వింత హోటల్స్‌.. వెళ్లలేకపోయినా ఓ లుక్కేయండి!

తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు మనకు బస సదుపాయాల్ని కల్పిస్తూ అనేక హోటల్స్‌ కనిపిస్తాయి. డబ్బు చెల్లించే స్థాయిని బట్టి సౌకర్యాలు ఉంటాయి. అలా చిన్నపాటి హోటల్స్‌ నుంచి ఫైవ్‌స్టార్‌.. సెవెన్‌ స్టార్‌ హోటల్స్‌ అంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక పట్టణాల్లో ఈ హోటల్స్‌ ఉన్నాయి. సాధారణంగా

Published : 05 Sep 2020 15:53 IST

తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు మనం బస చేయాలంటే హోటళ్లు ఎక్కడున్నాయా?అని అన్వేషిస్తాం. డబ్బు చెల్లించే స్థాయిని బట్టి సౌకర్యాలు ఉంటాయి. అలా చిన్నపాటి హోటల్స్‌ నుంచి ఫైవ్‌స్టార్‌.. సెవెన్‌ స్టార్‌ హోటల్స్‌ అంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక పట్టణాల్లో దర్శనమిస్తాయి. సాధారణంగా హోటల్‌ అనగానే పెద్దపెద్ద భవంతులు.. సకల సదుపాయాలతో కూడిన గదులు మాత్రమే ఉంటాయి. కానీ అలా కాకుండా కొన్ని హోటల్స్‌ విభిన్నంగా, విచిత్ర నిర్మాణాలతో పర్యటకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా మనం అక్కడికి వెళ్లలేం. కానీ.. ఆ హోటల్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి..

ఆకాశానికి.. నేలకి మధ్యలో..

ఎక్కడైనా హోటల్ భూమి మీదే ఉంటుంది. కానీ పెరులోని సుస్కో ప్రాంతంలో హోటల్‌ మాత్రం భూమికి.. ఆకాశానికి మధ్యలో ఉంటుంది. సాక్రెడ్‌ వ్యాలీలో ఎత్తయిన కొండలకు అద్దాలతో తయారు చేసిన క్యాప్సుల్‌ ఆకారపు కొన్ని గదుల్ని వేలాడదీశారు. భూమికి దాదాపు 400 మీటర్ల ఎత్తులో ఈ గదులు వేలాడుతుంటాయి. వీటిలో బస చేయాలంటే ఆ కొండపైకి ట్రెక్కింగ్‌ చేస్తూ వెళ్లాలట. అక్కడికి వెళ్లడానికి కష్టపడాల్సి వచ్చినా.. ఆ గదుల్లోకి వెళ్లాక లోయ అందాలు, ప్రకృతి సోయగాలు చూసి ఆ కష్టమంతా మర్చిపోతారట. 


పెద్ద పేగు ఆకారంలో

పెద్ద పేగు ఆకారంలో ఉండే ఈ ‘కాసానస్‌’ హోటల్‌ బెల్జియంలో వెర్బెకే ఫౌండేషన్‌కు ఆర్ట్‌ పార్క్‌లోని సరస్సు పక్కన ఏర్పాటు చేశారు. జెయిప్‌ వ్యాన్‌ లీస్‌షాట్‌ అనే ఆర్టిస్ట్‌ ఈ డిజైన్‌ను రూపొందించారు. ఇందులో నీటి సదుపాయం, పడక, టాయిలెట్‌ ఉన్నాయి. ఒక రాత్రి బస చేయడానికి ఇద్దరికి 120యూరోస్‌(దాదాపు రూ. 10వేలు) చెల్లించాల్సి ఉంటుంది. 


జైలు హోటలైంది 

నేరం చేయకుండా జైలుకెళ్లాలంటే లాట్వియా దేశంలోని కరోస్టా ప్రిజన్‌ హోటల్‌ను సందర్శించాల్సిందే. ఎందుకంటే ఆ హోటల్‌ ఒకప్పుడు జైలు. లాట్వియా నుంచి పారిపోయేందుకు యత్నించిన వారిని సోవియట్‌ సైన్యం ఈ జైలులో బంధించేదట. ఆ జైలునే ప్రస్తుత యాజమాన్యం హోటల్‌గా మార్చేసి.. పర్యాటకులకు జైలు అనుభవాన్ని కల్పిస్తోంది. ఇక్కడి సిబ్బంది పోలీసు దుస్తుల్లో కనిపిస్తుంటారు. పర్యాటకులు ఇక్కడికి వస్తే ఖైదీల దుస్తులు వేసుకొని, జైలు గదుల్లో నేలపై నిద్రపోవాల్సి ఉంటుంది. 


భారీ ఓడే హోటల్‌గా..

సముద్రంలో ప్రయాణించే భారీ ఓడల్లో హోటళ్లు ఉంటాయని తెలుసు.. కానీ భారీ ఓడ హోటల్‌గా మారిపోతే..? అమెరికాకి చెందిన ఆర్‌ఎంఎస్‌ క్వీన్‌ మేరీ ఓడ అలాగే మారింది. 1936-67 మధ్య ఈ లగ్జరీ క్రూయిజ్‌ ఓడ పర్యాటకులను దూర ప్రాంతాలకు తీసుకెళ్తూ యాత్రలు నిర్వహించేది. అయితే కొన్నేళ్ల కిందట ఆ ఓడను కాలిఫోర్నియాలోని బీచ్‌లో స్థిరంగా ఉంచేశారు. ఆ తర్వాత దాన్ని పూర్తిస్థాయిలో హోటల్‌గా మార్చేశారు. ఇందులో 347 ఫస్ట్‌క్లాస్‌ గదులు ఉన్నాయి. కస్టమర్లకు ఓడలో ప్రయాణిస్తున్నట్లు అనుభూతి కల్పించే ఈ క్వీన్‌ మేరీ హోటల్‌కు భయానక నేపథ్యం కూడా ఉంది. ఈ ఓడ సర్వీసులో ఉన్నప్పుడు దాదాపు 50 మంది ఈ ఓడలో మరణించారట. వారి ఆత్మలు ఈ ఓడలోనే ఉన్నాయని కొందరు చెబుతున్నారు. 


ఆదిమానవుల్లా

చక్కటి పడక, నిరంతర విద్యుత్‌ సరఫరా, ఏసీ, కాల్‌ చేస్తే గదులోకి వచ్చే భోజనం ఇవన్నీ ఉండేవే హోటల్‌ అవుతుందా? అవేమీ లేని పూరి గుడిసె కూడా హోటల్‌ గదులుగా మారిపోయాయి. స్వీడన్‌లోని స్కిన్‌స్కెట్టర్‌బర్గ్‌లోని కోలార్బిన్‌ ఎకోలాడ్జ్‌ హోటల్‌లో ఈ వినూత్న గదులు ఏర్పాటు చేశారు. అడవుల్లో దొరికే కలప, గడ్డి, చెట్లకొమ్మలు బంకమట్టితో నిర్మించుకున్న గుడిసెల్లాంటి వాటినే ఇక్కడ నిర్మించారు. ఇందులో విద్యుత్‌ సరఫరా ఉండదు, లగ్జరీ పడకలు ఉండవు. పర్యావరణహితంగా ఉండే వీటిలో బస చేస్తే ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. అటవీ జంతువులు చేసే శబ్దాలను వినొచ్చు. ఆధునిక లోకానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరొచ్చు. చాలా మంది ఇక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారట. ప్రస్తుతం కుదరదునుకోండి.


రైలు బోగీలు హోటల్‌ గదులయ్యాయి

ఇటీవల కరోనా వ్యాప్తి దృష్ట్యా రైలు బోగీలను కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చిన విషయం తెలిసిందే. కానీ పెన్సిల్వేనియాలో ఓ వ్యక్తి ఐదు దశాబ్దాల కిందట రైలు బోగీలను హోటల్‌ గదులుగా మార్చేశాడు. డొనాల్డ్‌ ఎం. డెన్‌లింగన్‌ అనే వ్యాపారి 1970లో అక్కడి కేంద్ర రైల్వేశాఖ నుంచి 19 బోగీలను కొనుగోలు చేసి అమిశ్‌ కౌంటీలో హోటల్‌ ఏర్పాటు చేశాడు. కొన్నింటిని పడక గదులుగా.. మరికొన్నింటిని భోజనశాలగా మార్చాడు. ప్రస్తుతం ఇక్కడ 48 రైలు బోగీలున్నాయి. పక్కనే రైల్వేట్రాక్‌ ఉండటం విశేషం. వెళ్తున్న రైళ్లను చూస్తూ.. రైలు బోగీలో భోజనం చేస్తూ,  విశ్రాంతి తీసుకుంటూ ఉంటే భలే ఉంటుందట.


అద్దాల ఇగ్లూలో

మంచు ప్రాంతాల్లో మనుషులు నిర్మించుకునే ఇల్లే ఇగ్లూ. పూర్తిగా మంచుతో దీన్ని నిర్మిస్తుంటారు. కానీ ఉత్తర ధ్రువానికి దగ్గర్లో ఉన్న ఫిన్‌లాండ్‌లోని కక్స్‌లాటెనెన్‌ ఆర్కిక్ట్‌ రిసార్ట్‌లో చెట్ల మధ్యలో మంచుగడ్డలపై అక్కడక్కడ అద్దాలతో చేసిన ఇగ్లూలను నిర్మించారు. ఇందులో ఇద్దరు మాత్రమే ఉండగలరు. రాత్రివేళ్లలో ఈ ఇగ్లూ అద్దాల నుంచి బయటకు చూస్తే వెన్నెల్లో ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.


జిరాఫీలతో కలిసి భోజనం చేస్తారా?

కెన్యాలోని నైరోబీలో జిరాఫీ మనార్‌ అనే రిసార్ట్‌ ఉంది. 12 ఎకరాల్లో నిర్మించిన ఈ రిసార్ట్‌లో సిబ్బందితోపాటు అంతరించిపోతున్న జాతికి చెందిన జిరాఫీలు ఉంటాయి. కస్టమర్లు ఈ ఇక్కడి హోటల్‌ గదిలో తింటుంటే.. జిరాఫీలు వాటి పొడవాటి మెడను కిటికి లోపలకి దూర్చి కస్టమర్లతో పాటు అవి కూడా తినేందుకు సిద్ధమవుతాయి. మీరు తినే దాంట్లోనే కొంత వాటికి పెట్టొచ్చు. లేదా ప్రత్యేకంగా ఆర్డర్‌ చేసి తినిపించొచ్చు. వాటితో కాసేపు కాలక్షేపం చేయొచ్చు. 


ప్రార్థన మందిరమే హోటలైంది

ప్రార్థనా మందిరాలకు ఎన్నాళ్లయినా వాటి పవిత్రత అలాగే ఉంటుంది. ఒకవేళ అలాంటి మందిరాలు ధ్వంసమైనా తిరిగి వాటిని పునర్న్మించాలనుకుంటాం. కానీ నెదర్లాండ్స్‌లో మాస్ట్రిచ్‌లోని 15వ శతాబ్దం నాటి ఓ చర్చిని హోటల్‌గా మార్చేశారు. ఇందులో 60 గదులున్నాయి. ఉదయం పూట సూర్యకాంతి అద్దాలగుండా గదుల్లో పడటం ఈ హోటల్‌ ప్రత్యేకత. 


ఏడాదికో రకంగా ఉండే హోటల్‌

హోటళ్లను చాలాకాలం పాటు మన్నికగా ఉండాలని నాణ్యమైన ఇటుకలు, సిమెంట్‌తో కడతారు. స్వీడెన్‌లోని జుక్కాస్‌జర్విలో ఉన్న ఐస్‌ హోటల్‌ అందుకు భిన్నం. పేరులో చెప్పిన్నట్టే ఇది దీనిని ఐస్‌తో నిర్మిస్తుంటారు. ఏటా శీతాకాలంలో దీన్ని నిర్మిస్తారు. శీతాకాలం ముగియగానే ఈ హోటల్‌ కరిగి నీరుగా మారి దగ్గర్లోని నదిలో కలిసిపోతుంది. అందుకే ఏటా ఒక్కో డిజైన్‌లో ఈ ఐస్‌ హోటల్‌ను నిర్మిస్తుంటారు. తాత్కాలికంగా ఉండే ఈ హోటల్‌ను సందర్శించేందుకు పర్యాటకులు క్యూ కడతారట. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని