వీటికి కూడా జరిమానా విధిస్తారా??

ఈ స్మార్ట్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యువత ఎప్పుడూ మొబైల్‌లో మునిగిపోతుంటుంది. ఎంతలా అంటే రోడ్డుపై నడుస్తున్నా.. చేతిలో మొబైల్‌ పట్టుకొని చాటింగ్‌ చేస్తూ.. సోషల్‌మీడియా, వీడియోలు

Updated : 26 Mar 2021 23:31 IST

ఈ స్మార్ట్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యువత ఎప్పుడూ మొబైల్‌లో మునిగిపోతుంటుంది. ఎంతలా అంటే రోడ్డుపై నడుస్తున్నా.. చేతిలో మొబైల్‌ పట్టుకొని చాటింగ్‌ చేస్తూ.. సోషల్‌మీడియా, వీడియోలు చూస్తూ, పాటలు వింటుంటారు. చుట్టూ ఉండే వాహనాలను గమనించకపోవడంతో ప్రమాదాలు సంభవించిన ఘటనలో ఎన్నో ఉన్నాయి. అయినా.. ఆ పద్ధతిని మానుకోవట్లేదు. ఇలాంటి వారిని నిత్యం మనం చూస్తూనే ఉంటాం. అయితే, చైనాలో ఇలా రోడ్డుపై నడుస్తూ ఎవరైనా ఫోన్‌ వాడితే వారికి పోలీసులు దాదాపు 52 చైనీస్‌ యెన్‌(రూ.584) చలానా వేస్తారు. ఆ మాత్రానికే చలానా వేస్తారా అని విస్తుపోకండి. ఇదొక్కటే కాదు.. మనం సాధారణ విషయంగా భావించే చాలా విషయాలను కొన్ని దేశాలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తుంటాయి. అవేంటో చూద్దామా..!

కారు విండో తెరిస్తే అంతే..

సాధారణంగా మనం కారును ఎక్కడైనా పార్క్‌ చేస్తే విండో గ్లాస్‌ మూసివేసే వెళ్తాం. తెరిచిపెడితే దొంగలెవరైనా కారులో వస్తువులు ఎత్తుకెళ్తారని మనం భయపడతాం. ఎవరు చెప్పకపోయినా, చట్టాలేవి లేకపోయినా మనం కార్‌ విండో మూసేస్తాం. అయితే, కెనడా.. ఆస్ట్రేలియా దేశాల్లో కారు పార్క్‌ చేస్తే విండోస్‌ కచ్చితంగా మూసివేయాలని చట్టం ఉంది. ఎవరైనా అలా మూయకుండా వెళ్తే వారికి కెనడాలో 81 కెనడా డాలర్లు జరిమానా విధిస్తారు. 


ఇంధనం తక్కువుంటే ఆ రహదారిపైకి రావొద్దు

జర్మనీలోని అటోబాన్‌ రహదారి.. అత్యాధునిక రహదారి వ్యవస్థ. నిత్యం బిజీగా ఉండే ఈ రోడ్డుపై తక్కువ ఇంధనంతో వెళ్తే పోలీసులు జరిమానా విధిస్తారు. ఎందుకంటే ఈ రోడ్డుపై వాహనాలు కనీసం గంటలకు వంద కి.మీ వేగంతో వెళ్తుంటాయి. అలాంటిది.. తక్కువ ఇంధనంతో వెళ్లి రహదారి మధ్యలో ఆగిపోతే.. ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించినట్లే. అందుకే రహదారికిపై వెళ్లే ముందే పోలీసులు కారులో ఇంధనం నిల్వ ఎంత ఉందో పరిశీలిస్తారు. తక్కువగా ఉన్నట్లయితే 70 పౌండ్లు జరిమానా వేస్తారు.


రుమాలు వేసి రిజర్వ్‌ చేసుకున్నారో..

రిజర్వేషన్‌ లేని బస్సుల్లో, రైళ్లలో.. క్యూలో నిలబడాల్సిన ఏ చోటైనా ముందుగా వచ్చి రుమాలు లేదా బ్యాగులు వేసి సీటు బుక్‌ చేసుకోవడం మన దగ్గర సాధారణమే. అయితే, ఇటలీలోని టుస్కానీ నుంచి సార్డానియా వరకు బీచుల్లో పడుకునేందుకు చోటును పర్యటకులు ఈ విధంగా ముందుగానే రుమాలు, బ్యాగ్‌లు పెట్టి బుక్‌ చేసుకోవడానికి వీల్లేదు. అలా ఎవరైనా చేస్తే 200 పౌండ్లు జరిమానా పడుతుంది. అలాగే బీచుల్లో మనం మట్టిగూళ్లు నిర్మిస్తుంటాం. కానీ, ఇటలీలో అలా కడితే 250 పౌండ్లు ఫైన్‌ వేస్తారు.


