ఇలాంటి వాటికీ ట్రేడ్‌మార్క్ ఉంటుందా?
మన దేశంలో బజాజ్, రేమాండ్స్, కిట్‌క్యాట్, మైక్రోసాప్ట్, ఇన్ఫోసిస్, టయోటా, ఫోర్డ్ లాంటి చాలా సంస్థలకు ట్రేడ్‌మార్క్‌లు ఉన్నాయి. అయితే ప్రపంచంలో చాలా వింతగా మాటలకు, రంగులకు, వ్యక్తుల పేర్లకు, ఫొటో పోజ్‌లకు.. ఇంకా చాలా నమ్మలేని విషయాలకి ట్రేడ్‌మార్క్‌లు ఉన్నాయని...
దేనికైనా ట్రేడ్‌మార్క్ ఉందంటే అది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైనదిగా గుర్తించారని అర్థం. సంస్థలు మార్కెట్లో తాము ప్రత్యేకమని తెలుపుకొనేందుకు లోగో డిజైన్, తమ వస్తువులకు ట్రేడ్‌మార్కును పొందుతాయి. మన దేశంలో బజాజ్, రేమాండ్స్, కిట్‌క్యాట్, మైక్రోసాప్ట్, ఇన్ఫోసిస్, టయోటా, ఫోర్డ్ లాంటి చాలా సంస్థలకు ట్రేడ్‌మార్క్‌లు ఉన్నాయి. అయితే ప్రపంచంలో చాలా వింతగా మాటలకు, రంగులకు, వ్యక్తుల పేర్లకు, ఫొటో పోజ్‌లకు.. ఇంకా చాలా నమ్మలేని విషయాలకి ట్రేడ్‌మార్క్‌లు ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో ఓ సారి చూద్దాం..
పదాలు కూడా ట్రేడ్‌మార్కే!
‘దట్స్ హాట్’ అనే పదాలని డీజే ప్యారిస్ హిల్టన్ అనే నటి.. తను చేసే రియాలిటీ టీవీ షోలో ఉపయోగించింది. తన నోటి నుంచి వచ్చిన ఆ మాటలు చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అందుకే తను ఆ పదాలను ట్రేడ్‌మార్క్ చేసింది. హాల్‌మార్క్ రూపొందించిన గ్రీటింగ్ కార్డులో ఈ పదాలని ఉపయోగించినందుకు ఆ సంస్థపై కేసు కూడా వేసింది.
వెలుగులు విరజిమ్మే ఈఫిల్ టవర్‌కూ..
ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రపంచ వింతల్లో ఒకటి. అయితే, దీనికి మరో వింత కూడా ఉంది. ఈఫిల్ టవర్ దగ్గర మీరెన్ని ఫొటోలయిన తీసుకోవచ్చు. కానీ రాత్రి వేళల్లో విద్యుత్తు దీపాల వెలుగుల్లో తళతళా మెరిసిపోయే ఈఫిల్ టవర్‌ని ఫొటో తీయడం గానీ ఆ ఫొటోని ఎవరికైనా అమ్మడానికి గానీ వీలులేదు. ఎందుకంటే రాత్రులు వెలుగులు విరజిమ్మే ఈఫిల్ టవర్‌కి ట్రేడ్‌మార్క్ ఉంది. ఒక వేళ మీరు ఈ ఫొటోను అమ్మాలంటే ‘సొసైటీ డి ఎక్స్‌ప్లొయిటేషన్ డి లా టూర్ ఈఫిల్’ అనే సంస్థ నుంచి అనుమతి పొందాల్సిందే.
ఉసేన్ బోల్ట్ పోజ్‌కూ..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ అంటే తెలియని వారు ఉండరేమో. కానీ ఇతను ఓ సారి ఫొటోకి ఇచ్చిన పోజ్‌కు కూడా ట్రేడ్‌మార్క్ ఉంది. అంతేకాదు, అతను తన పేరును, సంతకాన్ని కూడా ట్రేడ్‌మార్క్ చేసుకున్నారట.
చాక్లెట్ కవరు రంగు..
‘మిల్క్ చాక్లెట్ రీస్ పీనట్ బటర్ కప్’ అనే చాక్లెట్ కవరు మీదున్న నారింజ రంగుకి కూడా ట్రేడ్‌మార్క్ ఉంది. ఈ రంగును ఏ సంస్థ వాడాలన్నా వీరి దగ్గర అనుమతి తీసుకోవాల్సిందే.
వ్యాఖ్యాత మాటకి ట్రేడ్‌మార్క్
‘లెట్స్ గెట్ రెడీ టు రంబుల్’ అనే మాటని మొదటగా ప్రఖ్యాత బాక్సింగ్, రెజ్లింగ్ వ్యాఖ్యాత మైఖేల్ బఫర్ అన్నారు. ఆయన 1992లో ఈ మాటకి ట్రేడ్‌మార్క్ చేయించారు. అప్పటి నుంచి ఈ మాటని ఉపయోగించడానికి ఇచ్చిన అనుమతులతోనే ఏకంగా రూ. 2,800 కోట్లపైనే సంపాదించారంటే నమ్మగలరా!
ఫేస్ అనే పదం ఫేస్‌బుక్ సొంతం
ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఫేస్‌బుక్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే ఈ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తన సంస్థ పేరులోని ‘ఫేస్’ అనే పదాన్ని ట్రేడ్‌మార్క్‌గా రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు ఈ పదం ఫేస్‌బుక్ సొంతం. అయితే, సామాజిక మాధ్యమాల్లో పోటీదారులుగా ఉన్నవారు ఉపయోగించాలంటేనే ఇది వర్తిస్తుంది.
శ్వాసించే శబ్దానికీ..
ఓ మనిషి శ్వాస పీల్చి వదిలే శబ్దానికి కూడా ట్రేడ్‌మార్క్ ఉందంటే నమ్మగలరా?లుకాస్ చిత్రంలో నటించిన డార్త్ వాడర్ అనే వ్యక్తి అనాకిన్ స్కైవాకర్‌లా హెల్మెట్ పెట్టుకుని గాలి పీల్చి వదిలిన శబ్దానికి ఆ చిత్ర యాజమాన్యం ట్రేడ్‌మార్క్ చేయించింది. ఈ శబ్దం స్కూబా రెగ్యులేటర్‌తో శ్వాస తీసుకొని వదిలినప్పుడు రికార్డు చేశారట.
‘స్లైడ్ టు అన్‌లాక్’ వాడాలంటే యాపిల్‌కి చెల్లించాల్సిందే!
యాపిల్ ఫోన్లలో మాత్రమే కనిపించే ఈ ‘స్లైడ్ టు అన్‌లాక్’ అనే ఆప్షన్‌కి ట్రేడ్‌మార్క్ ఉంది. దీనిని వాడాలంటే ఈ సంస్థ అనుమతి తీసుకోవాల్సిందే. తమ అనుమతి లేకుండా శాంసంగ్ ఫోన్లలో ఈ ఆప్షన్‌ని వాడినందుకు ఆ సంస్థపై 119.6 మిలియన్ డాలర్లు కట్టాలని కేసు పెట్టింది. ఈ కేసులో శాంసంగ్ సంస్థ ఓడిపోయి భారీ మూల్యాన్ని చెల్లించక తప్పలేదు. అలాగే ఐఫోన్ వినియోగించినప్పుడు ‘చిమ్’ అనే శబ్దం వస్తుంది. ఈ శబ్దానికి కూడా యాపిల్ సంస్థ ట్రేడ్‌మార్క్ తీసుకుంది.
ఫుట్‌బాల్ మైదానం నేల రంగుకి..
అమెరికాలోని బోయిస్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఉన్న ఫుట్‌బాల్ మైదానం ప్రత్యేకంగా నీలి రంగులో ఉంటుంది. అయితే, ఈ రంగుకి వారు ట్రేడ్‌మార్క్ చేసుకున్నారు. ఎవరైనా వారి ఫుట్‌బాల్ స్టేడియాన్ని ఇలాంటి నీలి రంగులోకి మార్చాలంటే వీరి అనుమతి తప్పనిసరి. అదీకాక, ప్రపంచంలోనే ఆకుపచ్చని పచ్చిక లేని మైదానంగా ఇది నిలిచింది.
బార్బీ బొమ్మ రంగు కూడా ట్రేడ్‌మార్కే!
అమెరికాలో తయారుచేసిన బార్బీ బొమ్మలంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమే. అలాంటి బార్బీ బొమ్మకి ఇష్టమైన పింక్ రంగుకి కూడా ట్రేడ్‌మార్క్ ఉంది. అధికారికంగా ‘పాంటోన్ 219సీ’ అని పిలిచే ఈ పింక్ షేడ్‌కి సంస్థ ట్రేడ్‌మార్క్ తీసుకుంది. ఈ రంగును ఆర్‌సీఏ అనే సంస్థ బార్బీ బొమ్మలను ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించిందని ఆ సంస్థపై కేసు పెట్టింది.
న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బెల్ రింగు..
అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఓపెనింగ్, క్లోజింగ్ బెల్ రింగుకి కూడా ట్రేడ్‌మార్క్ ఉంది. ఎవరైనా వారి అనుమతి లేకుండా ఈ శబ్దాన్ని ఉపయోగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
వ్యక్తి పేరుకూ..
ఫుడ్ నెట్‌వర్క్ స్టార్‌గా పిలిచే గై ఫియరీ అనే అతని పేరుకు కూడా ట్రేడ్‌మార్క్ ఉంది. అతడు తన పేరును ఇంటర్నేషనల్ క్లాజ్ 30 కింద ట్రేడ్‌మార్క్ చేయించుకున్నాడు. ఇతని పేరుని ఏ ఆహార ఉత్పత్తుల్లోనూ ఉపయోగించకూడదు. అదీకాక అతను వాడిన ‘ఫ్లేవర్ టౌన్’ అనే పదాలని కూడా ఉపయోగించడానికి వీలులేదు. ఎందుకంటే అతను ఈ పదాలకి కూడా ట్రేడ్‌మార్క్ చేయించాడు.
పింగ్-పాంగ్ అంటే టేబుల్ టెన్నిసే!
టేబుల్ టెన్నిస్ అంటే ఓ క్రీడ అని అందరికీ తెలిసిందే. కానీ దాని ముందుపేరు పింగ్-పాంగ్ అని ఎంతమందికి తెలుసు? కానీ పింగ్-పాంగ్ పేరును ‘పార్కర్ బ్రదర్స్’ అనే గేమ్స్ కంపెనీ ట్రేడ్‌మార్క్ చేసింది. దాంతో ఈ క్రీడకు టేబుల్ టెన్నిస్ అనే పేరు స్థిరపడిందట!
ఆభరణాల కంపెనీ అట్టపెట్టె రంగుకూ..
టిఫనీ అనే ఆభరణాల కంపెనీ వాడే చిన్న అట్టపెట్టెపై ఉండే ప్రత్యేకమైన నీలి రంగుకి ట్రేడ్‌మార్క్ ఉంది. దీనిని టిఫనీ బ్లూ అంటారు. ఈ రంగుని వాడాలంటే ఆ సంస్థ అనుమతి తీసుకోవాల్సిందే.
ధరకూ ట్రేడ్‌మార్క్
ఎక్కడైనా ధరకి ట్రేడ్‌మార్క్ ఉంటుందా.. అని ఆలోచిస్తున్నారా? రాపర్ 50 సెంట్ అనే వ్యక్తి తన పేరులోని 50 సెంట్ అనే పదాలకి ట్రేడ్‌మార్క్ చేయించాడు. 50 సెంట్ అనే పేరు వాడుకోవాలంటే అతని అనుమతి తీసుకోవాల్సిందే.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
MiG 21: 2025 నాటికి మిగ్-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్ చీఫ్ మార్షల్
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం