హాగెన్‌కు ఈఐయూ తొమ్మిదో ర్యాంక్ ఇచ్చింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో ఈ నగరానికి 96 పాయింట్లు ఉన్నాయి.
10. లాస్ ఏంజిల్స్, యూఎస్
లాస్ ఏంజిల్స్.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే.. లాస్ ఏంజిల్స్‌లో 40లక్షల జనాభా ఉంటుందని అంచనా. హాలీవుడ్ సినీ పరిశ్రమ ఈ నగరంలోనే ఉంది. సినీతారలు, సెలబ్రిటీలు చాలావరకు ఇక్కడే నివసిస్తుంటారు. అయితే, జీవన వ్యయాల జాబితాలో లాస్ ఏంజిల్స్ పదో స్థానమైనా.. ఈఐయూ ఈ నగరానికి తొమ్మిదో ర్యాంక్ కేటాయించింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో కోపెన్‌హాగెన్‌లాగే 96 పాయింట్లు దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Disease X: మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది: బ్రిటన్ శాస్త్రవేత్తలు
-
IND w Vs SL w: జెమీమా, మంధాన కీలక ఇన్నింగ్స్‌లు.. భారత్ స్కోరు 116/7
-
2000 Note: ₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Trump: ట్రంప్ కంటే బైడెన్ వెనుకంజ..! తాజా సర్వే ఏం చెప్పిందంటే..?
-
Asian Games: రోయింగ్‌లో మెరిసిన భారత్.. ఐదు పతకాలు సొంతం..