శుభ్రంగా ఉంచకపోతే భారీ జరిమానా

పబ్లిక్‌ టాయిలెట్లు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఎవరూ పరిశుభ్రత పాటించరు. సింగపూర్‌లో అయితే టాయిలెట్‌ను శుభ్రంగా ఉంచకపోతే 500సింగపూర్‌ డాలర్లు జరిమానా విధిస్తారు. అలాగే, అనుమతి లేకుండా ఇరుగుపొరుగు వారి వైఫైతో ఇంటర్నెట్‌ ఉపయోగిస్తే 10వేల సింగపూర్‌ డాలర్లు అపరాధ రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. 


లో దుస్తులు కనిపించేలా ప్యాంట్‌ ధరిస్తే..

కొంతమంది ఫ్యాషన్‌ పేరుతో లో దుస్తులు కనిపించేలా ప్యాంట్‌ను కిందకి వేసుకుంటుంటారు. ఈ స్టైల్‌ను ‘సాగ్గింగ్‌’అని పిలుస్తుంటారు. చాలా దేశాల్లో ఈ ఫ్యాషన్‌ నడుస్తుంది. కానీ, అమెరికాలోని టిమ్మన్స్‌విల్లే, సౌత్‌ కరోలినా సహ మరికొన్ని ప్రాంతాల్లో ఈ సాగ్గింగ్‌ స్టైల్‌ ప్యాంట్లు వేసుకోవడం నిషేధించారు. ఎవరైనా అలాంటి ప్యాంట్లు వేసుకొని కనిపిస్తే అధికారులు 600 డాలర్లు జరిమానా వేస్తారు.


కారులో బంగాళదుంపలు 5కేజీలు మించకూడదు

ఆస్ట్రేలియాలో ఒకప్పుడు తాత్కాలికంగా తీసుకొచ్చిన చట్టాన్ని ఇప్పటికీ అమలు చేయడం విచిత్రం. ది గ్రేట్‌ డిప్రెషన్‌, రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో ఆహారపదార్థాల రవాణాపై అనేక నిబంధనలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో బంగాళదుంపలను ఒకరు ఒకసారి కారులో కేవలం 5 కేజీల బంగాళదుంపలను మాత్రమే తీసుకెళ్లడానికి వీలుండేది. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలందరికీ ఆహారం అందుబాటులో ఉంచడం కోసం.. పెద్ద మొత్తంలో ఎవరూ ఆహారం నిల్వ చేసుకోకుండా ఈ చట్టాల్ని తీసుకొచ్చారు. అయితే, ఇప్పటికీ ఈ చట్టం అమల్లో ఉంది. ఎవరైనా కారులో 5 కేజీలకు మించి బంగాళదుంపలను తీసుకెళ్తే 2వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు చలానా విధిస్తారు.


ఆదివారం నిశ్శబ్దం పాటించాలి లేదంటే..

ఆదివారం ప్రపంచమంతా సెలవు దినం. వారమంతా ఆఫీసు, పాఠశాల అంటూ బిజీగా గడిపేవాళ్లు ఆదివారం సంతోషంగా గడపడాలని చూస్తారు. సినిమాలకు, షికార్లకు వెళ్తారు. ఇంట్లోనే టీవీ చూస్తూ.. పాటలు వింటూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే, జర్మనీలో మాత్రం మీరేం చేసినా బయటకు శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి వస్తుంది. ఆదివారం రోజున ఎవరూ శబ్దాలు చేయకూడదని అక్కడ నిబంధన. ఇరుగుపొరుగు వాళ్లు మీరు చేసే శబ్దాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారంటే.. 50వేల పౌండ్లు జరిమానా వేస్తారు.


అతి చిల్లరతో అనర్థం

చాలా మంది పలు సందర్భాల్లో చిల్లర లేదని బాధపడుతుంటారు. కానీ, కొంత మంది చిల్లర నాణేలతోనే షాపింగ్ చేస్తుంటారు. బ్యాగు నిండా నాణేలు ఇచ్చి వాహనాలు కొనుగోలు చేశారని గతంలో వార్తల్లోనూ చదివాం. అయితే, కెనడాలో డబ్బులు చెల్లించే సమయంలో ఎన్ని నాణేలు ఇవ్వాలో తెలిపే చట్టం ఉంది. నిబంధనకు మించి నాణేలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే.. జరిమానా విధిస్తారట. అయితే, ఎంత మొత్తం అనేది వెల్లడికాలేదు.


తింటూ వాహనం నడపొద్దు

తాగి వాహనం నడపకూడదని అన్ని చోట్ల చట్టం ఉంది. కానీ, కారు నడుపుతూ తినకూడదని ఇంగ్లాండ్‌ ప్రభుత్వం అంటోంది. ఎవరైనా తింటూ కారు నడిపిస్తే పోలీసులు 93 పౌండ్లు జరిమానా కట్టిస్తారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని